Monday, November 11, 2019

మనం మరచిన మన తెలుగు తొలి వాగ్గేయకారుడు కృష్ణమయ్య



తెలుగు  తొలి  వాగ్గేయకారుడు శ్రీకాంత కృష్ణమాచార్యులు 

మొదటి భాగం 

అప్పన్న స్వామి నిజ రూపం 
ఉత్తరాంధ్ర అనగానే మనకు  మొదట గుర్తుకు వచ్చేది సింహగిరి నాధుడు  సింహాద్రిఅప్పన్న మరియు ఆయన కొలువు తీరిన సింహాచలం .కోరిన వారి కొంగుబంగారము మన అప్పన తండ్రి. ఆ అప్పన్న తండ్రి భక్తుడే  తెలుగు తొలి వాగ్గేయకారుడు  శ్రీకాంత కృష్ణమాచార్యులు.ఈయన కృష్ణమయ్య గా కూడా  ప్రసిద్ధి. తన గానంతో స్వామి ని పిలిచి తన సంకీర్తనతో స్వామిని మెప్పించి   స్వామి  ని నాట్యమడించిన  అసామాన్య  భక్తుడే ఈ కృష్ణమయ్య.అన్నమయ్య ఆ తురుమలేశుడు  మీద  సంకీర్తనలు  వ్రాసి పాడి మన తెలుగు వారి హృదయం లో చోటు  చేసుకుంటే   ఈ కృష్ణమయ్య  దేవా అని సంభోధనతో తన సంకీర్తనను మొదలుపెట్టి "సింహగిరి నరహారి నమో నమో ధయానిధి" మకుటంతో పూర్తి అయ్యే 4లక్షల 32వేల సంకీర్తనలు రచించి స్వామి కె అంకితం ఇచ్చిన సింహగిరి వరాహ నరైంహస్వామి  భక్తుడు  శ్రీ కాంత కృష్ణమాచార్యులు. కృష్ణమయ్య ఆళ్వారు శ్రేణికి చెందిన  తెలుగులో మొదటి పద కవితాచార్యుడు  మరియు అన్నమయ్య కంటే ముందు సంకీర్తనలు వ్రాసి పాడిన వాగ్గేయకారుడు.మన దురదృష్టం యేమిటంటే ఈయన పేరే చాలమందికి తెలియదు ఇంకా ఆయన సంకీర్తనలు కూడా చీకటి లోనే వుండిపోయాయాయి.ఈ గొప్ప భక్తుడి జీవిత చరిత్ర   అబ్బురమనిపించే కధనం.
శ్రీకాంత కృష్ణమాచార్యులు క్రీ.శ. 1295 నుండి క్రి.శ.1323 మధ్య కాలంలో ఓరుగల్లును రాజధానిగా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలానికి చెందిన వాడు. ` ప్రతాప చరిత్ర 'సిద్దేశ్వర చరిత్ర'తిరగవేస్తే ఈయన జీవితం చరిత్ర కనిపిస్తుంది. ఈ గ్రంధం ఆధారంగా  కృష్ణమయ్య గురించి వెలుగు లోకి తెచ్చింది నిడదవోలు  వెంకట రావు గారు. కృష్ణమయ్య తన `జన్మ సంకీర్తన' లో  జన్మ విశేషాలు ఇలా చెప్పుకున్నారు ఆయన  `తారణ' నామ సంవత్సరం, భాద్రపద కృష్ణ చతుర్దశి, మంగళ వారం నాడు జ్యేష్టా నక్షత్రములో సంతూరు అనే గ్రామంలోజన్మించారని, ఆయన  పుట్టుకతో అంధుడు  అవ్వటం వలన  తల్లి తండ్రులు  ఒక పాడైపోయిన నూతిలో పడవేయగా కృష్ణ కువ్వారు స్వామి అనే ఒక సాధువు కృష్ణమాచార్యుల వారిని  కాపాడి తమ ఆశ్రమానికి తీసుకుపోయి పెంచి పెద్దచేసారనీ నృసింహస్వామి అనుగ్రహంతో   చూపు వచ్చిందనీ,స్వామి ఆదేశం మేరకు నాలుగు లక్షలు పైగా సంకీర్తనలు వ్రాసి పాడి నట్టు చెప్పుకున్నారు. ఆకలి తో ఏడ్వడం చూసిన కృష్ణమయ్య వద్దకు సింహాధ్రి అప్పడే స్వయంగా పాలు తీసుకొని వెళ్ళి త్రాగించడంతో ఆ బిడ్డకు తిరిగి కళ్ళు వచ్చాయి.కృష్ణకవ్వారు స్వామిజీ రక్షించిన బిడ్డను తల్లితండ్రులు తిరిగి తీసుకొని కృష్ణమాచార్యునిగా నామకరణం చేసారని  కూడా కొందరు చెపుతారు.స్వామి దయతో తన కు అంధత్వం పోవడంతో తన జీవితాన్ని స్వామి కే అంకితమిచ్చారు కృష్ణమయ్య.జన్మస్థలం మహబూబనగర్ జిల్లా లో  సంతూరు అని కొందరు అంటే సింహాచలం దగ్గరిలో ఈలాంటి పేరు తో  వున్న గ్రామాలు వున్నాయి కాబట్టి కృష్ణమయ్య సింహాచలం  దగ్గర ఉన్న సంతూరు లో జన్మించారని  ఆరుద్ర మరికొందరు బావిస్తున్నారు.
కృష్ణమాచార్యునికి మేనమామ కూతురితో వివాహం జరిగింది. వీరి ఏకైక కుమారుడు తన ఏడవ యేటనే మరణించటంతో, ఆ ఆవేదననధిగమించే ప్రయత్నంలో తన సంకీర్తనలో మరింతగా మునిగిపోయాడు. కృష్ణమయ్య సంకీర్తనం చేస్తూ ఉంటే నరసింహస్వామి బాలుని రూపంలో వచ్చి నాట్యం చేసేవారని ప్రతీతి. కృష్ణమయ్య వయసు వచ్చాక తన మహిమలతో ప్రజలని దిగ్భ్రాంతుల్ని చేసి`పదకొండవ అవతారుని'గా భావించేవారట .కామి కానీ వాడు మోక్షగామి కాదు అనేది లోకోక్తి.మన కృష్ణమాచార్యుని విషయం లో కూడా ఈ ఘటన జరిగింది.   పరిపూర్ణ యవ్వనంతో ,మంచి వర్చస్సు తో  నున్న ఆచార్యులవారు స్వామి ఎదుట చిరుతాళాలు మోయిస్తూ, దండెం మీటుతూ, సింహాద్రినాథుని కీర్తిస్తున్న దృశ్యం చూసి,మోహిని  అనే దేవదాసి ఆయనపై మనసు పడింది.ఆమె అసమాన సౌందర్యం, హావభావాల చొరవ, కపటం లేని సాహచర్య కాంక్షతో, ఆచార్యుల వారి హృదయాన్ని ఆకట్టుకున్నదా మోహనాంగి.కానీ ఆమెతో ఎంత వున్న వరాహ స్వామి ఆరాధన  సంకీర్తన మాత్రము  ఎల్లపుడూ సాగుతువుండేవి.ఒకసారి యేమి జరిగినది అంటే ఆచార్యుల వారి భక్తి ,సంకీర్తన ల మహిమ శ్రీ రంగం లో వున్న ఇద్దరు విష్ణు భక్తులు విని ఆచార్యుల వారి దర్శనం కోసం శ్రీరంగం నుండి సింహాచలం వచ్చారట.ఇక్కడ మన అప్పన్న స్వామి లీల చూడండి.ఆ ఇద్దరు భక్తులు ఆచార్యుల వారిని వెతుకుంటూ దేవదాసీ ఇంటి దగ్గరకి వచ్చి కృష్ణమాచార్యుని నే వారినే  ఆ వరాహ స్వామి భక్తగ్రగణ్యుడు అయిన కృష్ణమయ్య ఎక్కడ వుంటారు అండి.సాక్షాత్తు  ఆ వరహస్వామి నే తన సంకేర్తన తో ఓలలాడించి ,స్వామినే స్వయంగా నాట్యం ఆడేటట్టు చేసుకున్న ఆ భాగవోత్తముడు అయిన ఆచార్యుల వారిని చూసి మా జన్మ తరింపచేసుకుందామని శ్రీరంగం నుండి ఇక్కడికి ఈ సింహాచలం వచ్చామయ్యా అని విన్నవించుకున్నారట.అప్పుడు ఆచార్యుల వారికి నేనే ఆ క్రిష్ణమయ్య ని చెప్పుకోవటానికి చాలా సిగ్గుగా అనిపించింది ఆట.అయ్యో నేను ఎలాంటి నీచమైన  స్తితిలో ఇక్కడ దేవదాసీ ఇంటి దగ్గర వున్నాను. వీరు నన్ను ఇలా చూస్తే ఏమనుకుంటారు అని మధనపడి వారికి ఆచార్యుల వారే వారు వెళ్లాలిసిన  చిరునామా  త్రోవ చెప్పి ఆచార్యుల  వారు పరుగు పరుగున  అడ్డదారి లో వారికంటే ముందే అక్కడికి  చేరుకొని శిరోముండనం చేసుకొని  తనని  గుర్తుపట్టకుండా తలకి  బట్ట కప్పుకొని వారిని కలిసారట.ఆ క్షణం నుండి అన్నీ సాంగత్యలు వీడి పూర్తిగా అప్పన్న ద్యాస మరియు ద్యానం లో మునిగిపోయారు ఆచార్యుల వారు.ఒకోసారి మనలాంటి వారికి ఇంతటి మహాభక్తునికీ  ఈ వికారా లేమిటి అనిపించవచ్చు.కానీ అంతా విష్ణు మాయ కదండీ . ఎవరి కర్మ శేషం వాళ్ళు అనుభవించాలి మరి.కర్మ ఫలం అనుభవించేటప్పుడు భగవంతుడు సాక్షిబూతుడు గానే వుంటాడు మరి ఎందులోనూ కల్పించుకోడు. సమయం వచ్చినప్పుడు మాత్రము ఏదో ఒక ఘటన  ద్వారా జీవితాన్ని మలుపు తిప్పి తన భక్తులను సరియయిన త్రోవలోకి  తీసుకు వస్తారు.ఎంతైనా స్వామి భక్త సులభుడు కదా.

11వ శతాబ్దం లో సంకీర్తనలు పాడుతున్న కృష్ణమయ్య వద్దకు బాలుడుగా వచ్చి ఆడిపాడి ఆనందింప జేశాడు మన అప్పన్న స్వామి.తొలి తెలుగు అక్షరాన్ని కృష్ణమయ్య సంకీర్తన  వింటూ ఆయన తొడ మీద కూర్చొనీ రాగి రేకు మీద లిఖించింది సింహాచల వరాహానరసింహుడే.ఆయన ఆ విధంగా రచించి ఇవ్వడం చూసిన కృష్ణమయ్య ఆనాటి నుండే 432000 సంకీర్తనలు రాగి రేకుల పై లిఖించి స్వామికి అంకితమిచ్చారు.ద్రవిడాంధ్ర అక్షరాలను వచన సంకీర్తనంగా తొలి సారి లిఖించింది "సింహాధ్రి అప్పన్న స్వామి".కానీ మన దురదృష్టం ఒక 200 పాటలు మాత్రమే లబ్యమవుతున్నాయి.ఇలా ఎందుకు జరిగింది అంటే ఒక అద్భుతమైన గాధ బాగా ప్రాచుర్యం లో వుంది. ఆ కధ ఇంకా మరికొన్ని విశేషాలు  నా తరువాతి బ్లాగ్ లో  పొందుపరుస్తాను.

ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః 

2 comments:

  1. ఇలా కనుమరుగైన వారు అవుతున్న వారు ఏందరో కదా ..

    ReplyDelete
    Replies
    1. అవును,అటువంటి మహానుభావులని గుర్తించి వారికి చరిత్ర లో సముచితమైన స్థానం ,గౌరవం ఇవ్వటం మన బాధ్యత .

      Delete