Monday, June 15, 2020

పంచారామాలు- కుమారభీమారామం-సామర్ల కోట



పంచారామాలు- కుమారభీమారామం




పంచారామాలు- కుమారభీమారామం-శ్రీ చాళుక్య కుమారామ భీమేశ్వరస్వామి
పంచారామలలో ఒకటి అయిన  శ్రీ కుమారామా భీమేశ్వర  క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోట లో వుంది.ఇక్కడ  కుమారస్వామే స్వయం గా లింగాన్ని ప్రతిష్టించారని అందుకే ఈ క్షేత్రానికి కుమారామం అని అంటారని ప్రతీతి. సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు  9 వ శతాబ్ధం చివరలోనిర్మించాడని పిఠాపురం లో దొరికిన ఒక శాశనం ద్వారా తెలుస్తోంది. . ఈయనే ద్రాక్షరామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకె ఈ రెండు దేవాలయాలు ఒకేవిదముగా వుంటాయి.అంతే కాక  ఈ రెండు గుడుల నిర్మణానికి ఉపయోగించిన రాయి  మరియు నిర్మాణ శైలి కూడా ఒకటే. ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892 లో ప్రారంభమై సుమారు క్రీ.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంటుంది. ఈ దేవాలయం లో కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును.
సామర్లకోట లోని భీమేశ్వర స్వామిని కుమారస్వామి నే  స్వయంగా ప్రతిష్టించడం వలన దీనికి “కుమారారామ” అని పేరు వచ్చింది అని పౌరాణిక ప్రశస్తి.


 

చారిత్రికంగా చూస్తే క్రీ.శ 872 నుండి 971 వరకు మొదటి చాళుక్య భీమ నృపాలుడు కమారామము ను రాజధానిగా చేసుకొని రాజ్యపాలన  సాగించారు.ఆ చాళుక్య మహారాజు  ఆ స్వామి యందు  అమితమైన భక్తి అందుకని సువిశాల ప్రాకర మందపాడులని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడు.ఆ పారమైన భక్తి వలనే స్వామి చాళుక్య కుమారామ భీమేశ్వరుడు అయినాడు .రాజు పేరు తో స్వామి పేరు  తో ఊరు చాళుక్య భీమవరమైంది.అంతే కాక సామర్లకోట పేరు వెనుక చాలా కధలు వున్నాయి.అందులో ఒకటి పూర్వం ఇక్కడ వైష్ణవ స్వాములు ఎక్కువగా వుండేవారని , ఈ గ్రామం వారికి  కోట వలె చాలా  సురక్షితం గా వుండేదని కాబట్టి స్వాముల కోట అనేవారని అదే కాలక్రమేణ  సామర్లకోట గా మారింది అని కొందరు చెపుతారు.
ఇంకొక కధ యేమిటంటే ఇక్కడ శ్యామలాంబ గూడు వుండేదని దాని చుట్టూ కోట వుండేదని ఆ కారణం గా శ్యామలకోట అని పిలిచివారని అదే కాలాంతరంలో సామర్లకోట గా మారింది అని అంటారు.ఏది ఏమైనా  ఇవన్నీఈ మద్యకాలం లో వచ్చిన పేర్లు కావొచ్చు కానీ చాళుక్య భీమవరం,కుమారామం అనేవి సామర్లకోటే కోట కు ఎప్పటినుందో వున్న పేర్లు అని మనకి శ్రీనాధుని  సాహిత్యం వలన తెలుస్తుంది.అంతే కాక శిలశాసనాలు కూడా ఈ విషయాన్నే బలపరుస్తున్నాయి.ఇప్పుడు శ్రీ కుమారామ భీమేశ్వర ఆలయం వున్న భీమవరం గ్రామాన్ని,సామర్లకోట ని గోదావరి పంటకాలువ వేరు చేస్తూ ప్రవహిస్తుంది.ఈ కాలువకి ఉత్తరాన  పట్టణం,దక్షిణాన ఆలయము వున్నాయి.


ఆలయ నిర్మాణ శైలి చూస్తే ద్రాక్షారామం లోని భీమేశ్వర ఆలయాన్ని పోలి వుంటుంది.ఈ గుడి చుట్టూ చెక్కిన ఇనుపరాతి తో కట్టిన రెండు ప్రాకరాలు వున్నాయి.బయట ప్రాకరానికి నాలుగు వైపులా నాలుగు గోపురాలు వుంటాయి.ఈ గోపుర ద్వారానికి ఇరువైపుల  అర్ధమండపాలు  వుంటాయి.ఇంకా లోపలి ప్రాకారం లోకి వస్తే ఇది సమతలం గా రెండు భాగాలుగా చేయబడి మద్య లో ఒక చూరు వుంటుంది.ఈ లోపలి ప్రాకారం వెనుక గోడ ను ఆధారం గా కెఃసుకొని రెండు అంతస్తుల మండపం నిర్మించారు.ఈ లోపలి మండపం లో క్రింద భాగం లో దక్షిణం వైపున గణపతి ,సూర్యుని గుడి,తూర్పున అమ్మవారు గిరిజ సుందరి గుడి వుంటాయి.భీమేశ్వరుని దేవాలయం  లోపలి ప్రాకారం మద్యలో చతురాస్రాకారంగా రెండు అంతస్తులలో  నిర్మించారు. రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివ లింగం, సున్నపు రాయి చే నిర్మితమై శివలింగఆధారం క్రింది గదిలో వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడ చేస్తారు. మొదట మొదటి అంతస్తులో వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని భక్తులు దర్శించుకుంటారు. మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపులనుండి మెట్లు వున్నవి మొదటి అంతస్తు కి దక్షిణ వైపుగా  వున్న మెట్ల మీదుగా ప్రవేశించాలి.ఈ రెండు అంతస్తులు ద్రావిడ శైలి లో వుంటాయి.

 

గుడి ఆవరణ లో భీమేశ్వర ఆలయం పోలిక తో చేసిన ఒక చిన్న నమూనా గుడి వుంటుంది.
ఆలయ శైలి లో ఒక విశేషం ఏమిటంటే ప్రతి శిలా స్తంభం దేని  కదే ప్రత్యేకం గా వుంటుంది.ఏ రెండు స్తంభాలు ఒకేలా వుండవు,ప్రతి స్తంభం నిర్మాణం లోనూ ఎంతో కొంత వైవిద్యం వుంటుంది. ఆలయము లోని మండపం నూరు  స్తంభల్తో  నిర్మించబడింది.గుడిలోకి ప్రవేశించగానే కనిపించే ఏక శిలా నంది విగ్రహం  ఒక సజీవ శిల్పం ,చాలా అద్భుతం గా ఉంటుంది.రెండవ అంతస్తులో  ప్రదక్షిణ చేసే మార్గం లో  స్వామి ఎదురుగా నిలచినప్పుడు కుడి ప్రక్కన స్తంభం పైన జ్యోతిర్లింగం అయిన శివుని యొక్క ఆద్యంతాలు కనుక్కునే పందెంలోవిష్ణు మూర్తి  వరాహ రూపం  లింగం మొదలు కనుక్కోవటానికి,  బ్రహ్మ  లింగం యొక్క చివరి భాగం కనుక్కోవటానికి హంస వాహనం పై ప్రయాణించే   దృశ్యాన్ని అత్యంత అద్భుతం గా స్తంభం పై చెక్కబడి వుంటాయి.ఇంకా లింగోపరితలం నుండి జారీ పడే కేతకు పుష్పం, సురభి ఆవు  ల దృశ్యాలని కూడా ఈ  స్తంభం పై చెక్కిన శిల్పాలలో చూడవచ్చు.



ఉత్తమ సాధన కై సాధన యందు కొన్ని మెట్లు ఎక్కితేనే కానీ భగవంతుని అనుగ్రహం లభించదు అనే సత్యాన్ని తెలియచెప్పటానికి అన్నట్టు వుంటాయి మనం ఎక్కవలిసిన మెట్లు.అవి కూడా చాలా చిత్రంగా రెండు దార్లు వుంటాయి.గర్భ గుడికి ఆగ్నేయం వైపున సూరి ద్వారం,ఉత్తరం ఈశాన్యం వైపు నా  చంద్ర ద్వారం.ఇవి ఎలా వుంటాయి అంటే గర్భగుడికి రెండు నాసికా రంధ్రాల లా వుంటాయి. ఎలా అంటే మనిషి  యొక్క నాసిక రంధ్రాలలో ఎడమ వైపుది చంద్ర నాడీ,కుడి వైపుది సూర్య నాడీ ,యోగి  యోగ మార్గం లో  ఈ రెండు నాదుల ద్వారా ప్రాణమయము ప్రక్రియ ద్వారా  ప్రాణము ని సహస్రారమున వుంచి ఆ ప్రాణం తో తన మనస్సు ను కూడా అక్కడికి చేర్చి ఆనందమయుడై వుంటాడు.ఈ భీమేశ్వర స్వామి దర్శనం కూడా ఈ రెండు మెట్ల దారి ద్వారా మనకి ఈ  యోగమార్గాన్నే చెపుతుంది.

 

అమ్మలు గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ  ఇక్కడ బాల త్రిపుర సుందరి పేరు తో స్వామి వారి దేవేరి గా కొలువై వుంది.ఆ చల్లని తల్లిని చూడటానికి  రెండు కళ్ళు చాలవు .ఆ కరుణామయి తన చల్ల్ని చూపులతో  తాన భక్తులు అయిన బిడ్డలను సదా కాపాడుతువుంటుంది.ఈ ఆలయం లో అమంవారి తో పాటు ఆలయం చుట్టూ వున్న మండపం లో చిన్న చిన్న గదులలో ప్రధాన దేవతలు కొలువు తీరి స్వామి ని సేవిస్తూ  దర్శించ వచ్చిన భక్తులను అనుగ్రహిస్తూవుంటారు.మహా గంపతి,కుమార స్వామి,వీరబధ్రుడు,దత్తాత్రేయులు,బ్రహ్మ,సర్స్వతి,సూర్యనారాయణుడు,మహిషాసుర మర్ధిని ఇంకా సప్త మాతృకలు కొలువు తీరి ఆ భీమేశ్వరుడిని  దర్శించటానికి విచ్చేసిన భక్తుల కోరికలు పాలిస్తువున్నారు.ఇక్కడ వున్న మహిషాసుర మర్ధిని విగ్రహం తవ్వకాలలో బయట పడింది.దీనిని కొండవీటి రాజు అయిన కాటయ వేమారెడ్డి 15వ శతాబ్ధం లో ప్రతిష్టించినట్టు చెపుతారు.ఈ మహిషాసుర  మర్ధినికే శ్యామల శక్తి  అని కూడా అంటారు.

ఈ ఆలయ నిర్మాణం లో మరో విశేషం ఏమిటంటే చైత్ర,వైశాఖ మాసాలలో  సూర్య దేవుని కిరణాలు ఉదయం పూట అయ్యవారి  పాదాలను ,సంద్య వేళ అమ్మవారి పాదాలను  తాకుతూవుంటాయి.ఆలయం పడమటి గోడ మీద వున్న గణపతి ని వజ్ర గంపతి అంటారు ఎందుకంటే  ఆయన నాభి లో కాంతివంతమైన  వజ్రం వుండేది ఆట.ఆ వజ్రం నుండే వచ్చే కాంతి రాత్రి పూట భక్తులకు మార్గ దర్శకముగా వుండేది ఆట.ఇప్పుడు ఆ వజ్రం లేదు కాని  నాభి  వజ్రం వున్న చోట ఖాళీ గా కనిపిస్తుంది.ఆలయం లో లోపలి ప్రాకారం బయట  కల భైరవ స్వామి క్షేత్ర పాలకుడా గా మనకి  కనిపిస్తారు.

ఈ ఆలయానికి తూరుపు దిక్కున  పుష్కరిణి వుంది .దీనిని భీమగుండం అంటారు.ఇక్కడినుండి నీళ్ళు తెచ్చుకొని గుడి ఆవరణ లో వున్న శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకం చేయవచ్చు.ఈ దేవాలయానికి  పడమట వైపున ఏక శిలా స్తంభం వుంది.దీని కప్ప స్తంభం అంటారు.దీని పైన చెక్కబడి వున్న శిలా శాసనం బట్టి నిధి ఆశతో కొందరు దొంగలు నంది ని తొలగించినట్టుగాను నరసిముడి భార్య రాజమండ్రి లోని కోటిలింగాల నుండి రాతిని తెప్పించి కొత్త నందిని పునః ప్రతిష్ట చేయించి నట్టు తెలుస్తుంది.




 శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి బాలత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. అయిదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. 
ఈ గుడి  నుండి బయటికి వచ్చిన తరువాత  ఒక 200 గజాల దూరం లో 5 నిమిషాల నడక దూరం లో మాండవ్య నారాయణ స్వామి ఆలయం వుంది. భీమేశ్వర ఆలయం కి వెళ్లినప్పుడు తప్పకుండ  చూడాలిసిన ఆలయం .ఈ ఆలయం కూడా కాలువ పక్కనే వుంటుంది ,ఎలాంటి ప్రయాణ సాధనాలు అక్కరలేదు నడిచి వెళ్లవచ్చు.
ఇక్కడ  మాండవ్య అనే ఒక మునీశ్వరుడు నారాయణ స్వామి కొరకు తప్పస్సు చేసి నారాయణుడుని ప్రసన్నం చేసుకున్నారని ఆ నారాయణ్ స్వామి ఇక్కడ వెలిశారని అందుకే ఈ గుడిని మాండవ్య నారాయణ స్వామి  ఆలయం అని చెపుతారు.ఈ ఆలయం కూడా అందమైన శిల్పా కళ తో నిర్మించారు.ఇక్కడికి మాండవ్య మహర్షి దర్శనం చేసుకోవటానికి  ఇంద్రుడు పుష్పక విమానం పై వచ్చేవాడని చెపుతారు.


ఇవే కాకుండా పై రెండు ఆలయాలకంటే కూడా ఇంకా పురాతనమైన ఆలయం  వుంది అధి  త్రిముఖ లింగాలయం గా పిలవబడుతోంది.ఇక్కడ వున్న శివ లింగం మూడు ముఖములతో వుండటం వలన త్రిముఖ లింగం గా పిలవబడుతోంది.మూడు ముఖములు  త్రిమూర్తులు అయిన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులుగా  బావిస్తారు.ప్రస్తుతం ఈ గుడి పూర్తిగా శిధిలావస్థలో వుంది లింగం యొక్క పై బఃగమ్ మాత్రమే చూడగలము.లింగ ఎత్తు సూమారుగా 14అడుగులే వుంటుంది.

 సామర్ల కోట  చేరుకోవటం చాలా సులువు . సామర్లకోట సొంతంగా రైల్వే స్టేషన్ కలిగి ఉన్నది. రైల్వే స్టఇక్కడికి వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్లన్నీ ఆగుతాయి. రైల్వే స్టేషన్ లో దిగి, అక్కడి నుండి ఆటోలో కిలోమీటర్ దూరంలో ఉన్న కుమారారామము క్షేత్రం చేరుకోవచ్చు. సామర్లకోట కు రాజమండ్రి, కాకినాడ మరియు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి బస్సు సౌకర్యం కలదు.కాకినాడ నుండి సామర్లకోట ప్రయాణంచాలా బావుంటుంది .గోదావరి వెంబడి చుట్టూ పచ్చని  పొలాలు రోడ్ కి ఇరువైపుల పెద్ద పెద్ద చెట్లతో చాలా ఆహ్లాదముగా వుంటుంది. అంతే కాకుండా , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర  కార్తీక మాసం లో ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది.




ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః