Friday, July 8, 2022

నాలో నేను


నాలో నేను 


చిరాకులు చికాకు తెప్పిస్తుంటే

గొంతు నుండి బయటికి రాని బాధ భయపెడ్తుంటే

కనికరం  అనేది లేని కష్టం కలవరపెడుతుంటే

ఏకాంతం  నిశ్శబ్దంగా   వెక్కిరిస్తుంటే

ఎక్కడికి అని జీవన గమనం  ఆగకుండా ప్రశ్నిస్తూవుంటే

నాలో వున్న నేను ,నేనున్నాను అంటూ  నేస్తమై  నిలుస్తుంది

నా  గుండెలో నవ్వు   ఎప్పుడు  నీకు  నేను తోడు అని కొండంత   ధైర్యాన్నిస్తుంది 

నేను 'నేను' గా  నిలవడానికి   నా 'నేను' నాకు కొండంత   భరోసా 

నా జీవితం నా దోసిళ్ళలోనే ఉందని  సత్యం ఎప్పుడూ ధ్వనిస్తునే ఉంటుంది

Tuesday, June 21, 2022

మౌనరాగం

 











మౌనరాగం 

గెలుపు మరచిన రోజులు ఎన్నో 

ఓటమి  అక్కున చేర్చుకున్న సమయాలెన్నో 

ఒంటరిగా చేసిన యుద్ధాలెన్నో 

ఏకాంతం లో కార్చిన  కన్నీళ్లు ఎన్నో 

కాలం కదలని  రాత్రులు ఎన్నో 

మనసు   స్తబ్ధు గా  మారిన  ఘడియ లెన్నో 

నోటి నిండా  నవ్విన  క్షణాలు  మాత్రం కొన్నే 

Tuesday, August 11, 2020

భగవాన్ అనుగ్రహం




భగవాన్ అనుగ్రహం


బంధాలు భారమై బతుకు శూన్యమై
నీ రంగస్థలం లో  ఆడలేక నటించలేక
నీ దరికి చేరాను  భగవాన్  నీ అనుగ్రహం కోసం
నీ దగ్గర ఆకాశమంత ప్రేమ
సముద్రమంత  అనుగ్ర్హహమ్ వుంది అన్నావు
కానీ ఒక షరతు పెట్టావు ఎంత పాత్ర తెచ్చుకుంటే అంత అనుగ్రహం అని
నిన్ను చేతులు ఎత్తి మొక్కే దోసిల్లే తప్ప యే పాత్ర లేని బికారి ని నేను
ఎలా  తీసుకుపోను  నీ అనుగ్రహాన్ని 


Monday, June 15, 2020

పంచారామాలు- కుమారభీమారామం-సామర్ల కోట



పంచారామాలు- కుమారభీమారామం




పంచారామాలు- కుమారభీమారామం-శ్రీ చాళుక్య కుమారామ భీమేశ్వరస్వామి
పంచారామలలో ఒకటి అయిన  శ్రీ కుమారామా భీమేశ్వర  క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోట లో వుంది.ఇక్కడ  కుమారస్వామే స్వయం గా లింగాన్ని ప్రతిష్టించారని అందుకే ఈ క్షేత్రానికి కుమారామం అని అంటారని ప్రతీతి. సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు  9 వ శతాబ్ధం చివరలోనిర్మించాడని పిఠాపురం లో దొరికిన ఒక శాశనం ద్వారా తెలుస్తోంది. . ఈయనే ద్రాక్షరామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకె ఈ రెండు దేవాలయాలు ఒకేవిదముగా వుంటాయి.అంతే కాక  ఈ రెండు గుడుల నిర్మణానికి ఉపయోగించిన రాయి  మరియు నిర్మాణ శైలి కూడా ఒకటే. ఈ మందిరం నిర్మాణం క్రీ.శ 892 లో ప్రారంభమై సుమారు క్రీ.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంటుంది. ఈ దేవాలయం లో కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును.
సామర్లకోట లోని భీమేశ్వర స్వామిని కుమారస్వామి నే  స్వయంగా ప్రతిష్టించడం వలన దీనికి “కుమారారామ” అని పేరు వచ్చింది అని పౌరాణిక ప్రశస్తి.


 

చారిత్రికంగా చూస్తే క్రీ.శ 872 నుండి 971 వరకు మొదటి చాళుక్య భీమ నృపాలుడు కమారామము ను రాజధానిగా చేసుకొని రాజ్యపాలన  సాగించారు.ఆ చాళుక్య మహారాజు  ఆ స్వామి యందు  అమితమైన భక్తి అందుకని సువిశాల ప్రాకర మందపాడులని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడు.ఆ పారమైన భక్తి వలనే స్వామి చాళుక్య కుమారామ భీమేశ్వరుడు అయినాడు .రాజు పేరు తో స్వామి పేరు  తో ఊరు చాళుక్య భీమవరమైంది.అంతే కాక సామర్లకోట పేరు వెనుక చాలా కధలు వున్నాయి.అందులో ఒకటి పూర్వం ఇక్కడ వైష్ణవ స్వాములు ఎక్కువగా వుండేవారని , ఈ గ్రామం వారికి  కోట వలె చాలా  సురక్షితం గా వుండేదని కాబట్టి స్వాముల కోట అనేవారని అదే కాలక్రమేణ  సామర్లకోట గా మారింది అని కొందరు చెపుతారు.
ఇంకొక కధ యేమిటంటే ఇక్కడ శ్యామలాంబ గూడు వుండేదని దాని చుట్టూ కోట వుండేదని ఆ కారణం గా శ్యామలకోట అని పిలిచివారని అదే కాలాంతరంలో సామర్లకోట గా మారింది అని అంటారు.ఏది ఏమైనా  ఇవన్నీఈ మద్యకాలం లో వచ్చిన పేర్లు కావొచ్చు కానీ చాళుక్య భీమవరం,కుమారామం అనేవి సామర్లకోటే కోట కు ఎప్పటినుందో వున్న పేర్లు అని మనకి శ్రీనాధుని  సాహిత్యం వలన తెలుస్తుంది.అంతే కాక శిలశాసనాలు కూడా ఈ విషయాన్నే బలపరుస్తున్నాయి.ఇప్పుడు శ్రీ కుమారామ భీమేశ్వర ఆలయం వున్న భీమవరం గ్రామాన్ని,సామర్లకోట ని గోదావరి పంటకాలువ వేరు చేస్తూ ప్రవహిస్తుంది.ఈ కాలువకి ఉత్తరాన  పట్టణం,దక్షిణాన ఆలయము వున్నాయి.


ఆలయ నిర్మాణ శైలి చూస్తే ద్రాక్షారామం లోని భీమేశ్వర ఆలయాన్ని పోలి వుంటుంది.ఈ గుడి చుట్టూ చెక్కిన ఇనుపరాతి తో కట్టిన రెండు ప్రాకరాలు వున్నాయి.బయట ప్రాకరానికి నాలుగు వైపులా నాలుగు గోపురాలు వుంటాయి.ఈ గోపుర ద్వారానికి ఇరువైపుల  అర్ధమండపాలు  వుంటాయి.ఇంకా లోపలి ప్రాకారం లోకి వస్తే ఇది సమతలం గా రెండు భాగాలుగా చేయబడి మద్య లో ఒక చూరు వుంటుంది.ఈ లోపలి ప్రాకారం వెనుక గోడ ను ఆధారం గా కెఃసుకొని రెండు అంతస్తుల మండపం నిర్మించారు.ఈ లోపలి మండపం లో క్రింద భాగం లో దక్షిణం వైపున గణపతి ,సూర్యుని గుడి,తూర్పున అమ్మవారు గిరిజ సుందరి గుడి వుంటాయి.భీమేశ్వరుని దేవాలయం  లోపలి ప్రాకారం మద్యలో చతురాస్రాకారంగా రెండు అంతస్తులలో  నిర్మించారు. రెండో అంతస్తువరకు దాదాపు 14 అడుగులున్న శివ లింగం, సున్నపు రాయి చే నిర్మితమై శివలింగఆధారం క్రింది గదిలో వుండగా, లింగ అగ్రభాగం పై కప్పును చీల్చుకొని మొదటి అంతస్తు వరకుండును. భక్తులు పూజలు, అర్చనలు ఇక్కడ చేస్తారు. మొదట మొదటి అంతస్తులో వున్న లింగ దర్శనం తరువాత క్రిందవున్న లింగ పాద భాగాన్ని భక్తులు దర్శించుకుంటారు. మొదటి అంతస్తుకు చేరుటకు ఇరువైపులనుండి మెట్లు వున్నవి మొదటి అంతస్తు కి దక్షిణ వైపుగా  వున్న మెట్ల మీదుగా ప్రవేశించాలి.ఈ రెండు అంతస్తులు ద్రావిడ శైలి లో వుంటాయి.

 

గుడి ఆవరణ లో భీమేశ్వర ఆలయం పోలిక తో చేసిన ఒక చిన్న నమూనా గుడి వుంటుంది.
ఆలయ శైలి లో ఒక విశేషం ఏమిటంటే ప్రతి శిలా స్తంభం దేని  కదే ప్రత్యేకం గా వుంటుంది.ఏ రెండు స్తంభాలు ఒకేలా వుండవు,ప్రతి స్తంభం నిర్మాణం లోనూ ఎంతో కొంత వైవిద్యం వుంటుంది. ఆలయము లోని మండపం నూరు  స్తంభల్తో  నిర్మించబడింది.గుడిలోకి ప్రవేశించగానే కనిపించే ఏక శిలా నంది విగ్రహం  ఒక సజీవ శిల్పం ,చాలా అద్భుతం గా ఉంటుంది.రెండవ అంతస్తులో  ప్రదక్షిణ చేసే మార్గం లో  స్వామి ఎదురుగా నిలచినప్పుడు కుడి ప్రక్కన స్తంభం పైన జ్యోతిర్లింగం అయిన శివుని యొక్క ఆద్యంతాలు కనుక్కునే పందెంలోవిష్ణు మూర్తి  వరాహ రూపం  లింగం మొదలు కనుక్కోవటానికి,  బ్రహ్మ  లింగం యొక్క చివరి భాగం కనుక్కోవటానికి హంస వాహనం పై ప్రయాణించే   దృశ్యాన్ని అత్యంత అద్భుతం గా స్తంభం పై చెక్కబడి వుంటాయి.ఇంకా లింగోపరితలం నుండి జారీ పడే కేతకు పుష్పం, సురభి ఆవు  ల దృశ్యాలని కూడా ఈ  స్తంభం పై చెక్కిన శిల్పాలలో చూడవచ్చు.



ఉత్తమ సాధన కై సాధన యందు కొన్ని మెట్లు ఎక్కితేనే కానీ భగవంతుని అనుగ్రహం లభించదు అనే సత్యాన్ని తెలియచెప్పటానికి అన్నట్టు వుంటాయి మనం ఎక్కవలిసిన మెట్లు.అవి కూడా చాలా చిత్రంగా రెండు దార్లు వుంటాయి.గర్భ గుడికి ఆగ్నేయం వైపున సూరి ద్వారం,ఉత్తరం ఈశాన్యం వైపు నా  చంద్ర ద్వారం.ఇవి ఎలా వుంటాయి అంటే గర్భగుడికి రెండు నాసికా రంధ్రాల లా వుంటాయి. ఎలా అంటే మనిషి  యొక్క నాసిక రంధ్రాలలో ఎడమ వైపుది చంద్ర నాడీ,కుడి వైపుది సూర్య నాడీ ,యోగి  యోగ మార్గం లో  ఈ రెండు నాదుల ద్వారా ప్రాణమయము ప్రక్రియ ద్వారా  ప్రాణము ని సహస్రారమున వుంచి ఆ ప్రాణం తో తన మనస్సు ను కూడా అక్కడికి చేర్చి ఆనందమయుడై వుంటాడు.ఈ భీమేశ్వర స్వామి దర్శనం కూడా ఈ రెండు మెట్ల దారి ద్వారా మనకి ఈ  యోగమార్గాన్నే చెపుతుంది.

 

అమ్మలు గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ  ఇక్కడ బాల త్రిపుర సుందరి పేరు తో స్వామి వారి దేవేరి గా కొలువై వుంది.ఆ చల్లని తల్లిని చూడటానికి  రెండు కళ్ళు చాలవు .ఆ కరుణామయి తన చల్ల్ని చూపులతో  తాన భక్తులు అయిన బిడ్డలను సదా కాపాడుతువుంటుంది.ఈ ఆలయం లో అమంవారి తో పాటు ఆలయం చుట్టూ వున్న మండపం లో చిన్న చిన్న గదులలో ప్రధాన దేవతలు కొలువు తీరి స్వామి ని సేవిస్తూ  దర్శించ వచ్చిన భక్తులను అనుగ్రహిస్తూవుంటారు.మహా గంపతి,కుమార స్వామి,వీరబధ్రుడు,దత్తాత్రేయులు,బ్రహ్మ,సర్స్వతి,సూర్యనారాయణుడు,మహిషాసుర మర్ధిని ఇంకా సప్త మాతృకలు కొలువు తీరి ఆ భీమేశ్వరుడిని  దర్శించటానికి విచ్చేసిన భక్తుల కోరికలు పాలిస్తువున్నారు.ఇక్కడ వున్న మహిషాసుర మర్ధిని విగ్రహం తవ్వకాలలో బయట పడింది.దీనిని కొండవీటి రాజు అయిన కాటయ వేమారెడ్డి 15వ శతాబ్ధం లో ప్రతిష్టించినట్టు చెపుతారు.ఈ మహిషాసుర  మర్ధినికే శ్యామల శక్తి  అని కూడా అంటారు.

ఈ ఆలయ నిర్మాణం లో మరో విశేషం ఏమిటంటే చైత్ర,వైశాఖ మాసాలలో  సూర్య దేవుని కిరణాలు ఉదయం పూట అయ్యవారి  పాదాలను ,సంద్య వేళ అమ్మవారి పాదాలను  తాకుతూవుంటాయి.ఆలయం పడమటి గోడ మీద వున్న గణపతి ని వజ్ర గంపతి అంటారు ఎందుకంటే  ఆయన నాభి లో కాంతివంతమైన  వజ్రం వుండేది ఆట.ఆ వజ్రం నుండే వచ్చే కాంతి రాత్రి పూట భక్తులకు మార్గ దర్శకముగా వుండేది ఆట.ఇప్పుడు ఆ వజ్రం లేదు కాని  నాభి  వజ్రం వున్న చోట ఖాళీ గా కనిపిస్తుంది.ఆలయం లో లోపలి ప్రాకారం బయట  కల భైరవ స్వామి క్షేత్ర పాలకుడా గా మనకి  కనిపిస్తారు.

ఈ ఆలయానికి తూరుపు దిక్కున  పుష్కరిణి వుంది .దీనిని భీమగుండం అంటారు.ఇక్కడినుండి నీళ్ళు తెచ్చుకొని గుడి ఆవరణ లో వున్న శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకం చేయవచ్చు.ఈ దేవాలయానికి  పడమట వైపున ఏక శిలా స్తంభం వుంది.దీని కప్ప స్తంభం అంటారు.దీని పైన చెక్కబడి వున్న శిలా శాసనం బట్టి నిధి ఆశతో కొందరు దొంగలు నంది ని తొలగించినట్టుగాను నరసిముడి భార్య రాజమండ్రి లోని కోటిలింగాల నుండి రాతిని తెప్పించి కొత్త నందిని పునః ప్రతిష్ట చేయించి నట్టు తెలుస్తుంది.




 శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి బాలత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. అయిదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. 
ఈ గుడి  నుండి బయటికి వచ్చిన తరువాత  ఒక 200 గజాల దూరం లో 5 నిమిషాల నడక దూరం లో మాండవ్య నారాయణ స్వామి ఆలయం వుంది. భీమేశ్వర ఆలయం కి వెళ్లినప్పుడు తప్పకుండ  చూడాలిసిన ఆలయం .ఈ ఆలయం కూడా కాలువ పక్కనే వుంటుంది ,ఎలాంటి ప్రయాణ సాధనాలు అక్కరలేదు నడిచి వెళ్లవచ్చు.
ఇక్కడ  మాండవ్య అనే ఒక మునీశ్వరుడు నారాయణ స్వామి కొరకు తప్పస్సు చేసి నారాయణుడుని ప్రసన్నం చేసుకున్నారని ఆ నారాయణ్ స్వామి ఇక్కడ వెలిశారని అందుకే ఈ గుడిని మాండవ్య నారాయణ స్వామి  ఆలయం అని చెపుతారు.ఈ ఆలయం కూడా అందమైన శిల్పా కళ తో నిర్మించారు.ఇక్కడికి మాండవ్య మహర్షి దర్శనం చేసుకోవటానికి  ఇంద్రుడు పుష్పక విమానం పై వచ్చేవాడని చెపుతారు.


ఇవే కాకుండా పై రెండు ఆలయాలకంటే కూడా ఇంకా పురాతనమైన ఆలయం  వుంది అధి  త్రిముఖ లింగాలయం గా పిలవబడుతోంది.ఇక్కడ వున్న శివ లింగం మూడు ముఖములతో వుండటం వలన త్రిముఖ లింగం గా పిలవబడుతోంది.మూడు ముఖములు  త్రిమూర్తులు అయిన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులుగా  బావిస్తారు.ప్రస్తుతం ఈ గుడి పూర్తిగా శిధిలావస్థలో వుంది లింగం యొక్క పై బఃగమ్ మాత్రమే చూడగలము.లింగ ఎత్తు సూమారుగా 14అడుగులే వుంటుంది.

 సామర్ల కోట  చేరుకోవటం చాలా సులువు . సామర్లకోట సొంతంగా రైల్వే స్టేషన్ కలిగి ఉన్నది. రైల్వే స్టఇక్కడికి వైజాగ్, కాకినాడ తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్లన్నీ ఆగుతాయి. రైల్వే స్టేషన్ లో దిగి, అక్కడి నుండి ఆటోలో కిలోమీటర్ దూరంలో ఉన్న కుమారారామము క్షేత్రం చేరుకోవచ్చు. సామర్లకోట కు రాజమండ్రి, కాకినాడ మరియు దాని సమీప ప్రాంతాల నుండి చక్కటి బస్సు సౌకర్యం కలదు.కాకినాడ నుండి సామర్లకోట ప్రయాణంచాలా బావుంటుంది .గోదావరి వెంబడి చుట్టూ పచ్చని  పొలాలు రోడ్ కి ఇరువైపుల పెద్ద పెద్ద చెట్లతో చాలా ఆహ్లాదముగా వుంటుంది. అంతే కాకుండా , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర  కార్తీక మాసం లో ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది.




ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః 








Tuesday, May 5, 2020

పంచారామ క్షేత్రాలు


                                                          పంచారామములు 


                                      శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే

శివ కేశవులకి భేదం లేదు.శివుడే విష్ణువు,విష్ణువే శివుడు.శివుడు ఎక్కడ వుంటాడో అక్కడ విష్ణువు వుంటాడు.విష్ణువు వున్నచోటే శివుడు కొలువై వుంటాడు.
శివ కేశవుల ఏకత్వాన్ని తెలియచేసే పవిత్ర క్షేత్రౌ లు మన ఆంధ్రప్రదేశ్ లో పంచారామాలు గా విలసిల్లుతున్నాయి.శివస్య హృదయం విష్ణుర్విర్ణోశ్చ హృదయం శివః అనగా శివుని హృదయం లో కొలువై వుండేది విష్ణువే అలానే విష్ణువు హృదయం ఆవాసం గా చేసుకుని  వుండేవాడు శివుడు.ఈ ఆబేదాన్ని మనకి చెప్పడానికి  ఈ పంచారామాలు.
పంచ అంటే ఐదు ,ఆరామం అంటే కొలువై వుండే స్థలం.ఈ ఐదు ప్రదేశాలలో సాక్షాత్తు శివుడు కొలువైవున్న  క్షేత్రాలు .ఈ క్షేత్రాలలో శివుడు కొలువుతీరి  పూజలు అందుకుంటే ఈ ఐదు క్షేత్రాలలో విష్ణువు  క్షేత్ర పాలకుడు గా వున్నాడు.ఇంకా అద్బుతమైన విశేషం యేమిటంటే ఈ ఐదు శివలింగాలు ఒకే లింగం నుండి ఉద్భవించాయి.
మన ఆంధ్రప్రదేశ్ లో వున్న ఈ పంచారామాల గురించి చాలా కథలు ప్రాచుర్యం లో వున్నాయి.అందులో ఎక్కువగా ప్రాచుర్యం పొందినవి ఒకటి శ్రీనాధుడు రచించిన భీమేశ్వర పురాణం  లో ఈ పంచారామాల  ఉద్భవం  గురించి వున్న ఒక కథ మరియొకటి స్కంద పురాణం తారకాసుర వధ ఘట్టం లో ఈ పంచారామల  పుట్టిక గురించి చెప్పబడింది.
మొదటిగా మన శ్రీనాధ కవి సార్వభౌముడు రచించిన బీమేశ్వర పురాణము ప్రకారం క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతాన్ని మహా విష్ణువు మోహినీ రూపం ధరించి దేవతలకు, రాక్షసులకు పంపిణీ  చేసినప్పుడు త్రిపురాసురులు  అనే రాక్షసులు పంపకం లో తమకు అన్యాయం జరిగింది అని అసంతృప్తి వ్యక్తం చేసి శివుని కొరకు ఘోరమైన తపస్సు చేస్తారు. ఆ త్రిపురాసురుల తపస్సుకి మెచ్చిన శివుడు  వారికి అనేక విదములైన వరములను ప్రసాదిస్తారు.ఆ  శక్తి తో రాక్షసులు  దేవతలను అనేకరకాల బాధలకి గురి చేస్తారు.వారి దుర్మార్గాలు భరించ లేక దేవతలు అందరూ కలిసి ఆ దేవ దేవుడు అయిన శివుడిని రక్షించమని వేడుకుంటారు.దేవతల మొర ఆలకించిన మహాదేవుడు త్రిపురాంతకుడి రూపంలో తన పాశుపతంతో రాక్షసులను, వారి రాజ్యాన్ని బూడిద చేస్తాడు.మహాశివుని యొక్క ఈ రుద్ర రూపాన్ని త్రిపురాంతకుడుగా పూజిస్తారు.కానీ ఈ యుద్ధంలో త్రిపురాసురులు పూజించిన అతిపెద్ద శివలింగం మాత్రం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ లింగాన్ని మహదేవుడు ఐదు ముక్కలుగా చేదించి ఐదు వేరు వేరు ప్రదేసములందు ప్రతిష్ఠించుటకు గాను దేవతలకు పంచిపెట్టడం జరిగింది.అలా పంచబడిన ఐదు లింగ భాగాలని  దేవతలు భూమిపై ఐదు చోట్ల ప్రతిష్టించారు. అవే పంచారామాలుగా ప్రసిద్ధి చెందినట్లు గా  శ్రీనాధుని  బీమేశ్వర పురాణము  లో చెప్పబడింది.
మరోయొక గాధ స్కంద పురాణం లో వుంది అనుకున్నాము కదా.స్కంద పురాణం  లో  తారకాసుర వధ ఘట్టం ప్రకారం హిరణ్య కశిపుడి మనుమడైన తారకాసురుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఒక బాలుడి చేతిలో తప్ప తనకు మరెవ్వరి చేతిలో మరణం ఉండకూడదని కోరుకుంటాడు. రాక్షస  ప్రవృత్తి సహజముగా వున్న తారకాసురుడు  శివుడు ప్రసాదించిన వరముల కారణముగా ముల్లోకాలను బాధించటం మొదలు పెడతాడు. తారకాసురుని ధాటికి తట్టుకోలేని దేవతలంతా విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా,  ఆ శ్రీహరి తారాకసురుడు శివ భక్తుడు  నేను వధించలేను కానీ శివపార్వతుల తనయుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అన్న ఉపాయాన్ని  సూచిస్తాడు.అప్పుడు దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. అలా తారకాసురుని సంహరించేందుకు పార్వతీ గర్భాన జన్మిస్తాడు కుమారస్వామి. దేవతలతో కలిసి బాలుడైన కుమారస్వామి తారకాసుడిపై యుద్ధానికి దిగుతాడు. కానీ ఎన్ని దివ్యాస్త్రాలను ప్రయోగించినా  ,ఆఖరికి శక్తి అనే ఆయుధము తో  యెన్ని సార్లు  ఆ అసురుని శరీరాన్ని ముక్కలు చేసిన  అవి  మరలా అతుక్కుపోతువుంటాయి .ఏమి చెయ్యాలో తెలియని స్తితిలో వున్న షణ్ముఖినికి  శివుడు ప్రత్యక్షమై తారుకుని కంఠం లో నా ప్రాణలింగం వున్నంత వరకు అతనికి మరణం సంభవించదు అందుకని ఆ  ఆత్మలింగాన్ని ముక్కలుగా ఛేదించాలి అని చెపుతారు.అప్పుడు కుమారస్వామి ఆగ్నేయాస్త్రం తో  ఆ ఆత్మలింగాన్ని ఐదు ముక్కలుగా  ఛేదించగా  ఆ ఆత్మలింగం గోదావరి, క్ర్సిష్ణ నది తీరాలలో ఐదు చోట్ల పడింది . ఆ అయిదు ప్రాంతాలే పంచారామాలుగా పసిద్దిగాంచాయని స్కంద పురాణం చెపుతోంది.అంతే కాక ఓంకార నాదం తో అవి ఏకం అవుతుండగా విష్ణుమూర్తి ఆదేశం మేరకు ఆ లింగ శకలాలు పడ్డ చోట దేవతలు వెనువెంటనే  లింగాలు ప్రతిష్టించి ఆలయాలు నిర్మించారని అని కూడా పురాణాలు చెపుతున్నాయి.అవే పంచారామ క్షేత్రాలుగా పిలువబడుతున్నాయి. నాలుగు పంచారామాలు గోదావరి తీరం లో, ఒకటి  కృష్ణా తీరం లో వున్నాయి అవి వరుసగా
దక్షారామము- భీమేశ్వరుడు- ద్రాక్షారామము, తూర్పు గోదావరి జిల్లా
కుమారభీమారామం – భీమేశ్వరుడు- సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా
క్షీరారామము- రామలింగేశ్వరుడు - పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా
భీమారామము- సోమేశ్వరుడు - భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా
అమరారామము- అమరేశ్వరుడు - అమరావతి, గుంటూరు జిల్లా


ఒక్కో పంచారామ  క్షేత్రం గురించి ఇంకా ఆక్షేత్రం కి దగ్గరలో వున్న దర్శనీయ ప్రదేశాల గురించి  వరుస బ్లాగ్ లలో విపులంగా చెప్పాలనుకుంటున్నాను .
నా తరువాతి బ్లాగ్ లో మొదటిగా మనం సామర్లకోట లో వున్న  కుమారభీమారామం  గురించి  తెలుసుకుందాము.

Friday, January 3, 2020

భగవాన్ పాదాల చెంత





                               భగవాన్ పాదాల చెంత

తడి ఆరని కన్నులు నిన్ను వెతికి వెతికి
అలసి సొలసి నువ్వు లేని  శూన్యం లోకి తీసుకుపోతే
ఆ శూన్యం నుండి ఒక వెలుగు  సొలసిన నన్ను
భగవాన్ పాదాల చెంతకు  చేర్చింది
చింతలేని  ఆ పాదాల చెంత  వున్న నిచ్చింతగా


ఓం  శ్రీ భగవాన్ రమణాయ నమః 






కరిగిపోయిన కాలం

కరిగిపోయిన కాలం

కలలా అయినా ఉంటావని కన్నులో దాచుకుంటే
కలత నిద్ర కూడా లేకుండా చేసి
కన్నీరు అయి జారిపోయావు
కదలని కాలం  నిద్రను దూరం చేస్తే
కదిలే కాలం నిన్ను దూరం చేసింది

Sunday, November 17, 2019

మనం మరచిన మన తెలుగు తొలి వాగ్గేయకారుడు కృష్ణమయ్య- 3


ఒక భక్తుని శాపం మరొక  భక్తుని పిలుపు - అప్పన్న స్వామి శక్తి 


మనం మరచిన కృష్ణయ్య బ్లాగ్ లో భగవంతుడు భక్తుడికి శాపం, భక్తుడు భగవంతుడికి ప్రతి శాపం ఇచ్చిన గాధని  తెలుసుకున్నాము కదా. తననే నమ్మి త్రికరణ శుద్ది గా కొలిచిన తన భక్తుని మాట తిరుగుండదని స్వామి నిరూపించారు స్వామి.కొన్ని వందల సంవత్సరాల తరువాత భక్తుడి కృష్ణయ్య మాట ను నిజం చేశారు స్వామి.దాన్ని గురుంచి ఇక్కడ తెలుసుకుందాము.
తనకే శాపమిచ్చిన కృష్ణమయ్య కు స్వామి ఏ వచన సంకీర్తన తో ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించావో అవే వచనసంకీర్తనలు భవిష్యత్ తరాలకు అందకుండా నీ ఖ్యాతీ మరుగున పడిపోవును అని శాపమిచ్చి అంతర్థానమవుతారు వరాహస్వామి.ఆ క్షణం లో తెలుగు లో తొలి లిఖిత అక్షరాలు రాగి రేఖుల పై లిఖించిన కృష్ణమయ్య కు తన గర్వం పూర్తిగా తొలగిపోయింది. వెంటనే  కృష్ణమాచార్యులు వారు రామానుజులు  వద్దకు వెళ్ళి శరణు వేడారు.భగవంతుడు భక్తుని కి దాసుడేనని ఆయన భక్తునిగా నీవు నోరు జారిన మాటకు తిరుగుండదని ఆలయ అగ్నికి ఆహుతి అవుతుందని అదే సమయాన తన శక్తిని స్వామి నిరూపించుకుంటారని శెలవిచ్చి వెళ్ళారు రామానుజులవారు.
తన తప్పుకు ప్రాధేయపడి పడి అంతరాలయన దుఃఖిస్తున్న కృష్ణమయ్య వద్దకు వచ్చిన స్వామి నీ వచన సంకీర్తన వ్యర్థం కాదని కొంతకాలం తరువాత తిరీగీ వెలుగోలోనికి వస్తాయని అభమిచ్చారు అప్పన్న స్వామి
. తననే నమ్మి త్రికరణ శుద్ది గా కొలిచిన తన భక్తుని మాట తిరుగుండదని స్వామి నిరూపించడానికే తన ఆలయం మీద దండయాత్ర జరిగిన సహించాడు స్వామి.
అదే సమయాన మరో భక్తుని మొర ఆలకించి ఆ దండయాత్రను తిప్పి కొట్టాడు వరాహనృసింహుడు.
ఈ సంఘటన జరిగినప్పుడు ఆలయం లో వుంది స్వామీ ని పిలిచిన  భక్తుడు ,కవి   గోగులపాటి కూర్మనాథ కవి.ఈ కవి గురించి మరియు ఆలయ లో  18 శతాబ్ద ప్రారంభంలో తురష్కర దండయాత్ర జరిగిన ఘటన గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది వున్నారని నా అభిప్రాయము.
కలియుగాన భగవంతుడిని మరో సారి రప్పించిన  ఈ మహాకవి గోగులపాటి కూర్మనాధుల వారు విజయనగర రామతీర్థ గ్రామంలో సుమారు 1720 ప్రాంతంలో జన్మించారు. విద్యాభ్యాసము తరువాత, విజయనగర సంస్థానము యొక్క దేవస్థానాలలో ఉద్యోగిగా రామతీర్థం, పద్మనాభం, సింహాచలం, శ్రీకూర్మం లలో పనిచేశారు. 'వైరి హర రంహ సింహాద్రి నారసింహ ! 'అనే మకుటంతో "సింహధ్రి నారసింహా శతకం" అని 101 పద్యాలు రచించిన పరమ భక్తుడు ఈయన.
18వ శతాబ్ద ప్రారంభంలో తురష్కర దండయాత్ర జరిగిన సమయాన సింహచల ఆలయంలోనే ఉన్నారు కూర్మనాథ కవివర్యులు. తురష్కరులు దక్షిణ దేశ దండయాత్ర లో సింహచల క్షేత్రం పై దండెత్తారు ఆలయాన్ని నిర్బందించారు ఆ సమయాన సింహచల క్షేత్రం లో వారం రోజులు ఆలయం మూతబడింది . తన భక్తుడు కృష్ణమయ్య శాప ఫలితంగా అలా వారం రోజులు అగ్నికి ఆహుతి అవుతందనే మాట అగ్నిహోత్రాలు లేకుండా నిలిచేలా చేసి తన భక్తుని వాక్కు మహత్తును నిజం చేశాడు వరాహానరసింహుడు. వారం రోజుల అలుపెరగని దండయాత్రలో కడకు ఆలయంలోకి ప్రవేశించారు తురష్కరమూక.ఆలయాన్ని నేల మట్టం చేసి నిధులు దోచుకు పోడానికి మహత్తర పన్నాగం పన్నారు.
కళ్యాణమండపం  పై విరుచుకుపడ్డారు, ఆలయంలోని బేడా మండపం రాతిరథం గర్భాలయం పై ఉన్న విగ్రహలు ధ్వంసం చేసే ప్రయత్నంలో కాస్త సఫలమయ్యారనే చెప్పాలి . నాటీ సాక్ష్యాలే నేటికి  ఆలయంలో అక్కడక్కడ శిధిలమైన విగ్రహాలు  మనకి కనిపిస్తాయి.ఆ సమయం లో కూర్మనాధ కవి గారు ఆలయం లోనే వున్నారు.వైరి సంహార అని స్వామి ని ఎలుగెత్తి ఆర్తి తో పిలిచారు స్వామి ని.కూర్మనాధుల వారి మనస్సు దహించుకుపోయింది. వైరి సంహరి నేను అయితే ఒక్కడినే తండ్రి ఏలాగోలా తప్పించుకు పోతా మరి నీ విషయం అలా కాదే 16000 మంది గోపికలు వున్నారు వారి అందరితో ఎలా పారిపోతావు రావయ్యా రా వీరి సంగతి చూడవయ్య అని  ఆర్తి తో పిలిచాడు అప్పన స్వామి ని.భక్తుడు ఆర్తి తో పిలవటం అప్పన స్వామి  రాక పోవటం జరుగుతుందా.పిలవగానే టక్కున వచ్చాడు.అది మామూలుగా కూడా కాదు. తుమ్మదెల గుంపై  నిండైన  చందన విగ్రహం నుండి వచ్చాడు. తురష్కరులను చీల్చి చెండాడటానికి గుమ్మడికాయంత ఆకారన తుమ్మెదల రూపం లో వచ్చాడు. తురష్కరులు అనుకున్నది సాదించకుండానే వచ్చిన దారినే పలాయనం చిత్తగించారు. తురష్కరలను తరిమికొట్టడానికి తుమ్మెదల గుంపు కొండ దిగుతుంటే కారుమబ్బులు సింహాచల గ్రామాన్ని చుట్టుముట్టాయా అన్నంత భయంకరంగా కనిపించాయట .అలా ఆ తుమ్మెదల గుంపు  తురష్కరులను "తుమ్మెదల మెట్ట" వరకు తరిమి కొట్టాయని చరిత్ర చెబుతుంది.ఆ తుమ్మెదల మెట్ట నే ఇప్పటి చావులమదుం . అలా తన భక్తుని శాపంలో భక్తుని మాటను ఇటు తన మహత్తుని నిరూపించుకొని తురష్కర దండయాత్రను తుమ్మెదల రూపంలో తిప్పి కొట్టి కూర్మనాథ కవి వాక్కుని నిజం చేసిన దాసానుదాసుడు సింహచల వరాహలక్ష్మీనృసింహుడు అదే మన సింహాద్రిఅప్పన్న. చావులమదుం(తుమ్మెదల మెట్ట) దగ్గర ఆ తుమ్మెదలు ఒక బిలంలో దూరాయని అదే బిలంలో కృష్ణమయ్య సంకీర్తనలు ఉన్నాయని ఒక ప్రచారం కూడా వుంది. చూద్దాం స్వామి సంకల్ప బలం ఎలా ఉందో.మన కృష్ణయ్య సంకేర్తనలు అన్నీ వెలుగులోకి ఎప్పుడు  తీసుకు వస్తాడో ఆ భక్త సులభుడు అప్పన్నే స్వామికే  వదిలివేద్దాము. 

ఆ సింహాద్రి అప్పన్న అనుగ్రహం  వాళ్ళిద్దరి మీదే కాకుండా మనమీద కూడ ప్రసరించాలని  కోరుతు  సెలవుతీసుకుంటున్నాను . తరువాతి  బ్లాగ్ లో మరియొక ఆసక్తి దాయకమైన విషయం తో కలుద్దాము. 

ఓం శ్రీ భగవాన్ రమణాయ  నమః  


Tuesday, November 12, 2019

మనం మరచిన మన తెలుగు తొలి వాగ్గేయకారుడు కృష్ణమయ్య-2


తెలుగు  తొలి  వాగ్గేయకారుడు శ్రీకాంత కృష్ణమాచార్యులు 

ఆఖరి  భాగం 






కృష్ణమయ్య సంకీర్తన యఙ్ఞం జరుగుతుండగానే సింహాచల క్షేత్రానికి ఆదిశేషు అవతారం అయిన భగవద్రామానుజులు వారు విచ్చేసి , ఆ క్షేత్రంలో తపస్సు చేసుకుంటు న్నారు.ఇప్పుడు కొంచెం రామానుజాచార్యుల సింహచాల క్షేత్ర దర్శన  సంగతులు చెప్పుకుందాము.రామానుజాచార్యుల వారు తప్పస్సు తో పాటు  రోజు నేటీ ఆలయ బేడా మండపంలో ఈశాన్య మూల ప్రవచనాలు చెపుతువుండేవారు. ప్రవచనాలు వినడానికి స్వామి వారు హంస రూపంలో ప్రతిరోజు  వస్తువుండెవారట. సింహగిరి క్షేత్రానికీ ప్రతిరోజు వస్తూ ఈశాన్య మూల కూర్చోని రామానుజులవారి వచనాలు వినడంతో ఆ స్థలం "హంసమూల" గా ప్రసిద్ది చెందింది . ఇప్పుడు కూడా ఈ చోటు ని  ఆలయ ఈశాన్య భాగాన రాతిరథం వెనుక వైపు ఈ హంసమూల అచట శ్వేత వర్ణంలో భగవద్రామానుజుల వారిని వారితో పాటు శ్రీ సింహాచల దేవస్థానం ఏర్పాటు చేసిన రాతిశాసనాన్ని చూడవచ్చు.చూసారా  మన సింహాద్రి అప్పన్న ఎంత  భక్త సులభుడో ,ఒకరి కోసం హంస రూపం లో  ఇంకొకరికోసం బాలుని రూపం లో దర్శనం ఇచ్చారు .
ఇప్పుడు మన కధ లోకి వద్దాము.   తన సంగీతానికి ,తన సంకీర్తనకు అప్పన్న దాసుడు అని భావించిన కృష్ణమయ్యకు గర్వం పెరిగింది అందుకని ఆ క్షేత్రంలో తపస్సు చేసుకుంటున్న రామానుజాచార్యుల వారిని  కృష్ణమాచార్యులు అంతగా లక్ష్య పెట్టలేదు కనీసం నమస్కారం కూడా చేయలేదు .గర్వం  అనేది అద్యతిమిక  పురోగతికి  ఆటంకం అందుకని రామానుజులు, తన సహజ కృపా దృష్టితో ఈ పనికి పూనుకున్నారు. వారు కృష్ణమా చార్యునితో, తాము నృసింహుని సన్నిధికి వచ్చామని, కృష్ణమాచార్యులు భగవంతునికి బహు సన్నిహితులు గనుక, తనకు ముక్తి లభిస్తుందో లేదో స్వామిని విచారించి తనకు తెలియజేయమని కోరారు. అలా ఆ సందేహన్ని యథావిధిగా బాలుని రూపంలో రాత్రి తన సంకీర్తనకు నర్తించి స్వామి వెళ్తుండగా అడుగుతాడు కృష్ణమయ్య.
ఆ మాటకు స్వామి అందరకీ మోక్షన్నిచ్చేది రామానుజుడైతే ఆయనకీ నేను మోక్షమివ్వడమేంటనీ అడుగుతాడు. ఆ మాటకు ఖిన్నుడైన కృష్ణమయ్య తానిన్నాళ్లూ ఎవరినైతే లక్ష్య పెట్టలేదో అతడే అందరికీ ముక్తినిచ్చేవాడని ఈ స్వామి చెప్పటమా? ఏమిటీ దేవుని న్యాయరీతి? ఒక పక్క గుండెలు రగులు తూంటే స్వామినడిగాడు,పోనీ, నా జీవిత మంతా నీ కైంకర్యానికే వినియోగించాను కదా! మరి నాకైనా నీవు ముక్తినిస్తావా? అని.అప్పుడు స్వామి వారు  నీకు కూడ మోక్షమిచ్చేదీ రామానుజుల వారేనని చెపుతాడు. ఆది నుండి రామానుజుల పట్ల చిన్నచూపు చూసిన కృష్ణమయ్యకు ఈ మాట అనిశపాతంలా తగిలింది.దుఖం తో కూడిన కోపం తన్నుకువచ్చింది.తన జీవితమంతా ఎవరి సేవ కొరకు వినియోగించాడో, ఆ సింహాచల నాథుడనవలసిన మాటేనా ఇది అని కోపం తో  భగవంతుడు,తను ఆరదించిన దేవదేవుడు అని మర్చిపోయి దూషించటం  మొదలుపెట్టాడు.స్వామి వారు కూడా ఎక్కడ తగ్గ కుండ “ ముక్తియంతటి స్థితి నీకివ్వటానికి, నేనేమీ నీకు ఋణపడిలేను. నీవు నీ గానం తో నన్ను పరవశింపజేస్తే, నేను నాట్యంతో నీకు పరమానందం కలిగించాను. కాబట్టి బాకీ చెల్లి పోయింది. అయినా అకారణంగా దైవ దూషణ చేశావు గనుక, ఏ పద వాఙ్మయం చూసుకుని నీవింతగా గర్విస్తున్నావో, అది భావితరాలకు అందకుండా పోతుంది” అని శపించారు. ఈ అఘాతానికి ఆచార్యుల మతి స్థిమితం కూడా పోయింది. ముక్తి సంగతి అలా ఉంచితే, శాపమా తనకు దక్కేది అని ఆచార్యుల వారు కోపం లో స్వామి వారికి  “ నీ ఆలయం ఏడు రోజులపాటు అగ్నికి ఆహుతి అవుతుంది” అని ప్రతి శాపమిచ్చారు. భక్తుడు భగవంతుడికి, భగవంతుడు  తన భక్తుడికి  శాపాలు ఇచ్చుకునే ఇటువంటి ఘటన  ఇంకెక్కడా కనిపించదేమో.
4లక్షల 32 వేల సంకీర్తనలు తెలుగు లో తొలి లిఖిత అక్షరాలు రాగి రేఖుల పై లిఖించిన కృష్ణమయ్య కు తన గర్వం పూర్తిగా తొలగిపోయింది.మనో నేత్రంలో మహావిష్ణు రూపంలో రామానుజులు వారు కనపడే సరికి వెళ్ళి శరణు వేడారు కృష్ణమాచార్యులు వారు.భగవంతుడు భక్తుని కి దాసుడేనని ఆయన భక్తునిగా నీవు నోరు జారిన మాటకు తిరుగుండదని ఆలయ అగ్నికి ఆహుతి అవుతుందని (ఇక్కడ ఆహుతి అనే పదానికి ధ్వంసం అనే అర్థం తీసుకోవాలి) అదే సమయాన తన శక్తిని స్వామి నిరూపించుకుంటారని శెలవిచ్చి వెళ్ళారు రామానుజులవారు. కొన్ని వందల సంవత్సరాల తరువాత కృష్ణమయ్య మాటలు నిజమయ్యాయి. ఈ శాపాల ప్రభావమా అన్నట్లు, 18వ శతాబ్దంలో జరిగిన విదేశీ దండయాత్రల్లో ఈ క్షేత్రం విధ్వంసానికి గురికాగా, ఆచార్యుల సంకీర్తన వాఙ్మయం అంతరించి, నేడు కేవలం రెండు వందల సంకీర్తనలు మాత్రమే లభ్యమౌతున్నాయి. తననే నమ్మి త్రికరణ శుద్ది గా కొలిచిన తన భక్తుని మాట తిరుగుండదని స్వామి నిరూపించడానికే తన ఆలయం మీద దండయాత్ర జరిగిన సహించాడు స్వామి.అదే సమయాన మరో భక్తుని మొర ఆలకించి ఆ దండయాత్రను తిప్పి కొట్టాడు వరాహనృసింహుడు(ఈ గాధ తరువాతి బ్లాగ్ లో చెప్పుకుందాము).
మన కృష్ణయ్య కాకతీయ సామ్రాజ్య ప్రభువు ప్రతాపరుద్రుడు సమకాలనీకుడు. భక్తి పారవశ్యం తో కీర్తనలు చేస్తున్న విషయము అప్పటి కాకతీయ  ప్రభువు  ప్రతాపరుద్రుడు కి తెలిసి కృష్ణమయ్య ను ఓరుగల్లు(ఇప్పటి వరంగల్) కి పిలిపించి  కనిగిరి లో  నాలుగవ  బాగాన్ని మరియు  50 గ్రామాల పై అధికారాన్ని ధారదత్తం చేశారు.ఆచార్యులు వారు రచనా  వ్యాసంగం ,సంకీర్తన  తో పాటు నిరుపేదలకు ధన సాయమ ,ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టేవారు.ఆయన తన చేపట్టిన రచనలన్నీ రాగి రేకుల పై చెక్కించి శాశ్వతత్వాని కల్పించారు.ఈ పద్దతినే  అన్నమయ్య కూడా అనుసరించారు.కొంతమంది అసూయపరులు,దుష్టులు ఆచార్యుల వారు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని  ప్రతాపరుద్ర చక్రవర్తి కి పలుమార్లు  ఫిర్యాదు చేసిన కృష్ణమయ్య మనసతత్వం తెలిసిన  ప్రతాపరుద్రుడు ఫిర్యాదు చేసిన వారిని మందలించారు.ఈ సంగతి తెలిసిన ఆచార్యుల వారు   సింహాచల వరాహ నరసింహ స్వామి ని స్తుతించి చేసిన సంకీర్తన వలన ఓరుగల్లు నగరం లో  కనక వర్షం కురిసిందని చారిత్రిక ఆధారం ‘సిద్దేశ్వర చరిత్ర ‘ అనే గ్రంధం ద్వారా తెలుస్తుంది.
పరిపూర్ణ భక్తి పరిమళంతో, మన అంతరంగమంతా నిండి పులకింపజేస్తాయి. ఆర్తి, శరణాగతితో నిండి లయ బద్ధంగా, రాగయుక్తంగా ఉండటం వల్ల, వచన గేయాలుగా ప్రసిద్ధికెకృష్ణమాచార్యుల వచనాలుక్కాయి. ప్రతి వచనమూ “దేవా“ అనే సంబోధనతో మొదలై, “సింహగిరి వరహరీ! నమో నమో దయానిధీ” అన్న మకుటంతో ముగుస్తుంది.వీటిలో వ్యక్తమయ్యే దృఢభావాలు ।సింహగిరి నృసింహుని మించిన దైవం లేదు శ్రీ వైకుంఠం కంటే మరో ప్రయోజనం లేదు| అని. ఈ వచనాలు శ్రీమన్నారాయణుని స్వరూప గుణ విభవాదుల్ని ప్రతిపాదించేవి కాబట్టి వేద తుల్యాలుగా భావించారు. వీటిని ‘తెలుగు వేదాలు’ అనీ అన్నారు.అన్నమయ్య మరియు పోతన గారికి  కృష్ణమాచార్యులవారే  ప్రేరణ ,స్పూర్తి మన క్రిష్ణమయ్య గారి వచనాలే.
కృష్ణమయ్య రచన, సంగీతం, నాట్యం, భక్తి గల బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నిటికి మించి అభ్యుదయవాది.ఆయన రచనలను పరిశీలిస్తే ఆయన  వైష్ణవ సంప్రదయాన్ని త్రికరణ శుద్దిగా ఆచరించి చూపిన మహానుభావుడు.శ్రీమద్వరామానుజాచార్యులు సూత్రాలైన ఆచార్య భక్తి,స్వామి కైంకర్యం,వర్ణాశ్రమధర్మ రాహిత్యం మొదలిన వైష్ణవ ధర్మాలను  తన రచనలలోనే కాదు తన జీవన విదానంలో  కూడా ఆచరించారు.తన చిన్ననాడు తనని కాపాడిన కువ్వారు స్వామి ని  జీవితాంతం స్మరిస్తూనే వున్నారు.
సింహాచలం మరియు ఇతర కొన్ని వైష్ణవ ఆలయాలలో  నేటికీ కొన్ని ఉత్సవ సమయాలలో “సన్నిధి విన్నపం” ఆనే సంప్రదాయం వుంది.ఆ సంకీర్తన కృష్ణమయ్యదేనని కొందరి భావన. మన దురదృష్టం కొద్ది  ఆయన రచనలలో 150/200 తంజావూరు గ్రంధాలయం లో తాళ పత్రాలలో దొరికాయి.వైష్ణవం పేరుతో  జరిగే కొన్ని  ఛాందస్త భావాలని కృష్ణమయ్య తీవ్రముగా ఖండిచటం వలన  ఆయన్ని ఆ రోజులో వెలుగు లోకి రాకుండా చేశారని కూడా బావించవచ్చు.నాలుగు లక్షలుకు పైగా సంకీర్తనలు చేసిన  ఆ మహానుభావుడు మరియు ఆ కీర్తనలు  వెలుగులోకి రాకపోవటం మనం చేసుకున్న దురదృష్టం. ఆయన తరువాత తరం వారైన అన్నమయ్య కు  తగినంత ప్రాచుర్యం లభించిఆయన కీర్తనలు వెలుగు లోకి రావటం   ఈయన వెలుగులోకి రాకపోవటానికి  అన్నమయ్య కు వున్నట్టు ఆచార్యుల వారికి  ప్రతిభావంతులైన కొడుకులు మరియు మనుమలు  లేకపోవటం  కూడా కావొచ్చు.అన్నమయ్య సంకీర్తనలు వెలుగు లోకి రావటానికి  టి‌టి‌డి చేసిన కృషి కూడా ఒక కారణం.కానీ మన కృష్ణమ్మయ్య కి ఎవరి అండదండలు అంటే  అటు ప్రభుత్వం కానీ  ఇటు దేవస్థానం సహకారం   లేకపోవటం వలన కూడ ఆయన కీర్తి,కీర్తనలు కూడ చీకటిలో మరుగున పడిపోయాయి.
ఆ కీర్తనలు శ్రీ కూర్మంలో గల పుష్కరణి మధ్యలో ఉన్న స్వామి ఆలయం క్రింద ఉన్న సొరంగం లో ఉన్నాయనీ.. కాదు చావులమదుం(తుమ్మెదల మెట్ట) దగ్గర ఆ తుమ్మెదలు ఒక బిలంలో దూరాయని అదే బిలంలో ఈ సంకీర్తనలు ఉన్నాయని వివిధ ప్రచారలు ఉన్నాయి. అలానే బ్రిటీషర్లు తరలించుకుపోయిన మన సంపదలో120 రాగిరేఖుల సంకీర్తనలు కూడా ఇంగ్లాండు మ్యూజియంలో ఉన్నాయి.
ఆ దేవదేవుడు సింహాద్రి అప్పన్న నే పూనికొని  తన భక్తుడి సంకీర్తనలన్నీ వెలుగు లోకి ఆ దేవదేవుడే తేవాలని  ప్రార్ధిస్తూ  ఉదాహరణ కి  కృష్ణమయ్య  వచనాలు  కొన్ని
దేవా!
విష్ణుభక్తి లేని విద్వాంసుని కంటే హరికీర్తనము జేయునతడే కులజుండు .
శ్వపచుండైననేమి?ఏ వర్ణంబైన నేమి? ద్విజునికంటే నతడే కులజుండు.


దేవా!
జయా జయా  రాఘావేశ్వరా !శ్రీ మన్నారాయణా
పరబ్రహ్మ స్వరూపా !అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకా
 వేదాంత వేద్య,పురాణ పురోషోత్తమా!
పురంధరవంద్య,కపటనాటక సూత్రధారి
ఆగణిత మహిమావతార !సకలగుణోన్నత!
శ్రీ కృష్ణ కువ్వారు స్వామీ!
సింహగిరి నరహరి! నమో నమో దయానిధి.

దేవా!
ఇదియే సత్యము ఇదియే నిత్యము
హరి నామమే పరమపదసోపానము
మనసా నీవు అనుమానముడిగి
నరహరి నామము తలచిన చాలు  ||ఇదియే సత్యము||
ఇదియే నాకు జపము తపము
ఇదియే నాకును పరమమంత్రము
ఇదియే నాకును పరమధర్మము
వేదశాస్త్ర పఠనింబిదయే !
సింహగిరి నరహరి! నమో నమో దయానిధి  ||ఇదియే సత్యము||

నేటి అంత్యప్రాసలకి కృష్ణమాచార్యులే ఆద్యుడు అనిపించే విధంగా రాశాడు. తెలుగు భాషకు ప్రాచుర్యం కల్పించిన కృష్ణమాచార్యులు మనకు ఆరాధ్యుడు మరియు చిరస్మరణీయుడు.ఆయన కీర్తి మరియు ఆచార్యుల వారి నాలుగు లక్షల ముప్పైరెండువేల  సంకీర్తనలు వెలుగు లోకి రావాలని  ఆ సింహాద్రి అప్పన్న ని కోరుకుందాము.

ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః