Friday, November 8, 2019

చిన్న తిరుపతి -ద్వారకా తిరుమల -ఏలూరు


                              చిన్న తిరుపతి -ద్వారకా  తిరుమల -ద్వి ధ్రువమూర్తులు 





హిందువులు  అందరికీ  ఆంధ్రప్రదేశ్ అంటే  ముందు గుర్తుకు వచ్చేది కలియుగ  వైకుంఠమ్ తిరుమల తిరుపతి . మన తెలుగు వారు చేసుకున్న  పుణ్యం ఏమిటంటే   స్వామి వారు ఒక తిరుపతి  లోనే కాదు మనల్ని తరింపచేయటానికి   స్వయంభూ గా వెలసిన క్షేత్రం ఇంకొకటి  మన ఆంద్రప్రదేశ్ నేల పైనే  వుంది . ఆ క్షేత్రమే  చిన్న తిరుపతి గా పిలవబడే ద్వారకాతిరుమల .ఈ ద్వారకతిరుమల క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా  ఏలూరు కి 42 కి మీ  దూరం మరియి భీమడోలు కి 17 కి మీ దూరం లో వుంది .ఇట్టి మహిమాన్విత క్షేత్రం గురించి  నాకు తెలిసిన  మరియు నేను చూసిన  కొన్ని విషయాలు ఇక్కడ మీతో పంచుకుంటాను .
|| శ్రీ  మద్వ్యాళగిరావహింద్రానిలయాన్యస్తాంఘ్రి కంజద్వయంశ్రీ  మద్ద్వారకమౌని పూజిత పదం  శ్రీ భూమినీళాన్వితంగోవిందం,నతచేతనాఘహరణం,త్రైవిద్య తాపాపహంవన్డే భక్తవరప్రదం స్మితముఖం శ్రీ    వేంకటేశం విభుం ||
శేషకృతి గల పర్వతమందలి,పూట్టలో పాదములు గలవాడు,శ్రీ ద్వారక మహర్షి చే పూజింపబడిన పాదపద్మములు కలవాడు ,శ్రీ భూ నీళాదేవులతో కూడి వున్నవాడు,గోవిందుడు,ఆశ్రితుల పాపములను హరించువాడు,త్రివిధ  తాపములను పోగొట్టువాడు ,భక్తులకు వరములు ఇచ్చినవాడు ,సదా  చిరునవ్వు   లొలుకు ముఖము గలవాడు సర్వవ్యాపకుడు అగునట్టి ద్వారకతిరుమల వేంకటేశ్వరస్వామి వారిని గూర్చి నమస్కరించుచున్నాను.
(ఈ శ్లోకం వ్రాయటానికి ఒక చిన్న విషయం జరిగింది  ,మీతో పంచుకోవాలనుకుంటున్నాను . నేను ద్వారక తిరుమల బ్లాగ్ వ్రాయటం మొదలుపెట్టిన తరువాత  నేను బయటకి వెళ్ళటం జరిగింది .నేను  నడుచుకొని వస్తువుంటే రోడ్ మీద ఈ శ్లోకం మరియు తాత్పర్యం వున్న ఒక కాగితము  దొరికింది .చాలా సంతోషముగా అనిపించి ఇక్కడ  ఈ శ్లోకం ని  జోడించాను.)


ద్వారకా తిరుమల ఉభయ గోదావరి మరియు కృష్ణ జిల్లా లో ప్రసిద్ధి చెందిన వేంకటేశ్వర క్షేత్రము. స్వయంభువుగా వెలిసిన  స్వామి ని చీమల పుట్టల  నుండి తీసి  ద్వారక అనే మునిపేరు  మీద ద్వారక తిరుమల అని  పిలిచారు .ఇంకా చిన్న తిరుపతి  గా  కూడా బాగా ప్రసిద్ది  చెందింది. ఈ చిన్న తిరుపతి లేదా ద్వారకా తిరుమల క్షేత్రం చాలా ప్రత్యేకతలతో నిండి వుంది.ఇక్కడ ఒక   ప్రత్యేకత  ఎమిటంటే స్వామి వారు  దక్షిణాభిముఖం గా వుంటారు ఉండటం అనేది చాలా అరుదు.ఇలా దక్షిణాభిముఖంగా ఎందుకు ఉన్నారంటే  ఎవరి పేరుమీద  అయితే ఈ క్షేత్రం వెలసిందో  ఆ ద్వారక ముని  ఉత్తరాభిముఖం గా తపస్సు చేస్తే  స్వామి ధక్షిణాభిముఖం గా  దర్శనం ఇచ్చారట .ఇంకొక విశేషం  ఏమిటంటే  శ్రీవారివి  రెండు విగ్రహా మూర్తులు  వుంటాయి .ఒక దృవ మూర్తి  సంపూర్ణంగా  వుంటే  ఇంకొక  మూర్తి పై భాగము  అంటే సగ భాగం మాత్రమే కనిపిస్తుంది .ఇవన్నీ కాక ఇంకొక మహత్తరమైన   ప్రత్యేకమైన  విషయం ఒకటి వుంది .పెద్ద తిరుపతి  అంటే తిరుమల తిరుపతి లో  ఏదన్నా మొక్కు కొని అక్కడికి వెళ్లలేకపోతే  ఇక్కడ  వున్న స్వామి ని దర్శించుకొని ఆ మొక్కుబడి ని  ఇక్కడ తీర్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ స్వామి కి మొక్కుకుంటే మాత్రము ఆ  మొక్కుబడి  ని  ఇక్కడే తీర్చుకోవాలి. ఇక్కడ మొక్కుబడి  పెద్ద తిరుపతి  లో  తీర్చుకోవటానికి  లేదు. ఇక్కడ రెండు ధ్రువ మూర్తులు వుండటం వలన స్వామి వారి తిరు కళ్యాణ ఉత్సవాలు ఏడాదికి  రెండు సార్లు  అంటే వైశాఖ మాసం లో  ఒకసారి మరియు ఆశ్వయుజ  మాసం లో ఇంకొకసారి  జరుగుతాయి . ఈ ఉత్సవాలు  చూడటానికి చుట్టప్కల  అంటే ఉభయగోదావరి  మరియి క్రిష్ణా జిల్లా  నుండి చాలా మంది భక్తులు వస్తారు. ఇసుక వేస్తే రాలనంత  జనం వుంటారు.
ద్వారకా  తిరుమల పేరు  వెనుక ఇంకొక  కధ కూడా ప్రచారం  లో వుంది . ద్వారకుడు అనే బ్రాహ్మణుడు అతని భార్య సునంద జీవితాంతం తిరుపతి వెళ్లి ప్రతిఏటా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేవారు, ఆయనకు ముసలితనం వచ్చి ఆలయానికి అంతదూరం రావడం కష్టం కావడంతో స్వామివారే ఇక్కడ వెలిశారని, ఆ ద్వారకుని పేరటనే ద్వారకా తిరుమలగా పేరు వచ్చిందని చెపుతారు . తిరుమల ని పెద్ద తిరుపతి గా ద్వారకాని చిన్న తిరుపతి గా  పిలుస్తారు  .
స్థల పురాణం ప్రకారం  ఈ గుడి  దాశరధ  మహారాజు  కాలం నుండి వున్నదని చెపుతారు .ఇక్కడ స్వామి వి రెండు ధృవ మూర్తులు వుంటాయి అని చెప్పుకున్నాము కదా  ఒకటి  అర్ధబాగము ఇంకొకటి పూర్తి విగ్రహము అని . ద్వారక ముని తపస్సు చేసి స్వామి ప్రత్యక్షమైనప్పుడు  శ్రీవారి పాద సేవ కోరుకున్నారట .  శ్రీవారి పాదములు పూజించే భాగ్యం  ద్వారక మునికి  దక్కింది .అందుకని శ్రీ వారి పాద పద్మములు  మాత్రము పుట్ట లో వుంటాయి. పైభాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది.. రామానుజాచార్యుల వారు ఇక్కడి కి వేంచేసి  నప్పుడు అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై ప్రతిష్ఠించారని అంటారు .ఇక్కడ ఇంకొక విశేషము వుంది ఏమిటంటే ఇక్కడ స్వామి వారికి  అభిషేకం చెయ్యరు . ఎందుకటే స్వామి వారిని  చీమల పుట్ట నుండి  వెలుపలికి తీశారు మరియు స్వామి వారి పాద పదములు పుట్టలో వుండటం వలన ఒక్క నీతి బొట్టు పడిన  స్వామి వారి విగ్రహం కిందన పుట్టలో వున్న  ఎర్రచీమలకు ఇబ్బంది కలుగుతుంది వాటిని కదలించకూడదు.       
 గర్భగుడిలో స్వయంభూ వేంకటేశ్వర స్వామి, ప్రతిష్ఠింపబడిన వేంకటేశ్వరస్వామి కన్నులపండువుగా కనిపిస్తారు ఇక స్వామి వారికి కుడివైపున   వున్న మంటపములో తూర్పు ముఖం గా  అలిమేలు  అమ్మవారు ,అండాళ్ అమ్మవారు కొలువై  మనలినీ దీవిస్తూ వుంటారు . గర్భగుడికి అభిముఖంగా, ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలుంటాయి . ప్రధాన మందిరంలో ఆంజనేయస్వామిగరుడస్వామిల చిన్న మందిరాలు ఆలయము చుట్టూ మనం ప్రదక్షిణ చేసే మార్గం లో  ప్రహరీని ఆనుకొని 12 మంది  ఆళ్వారుల ప్రతిమలతో వున్న చిన్న ఆలయాలు వుంటాయి  . నాలుగు దిక్కులా నాలుగు గాలి గోపురాలున్నాయి. వీటిలో దక్షిణ దిక్కున వున్న గాలి గోపురం  5 అంతస్తులతో మిగిలిన మూడుంటికంటే  పెద్దదిగా  వుంటుంది .ఈ ఆలయ ప్రాంగణం లో ఆళ్వారుల సమక్షం లో ద్యాన సాధన  అలవాటు వున్న వాళ్ళకి చాలా బావుంటుంది.శక్తి ప్రకంకపనలు అనుభవం లోకి వస్తాయి .

తాళ్ళపాక అన్నమయ్య 
ఆలయం  బయట  ఒక పార్క్ ల కట్టారు  ఈ పార్క్ మద్య లో  వాగ్గేయకారుడు  అన్నమాచార్యులవారి పెద్ద విగ్రహం ప్రతిష్టించారు. ద్వారక తిరుమల కి క్షేత్రపాలకులు  శ్రీ భ్రమరాంబ  మల్లేశ్వర స్వామి. ఈ ఆలయం వేంకటేశ్వర స్వామి ఆలయానికి  వెనుక గా అనగా వాయువ్య దిక్కులో  శ్రీ  భ్రమరాంబ  సమేత మల్లేశ్వర స్వామి కొలువు తీరి  ఉన్నారు  . ఈ ఆలయం లో కొండ  మల్లేశ్వర స్వామి తో  పాటు అమ్మవారు   భ్రమరాంబ గా మరియు గణపతి కొలువు తీరి  వున్నారు,
కొండ భ్రమరాంబ  మల్లేశ్వర స్వామి ఆలయం 


శ్రీవారి  గుడి నుండి భ్రమరాంబ  మల్లేశ్వర స్వామి ఆలయం కి వెళ్ళే మార్గం మద్యలో గోశాల మరియు గజ శాల వుంటాయి . మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉన్నదనీ, తలపైన శివుడు, తోక పైన విష్ణువు కొలువు తీరారనీ , అందువల్ల ఈ గుడిని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు .కొండపైన చుట్టూ పచ్చదనం తో కొత్తగా కట్టిన  శివోద్యానం అనే పూలతోట తో చాలా ఆహ్లాదముగా  చాలా ప్రశాంతముగా వుంటుంది .ఇక్కడ ఏ‌పి‌టి‌డి‌సి వారి పున్నమి వసతి గృహం ఉంటుంది. 
గోశాల 


గజశాల 









భక్తులు శ్రీవారి ఆలయం కి వచ్చే త్రోవలో కుంకుళ్లమ్మ గుడి (రేణుకా దేవి ఆలయం) ఉంటుంది .ఈ అమ్మవారు భక్తులకు  యాత్ర సమయం లో ఎలాంటి కష్ట నష్టాలు కలగకుండా  సదా రక్షిస్తుంటారు .భక్తులు ఈ గుడిలో వెనుక బాగం లో కుంకుడు చెట్టు వుంటుంది . ప్రదక్షిణ చేసేటప్పుడు తప్పనిసరిగా చాలామంది కుంకుడి చెట్టుకి నమస్కరించి ప్రదక్షిణ చేస్తువుంటారు. ద్వారక తిరుమల క్షేత్రం కి  వచ్చినవాళ్లు  తప్పకుండ  కుంకుళ్లమ్మ  దర్శించుకోవాలి  అని స్టానికులు చెప్పుతారు . ఒకవేళ  భక్తులు కుంకుళ్లమ్మను  దర్శించుకోకపోతే  తప్పకుండ  ఇంకొక సారి  చిన్న తిరుపతి కి రావలిసి వుంటుంది అంటే అమ్మవారు రప్పించుకుంటారని  ఇక్కడి స్టానికులు బలంగా నమ్ముతారు .
కుంకుళ్లమ్మ (రేణుక దేవి) ఆలయం 

ఇంకా కుంకుళ్లమ్మ గుడి తరువాత ఒక 2 కి మీ దూరం లో సంతాన వేణుగోపాల జగన్నాధస్వామి ఆలయం లక్ష్మి పురం అనే గ్రామం  లో వుంది .చాలా పెద్ద ఆవరణ లో  ఉన్న ఈ గుడి చాలా  బావుంటుంది. 130 సంవత్సరాల కి క్రితం అయిన  పూరీ
(ఒడిషా)కి చెందిన "మంత్రరత్నం అమ్మాజీ" అనబడే లక్ష్మీదేవి అనే వేంకటేశ్వర  స్వామి భక్తురాలు నిర్మించారు .శ్రీవారి ఆలయం తో పాటు వారి ఇలవేల్పు అయిన జగన్నాథ స్వామి వారి తో పాటు సుభద్ర బలదేవుల సన్నిదులు కూడా ఉన్నాయి .ఆవిడ పేరుతోనే ఈ గ్రామం లక్ష్మిపురం అని పిలవబడుతోంది.  ఇక్కడికి  రావటానికి దేవస్థానం ఉచిత బస్ సౌకర్యం వుంది .ఈ గుడి కూడా తప్పకుండ చూసితీరావాల్సిన  ప్రదేశం చాలా బావుంటుంది.
ఇక్కడ వుండటానికి అంటే  శ్రీ  భ్రమరంభా కొండ మల్లేశ్వర  స్వామి  ఆలయానికి  వెళ్ళే త్రోవలో APTDC వారి పున్నమి  గెస్ట్ హౌస్ ఉంది.అంతే కాకుండా దేవస్థానం వారి కాటేజీలు ( ఏ‌సి మరియు నాన్ ఏ‌సి) ఉన్నాయి . ఈ కాటేజీల నిర్వహణ మరియు వసతి సౌకర్యం  చాలా బావుంది .కాటేజ్ అద్దె  కూడా అందరికీ  అందుబాటు ధరల్లోనే వుంది .దేవస్థానం వారు dormitories ఇంకా లాకర్ సౌకర్యం కూడా  ఇస్తున్నారు.కొండ క్రిందన చాలా ప్రైవేట్ వారి వసతి గృహాలు చాలా  ఉంటాయి .దేవస్థానం వారు ద్వారకా తిరుమలనుండి తూర్పు యడవల్లి సీతారామచంద్ర దేవస్థానానికి, లక్ష్మీపురం సంతాన వేణుగోపాల జగన్నాధస్వామి ఆలయానికి, కుంకుళ్ళమ్మ ఆలయానికి ఉచిత బస్సు నడుపుతున్నారు.
ద్వారక తిరుమల  క్షేత్రానికి   వెళ్ళటానికి  తాడేపల్లి గూడెం,ఏలూరు,భీమడోలు నుండి ఏ‌పి‌ఆర్‌టి‌సి వారి బస్సులు ఉంటాయి . ఏలూరు నుండి ఒక గంట ప్రయాణం . ఏలూరు అన్నీ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఆగుతాయి .
తాడేపల్లి గూడెం లో కూడా  ముక్యమైన  అన్నీ ట్రైన్స్ ఆగుతాయి .17 కి మీ  దూరం లో వున్న భీమడోలు లో మాత్రం పాసింజీర్ మాత్రమే ఆగుతుంది .రాత్రి 8 గంటలు తరువాత బస్ లు  తక్కువగా వుంటాయి .
ద్వారకా తిరుమల తప్పక  దర్శించవలసిన  పుణ్యస్థలం . మీరు వెళ్లినప్పుడు మీకు ధ్యానం,సాధన అలవాటు వుంటే  మాత్రం ఆలయ ప్రాంగణం లో ఒక్క అరగంట అయిన సాధన చేయండి.స్వామి వారి శక్తి  ప్రకంపనలు అనుభవంలోకి వస్తాయి . ఈ విషయం  నేను మొదటిసారి  ఈ గుడి కి వెళ్లినప్పుడు ఒక పెద్దావిడ  కులశేఖర అళ్వార్  దగ్గర నేను కూర్చుని వున్నప్పుడు ఆవిడ చెప్పారు.ఇక్కడ స్వామి శక్తి రూపం లో వుంటారు ,  ఆళ్వార్ దగ్గర కానీ ప్రాంగణం లో  ఎక్కడ అన్న కూర్చొని ద్యానం చేయు సాధన కుదురుతుంది  అని చెప్పారు . నేను ఎప్పుడు వెళ్ళిన పెద్దావిడ సూచనని తప్పకుండ పాటిస్తాను .

ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః

3 comments: