Sunday, September 23, 2018

జిన్నూరు నాన్నగారు - 1


 జిన్నూరు  నాన్నగారు 



సత్యాన్వేషణ చేసే   ప్రతి వ్యక్తిని భగవాన్  ఆకర్షిస్తారు. ఆ ఆకర్షణ ఎంతలా వుంటుంది అంటే ఇనుము ముక్క అయస్కాంతన్ని ఎలా ఆకర్షించకుండా వుండలేదో అలా. ఆ దివ్య సుందర రూపాన్ని చూస్తూ భగవాన్ సన్నిధి లో  ఏన్ని యుగాలైన గడిపేయవచ్చు.భగవాన్ సన్నిద్ధి లో యెటువంటి ప్రయత్నం చేయకుండా మనస్సు ని అణిచివేసి  యెటువంటి ఆలోచనలు లేని  సచ్చితానందం లో మునిగిపోవచ్చు.భగవాన్ ఆకర్షణ కి వున్న శక్తి అటువంటిది.ఒక్కసారి ఆ మాయ లోకి వెళ్లిపోతే ఈ లౌకిక మాయ మనల్ని మభ్యపెట్టలేదు.

అలా భగవాన్ సమక్షమం లో గడిపి మనస్సుని అణిచి అహం యొక్క మూలాన్ని కనుక్కొని రమణతత్వం మీదా రమణుల చరిత్ర  పైన  , రమణ బోధనల మీదా మన తెలుగు వాళ్ళు చాలా పుస్తకాలు వ్రాశారు. కానీ భగవాన్ ని దర్శించకపోయిన  ఏ జన్మల పుణ్య ఫలం వలన భగవాన్ అనుగ్రహం కలిగి భగవాన్ పట్ల ఆకర్షితులై రమణ తత్వాన్నిఆకళింపు చేసుకొని రమణ మార్గమే తమ మార్గం గా చేసుకొని తెలుగు లో పుస్తకాలు రాసిన వాళ్ళు మరియు రమణ తత్వమును తమ  ప్రసంగాల ద్వారా  లోకానికి చాటిన  మహానుభావులు కొందరున్నారు.

అటువంటి మహానుభావులలో ఒకరు పశ్చిమ గోదావరి జిల్లా  జీన్నూరువాసులు భూపతి వెంకట లక్ష్మి నరసింహరాజు గారు. ఇలా చెపితే ఎవరికి తెలియకపోవచ్చు కానీ,   రమణ భక్తులు అయిన తెలుగు వారందరికి మాత్రం జీన్నూరు నాన్నగారు బాగా సుపరిచితం. భూపతి వెంకట లక్ష్మి నరసింహరాజు   కి నాన్నగారు అన్న పేరే  ఆయనకు సరయిన పేరు.జిన్నూరు నాన్నగారు రమణవాణి ని తన సత్సంగాల ద్వారా మనదేశంలోనే కాదు విదేశాలలో కూడా  వినిపించారు.భగవాన్ భోదనలు అందరికీ తెలియచేయటం నాన్నగారి  జీవితంలో భాగం కాదు దాన్నే జీవితం గా చేసుకున్నమహానుభావుడాయన. నాన్నగారు మహా వక్త  మాత్రమే కాదు ఆత్మజ్ణానం పొందిన తత్వవేత్థ్హ  కూడా.అందుకే ఆయన ప్రసంగాలు అంత్యంత సహజం గా  , మధురంగా కూడా వుంటాయి.


జీన్నూరు నాన్నగారి  ప్రసంగం నెమ్మదిగా ప్రారంభమై  అలా  ఒకో మెట్టు దాటుతూ  తారాస్తాయికి చేరుకుంటుంది. శ్రోతలని మంత్రముగ్దులని చేసి వారిని ఈ లోకం నుండి   భగవాన్ రమణుల లోకంలోకి తీసుకువెళ్తారు.నాన్నగారు  నాలుగైదు గంటలు ఏకధాటిన మాట్లాడినా శ్రోతలకు విసుగు రాదు.ఇంకోచెం సేపు ప్రసంగిస్తే బాగుండేనిపిస్తుంది.

జిన్నూరు నాన్నగారు ఒక సామాన్యమైన వ్యవసాయ కుటుంబం లో  ఇరవైమూడు తేది సెప్టెంబర్ నెల పందొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరం(23-09-1934) లో  పశ్చిమ గోదావరి జిల్లా కొమ్మర గ్రామం లో తమ మాతామహుల ఇంట జన్మించారు.వారి తండ్రి గారి స్వగ్రామం మాత్రం జిన్నూరు కావడం చేత నాన్నగారు అక్కడే పెరిగారు.నాన్నగారు స్వతహాగా చాలా నెమ్మది,దయ స్వభావం కలవారు. పాఠశాల రోజులలో తన  తో చదివే పేద విద్యార్థులకు  బోజన వసతి మరియు ఆర్దిక సహాయం చెయ్యటం లాంటివి చిన్నప్పటినుండి చేసేవారు. నాన్నగారు సేవ చెయ్యటం ద్వారా అహం  తగ్గించుకోవచ్చు అని భావించేవారు.జూన్నూరు నాన్నగారికి ఆద్యాత్మిక భీజం తన ఇరయై యేళ్ళ వయస్సులో వారి నాన్నమ్మ గారితో కలిసి  కాశీ  నుండి హిమాలయాల వరకు చేసిన పుణ్యక్షేత్ర యాత్రలో పడిందని చెప్పవచ్చు.ఆ యాత్రలో రిషికేశ్  లో వున్న స్వామి శివానంద గారిని మరియు స్వామి ఆత్మానంద దర్శనము చేసుకొని అశ్శీస్సులు పొందారు.అప్పుడే స్వామి ఆత్మానంద గారి ప్రోద్భలం తో శంకర భాష్య భగవద్గీత   మరియు ఇంకా కొన్ని ఆద్యాత్మిక  పుస్తకాలు చదివి ఆకళింపుచేసుకున్నారు. స్వామి ఆత్మానంద గారి మా మార్గదర్శకత్వం లో  నాన్నగారు తను తెలుసుకున్న జ్ణానాన్ని తన ప్రసంగాల ద్వారా అందరికి పంచటం  అనేది తన దినచర్య లో ఒక భాగమయిపోయింది.

నాన్నగారికి తన ఇరవైమూడేళ్ళ  వయస్సులో జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని ఒక కుదుపు కుదిపి నాన్నగారిని అధ్యాత్మిక ప్రంపంచం వైపు నడిపించింది.నాన్నగారు ఆ సంఘటన గుర్తు తెచ్చుకున్నపుడల్లా అలవి కానీ ఆనందం తో ఆయన మోము మెరిసిపోతువుంటుంది.ఆ ఘటన ని  నాన్నగారి మాటలలోనే చెప్పుకుందాం.“నాకు ఒకసారి కలలో ఒక వృద్ధుడు కనిపించి నన్ను మంచం మీద నుండి తీసి  మూడుసార్లు గట్టిగా  కుడి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నారు.నేను చాలా  కలవర పడి  వదిలి పెట్టమని ప్రాదేయపడ్డానుకానీ ఆయన నా మాట వినిపించుకోలేదు.నాకు ఆ వృద్ధుడు నా జీవితాన్ని ఆక్రమించుకోబోతున్నారని అని అనిపించిది.నేను భయం తో  ఆ వృద్ధుని పట్టునుండి బయటపడటానికి ప్రయత్నించాను.ఆ సమయం లో  నా తలగడ జారీ క్రింద పడిపోయింది.ఆయన క్రింద పడిన తలగదని తీసి మంచం మీద పెట్టి నన్ను జాగ్రత్త గా తిరిగి మంచం మీద పడుకోపెట్టారు.ఇప్పటికి ఇధి చాలు అని చెప్పి ఒక వైద్యుడు  తన పేషెంట్ ని వదిలి వెళ్ళినట్టు  నన్ను ఒకసారి  చూసి వెళ్ళిపోయారు.నాకు ఎంత ఆలోచించిన ఆ వృద్ధ వ్యక్తి ఎవరో అర్థం కాలేదు.సరిగ్గా ఆరు నెలల తరువాత నేను మా గ్రామం  గ్రంధాలయం లో హిందూ దినపత్రిక తిరగవేస్తుంటే  మద్రాస్ బుక్ పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించిన “గ్రేట్ మెన్ ఆఫ్ ఇండియా” అనే పుస్తకం యొక్క సమీక్ష   చదువుతుంటే  అందులో యేడవ వ్యక్తి  భగవాన్ రమణ మహర్షి వీరిని ఎక్కడో చూసినట్టు వుందే అని అనిపించింది.ఒక్కసారి ఒళ్ళు జలదరించింది.ఎందుకంటే వీరు ఎవరో కాదు  ఆరు నెలల క్రితం నా కలలో కనిపించిన వ్యక్తి.మద్రాస్ బుక్ పబ్లిషింగ్ హౌస్ వారి దగ్గరి నుండి పోస్టు లో  B V  నరసింహ స్వామి గారు  వ్రాసిన “ సెల్ఫ్  రియలిజేషన్”అనే పుస్తకం తెప్పించుకొని చదివాను.”

ఆ తరువాత 1959 లో నాన్నగారు దివ్యక్షేత్రమైన అరుణాచలం దర్శించారు. కానీ భగవాన్ అప్పటికే తమ బౌతిక దేహం చాలించారు. కానీ అనుగ్రహ కిరణాలను  మాత్రం ఎల్లవేళలా తమ భక్తులపై  ప్రసరిస్తువుంటారు.ఇక్కడ భగవాన్ తన మహా నిర్వాణనికి ముందు అన్న ఒక మాట ని గుర్తుచేసుకుందాం.నేను పోతున్నాని అంటున్నారు.కానీ ఇధివరకు కంటే అధికంగా సజీవుడనై వుంటాను అన్నారు. ఇప్పుడు భగవాన్  సర్వ వ్యాప్తులు. 



నాన్నగారు యొక్క ప్రసంగాల గురించి  మరియు జిన్నూరు ,తిరువణ్ణామలై  లో నాన్నగారు  స్థాపించిన ఆశ్రమాల గురించి  తరువాత  పోస్టు లో వివరిస్తాను  . 

ఓం  శ్రీ  భగవాన్ రమణాయ  నమః 

No comments:

Post a Comment