Sunday, September 23, 2018

జిన్నూరు నాన్నగారు - 2


జిన్నూరు నాన్నగారు 




నాన్నగారు అరుణాచలం దర్శించిన క్షణం నుండి  నాన్నగారు తన జీవితాన్ని  రమణ భగవాన్ కి అంకితం చేసుకున్నారు.రమణతత్వాన్ని  అందరికీ అర్ధం అయ్యేటట్లు భోదించటమే తన  కర్త్యవ్యం గా చేసుకున్నారు.రమణ వాణి ని  తన అద్భుతమైన వాక్చాతుర్యంతో రమణ భక్తులకు  వినిపించారు. ఒకసారి 1982 లో రమణాశ్రమం లో వున్నప్పుడు  భగవాన్,  నాన్నగారికి ఆత్మసాక్షాత్కారం  ప్రసాదించి ఆశ్వీరదించారు .రమణతత్వాన్ని సామాన్య జనానికి  సైతం అర్ధమైన రీతిలో వివరించి చెప్పేవారు.తన ఆఖరి క్షణం వరకు భగవాన్ కి తన జీవితాన్ని అంకితం చేసి రమణ వాణి ని అందరికీ చేరువ చెయ్యటమే తన  కర్తవ్యం గా జీవించారు. 

నాన్నగారు యెప్పుడు తెల్లని వస్త్రాలలో  వుండేవారు. వారు నిరాడంబరం గా, ప్రశాంతముగా పసిపిల్లల అమాయకత్వం తో  కూడిన ముఖంతో  ఒక  వింత అయిన   కాంతి తో మెరిసిపోతువుండేవారు. వారి ప్రతి కదలిక లోనూ సహజత్వం,సరళత్వం వుట్టి పడుతుంటాయి.వారు ఎల్లవేళలాఅందరికి అందుబాటులో  వుండేవారు.వారి హృదయాంతరాలలో దాగి వున్న సచ్చితానందం  వారి మోముపై   యెప్పుడు సదా చిరునవ్వు రూపం లో తొణికిసలాడుతువుంటుంది.నాన్నగారి సత్సంగాలకి ఒకోసారి ముప్పై నుండి నలబై వేలలో శ్రోతలు వచ్చి వారి ప్రసంగాన్ని మంత్రముగ్ధులై  వినేవారు.  అక్షరం ముక్క  కూడా తెలియని వారికి కూడా  సులువుగా అర్ధమయ్యే విదంగా వివరించి మాట్లాడటం అంటే సామాన్యమైన విషయం కాదు.గురువు అనుగ్రహం వున్నవారికే మాత్రమే  అది సాద్యపడుతుంది.

భగవాన్ చూపిన మార్గాన్ని, భోధలని తూ చా తప్పకుండ పాటించేవారు.నాన్నగారికి ఎటువంటి తారతమ్యాలు వుండేవి కావు .ఆయనకి అందరూ ఒక్కటే. పెద గొప్ప, విద్యావంతులు నిరక్షరాస్యులు, ఇలా ఒక వర్గం కాదు ఎవ్వరికైనా, ఎటువంటి  వారికైనా  నాన్నగారి  సమక్షం లో అంతులేని శాంతి లభించేది.నాన్నగారి దగ్గర యెటువంటి సమస్యకైనా, సందేహానికైనా ఊరట, సమాధానం లభిస్తాయి. వచ్చినవారు సత్యాన్వేషకులు కావొచ్చు,బాధలలో వున్న గృహస్తులు కావొచ్చు,కొత్త గా ఆద్యాత్మిక మార్గం లో అడుగులు వేస్తున్న వాళ్ళు కావొచ్చు ఎవ్వరికైనా  వారికి కావలిసింది  నాన్నగారి సమక్షం లో లభించేది ,అందరిపట్ల ఒకేరకమైనా ఆదరణ చూపించేవారు నాన్నగారు.నాన్నగారు సాధన కి ఎలాంటి ప్రత్యకమైన పద్దతి కానీ ఎలాంటి టెక్నిక్స్ గాని చెప్పేవారు కాదు.  ఎల్లప్పుడు తమ సహజస్తితిలో వుండమని చెపేవారు. అంటే రమణ మార్గము అయిన  ఆత్మ విచారణ మాత్రమే  ఆత్మ సాక్షాత్కారానికి చేరుస్తుందని చెప్పేవారు.


నాన్నగారు  జీన్నూరు లో మరియు తిరువణ్ణామలై(అరుణాచలం) లో ఆశ్రమాలు నిర్మించారు. 1980 లో జీన్నూరు లో  శ్రీ రమణ క్షేత్రం,1994 లో  అరుణాచలం లో నాన్నగారి ఆశ్రమం ను, 1999  లో ఆంధ్రా ఆశ్రమం భక్తుల కోసం నిర్మించారు.ప్రతి సంవత్సరం భక్తులతో  కలిసి అరుణాచలం వచ్చి  కొన్ని నెలలు రమణాశ్రమం లో గడిపేవారు. 
1991 లో రమణ భాస్కర  అనే తెలుగు ఆద్యాత్మిక పత్రికని ప్రారంభించారు.నాన్నగారు ప్రసంగాలు ఇస్తున్నపుడు చాలా మండి భక్తులు వ్రాసుకోవటం లేదా రికార్డు చేసుకొని వుంచుకుంటారు.ఆ ప్రసంగాలకి అక్షర రూపమే రమణ భాస్కర పత్రిక. నాన్నగారి ప్రసంగాలు ,అమృత వాక్కులు  పుస్తకాలుగా  కూడా  లభ్యమవుతున్నాయి . ఎవరన్నా నాన్నగారిని ఈ సత్సంగాల వలన మీరు యేమి సాధించారు అంటే  శ్రోతులలో  ఆశావాహ దృకపధం పెరిగి,వారి సమస్యలను 
పరిష్కరించుకునే మనో ధైర్యం  కలుగుతుంది.శ్రవణం,మననం కారణముగా సమాజములో  శాంతియుత జీవనానికి ఈ సత్సంగాలు బాటలు  వేస్తాయి అని చెప్పేవారు.

రమణ భాస్కర పత్రికను http://www.srinannagaru.com/sn/index.php  ద్వారా కూడా చదవవొచ్చు.రమణ భాస్కర పత్రిక కి ఇంగ్లిష్ అనువాదం కూడా పైన చెప్పిన సైట్ లో దొరుకుతుంది. ఈ సైట్  నుండి నాన్నగారి పుస్తకాలూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు 

వి.వి,గణేశన్ గారు(చిన్న స్వామి మనుమలు మరియు రమణాఆశ్రమం  కి  ప్రెసిడెంట్ గా పనిచేశారు)  వ్రాసిన  పుస్తకం ”మీటింగ్స్   విత్  సెజస్  అండ్ సెయింట్స్ “ లో   నాన్నగారి గురించి  వ్రాసారు  మరియు  నాన్నగారి తో తనకి వున్న అనుబంధం గురించి తన జిన్నూరు పర్యటన గురించి చాలా చక్కగా వివరముగా  వ్రాశారు.

వేల్పూరు మౌనస్వామి,వి.గణేశన్ గారు ,నాన్నగారు
(ఎడమ నుండి  కుడికి)

మొత్తం తన జీవితాన్ని రమణుల భోదనలను ఆచరించి వాటిని  లోకానికి చాటి  చెప్పిన నాన్నగారు, భగవాన్ తనకి అప్పచెప్పిన  పనులన్ని సక్రమముగా నిర్వర్తించి 29-12-2017 రమణైక్యం చెందారు.నాన్నగారు  బౌతీకంగా మన మద్య లేకపోయిన వారి ప్రసంగాల  రూపం లో ఏప్పటికి చిరంజీవులే.భగవాన్  ని బౌతికముగా  దర్శించక పోయినా  భగవాన్  రమణుల కి  తన  జీవితాన్ని అంకితం చేసిన నిజమైన రమణ పుత్రుడు జీన్నూరు నాన్నగారు.

ఎవరైనా సాధకులు అధ్యాత్మిక సాధన్ కోసం  అరుణాచలం  లో వున్న నాన్నగారి ఆశ్రమంలో వుండాలి అనుకుంటే, ముందుగా   మెయిల్ గాని ఫోన్ ద్వారా గాని బుక్ చేసుకోవలసి వుంటుంది.. ఆంధ్ర ఆశ్రమం  రమణాశ్రమం కి చాలా దగ్గరగా అంటే నడుచుకునే వెళ్లగలిగేంత దగ్గరగా  వుంటుంది.భక్తులు వుండడానికి వసతి సౌకర్యం కూడా ఉంటుంది. వసతి కోసం ముందుగా బుక్ చేసుకోవలసి వుంటుంది.
 జిన్నూరు ఆశ్రమం లో శ్రీ రమణ జయంతి,దీపోత్సవం,గురుపూర్ణిమ ,నాన్నగారి జయంతి మొదలైన ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటారు.
శ్రీ నాన్నగారు  గురించి, వారి ప్రసంగాలు, వారి అమృతవాక్కులకు  అక్ష్ర రూపం,వారి పుస్తకాలు మరియు ఆశ్రమ విశేశాలు అన్నీ నాన్నగారి సైట్  http://www.srinannagaru.com లో లభ్యమవుతాయి.అరుణాచలం లో వసతి కావాలనుకున్న వారు ఈ సైట్ నుండి ముందుగా బుక్ చేసుకోవచ్చు.



ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః.

జిన్నూరు నాన్నగారు - 1


 జిన్నూరు  నాన్నగారు 



సత్యాన్వేషణ చేసే   ప్రతి వ్యక్తిని భగవాన్  ఆకర్షిస్తారు. ఆ ఆకర్షణ ఎంతలా వుంటుంది అంటే ఇనుము ముక్క అయస్కాంతన్ని ఎలా ఆకర్షించకుండా వుండలేదో అలా. ఆ దివ్య సుందర రూపాన్ని చూస్తూ భగవాన్ సన్నిధి లో  ఏన్ని యుగాలైన గడిపేయవచ్చు.భగవాన్ సన్నిద్ధి లో యెటువంటి ప్రయత్నం చేయకుండా మనస్సు ని అణిచివేసి  యెటువంటి ఆలోచనలు లేని  సచ్చితానందం లో మునిగిపోవచ్చు.భగవాన్ ఆకర్షణ కి వున్న శక్తి అటువంటిది.ఒక్కసారి ఆ మాయ లోకి వెళ్లిపోతే ఈ లౌకిక మాయ మనల్ని మభ్యపెట్టలేదు.

అలా భగవాన్ సమక్షమం లో గడిపి మనస్సుని అణిచి అహం యొక్క మూలాన్ని కనుక్కొని రమణతత్వం మీదా రమణుల చరిత్ర  పైన  , రమణ బోధనల మీదా మన తెలుగు వాళ్ళు చాలా పుస్తకాలు వ్రాశారు. కానీ భగవాన్ ని దర్శించకపోయిన  ఏ జన్మల పుణ్య ఫలం వలన భగవాన్ అనుగ్రహం కలిగి భగవాన్ పట్ల ఆకర్షితులై రమణ తత్వాన్నిఆకళింపు చేసుకొని రమణ మార్గమే తమ మార్గం గా చేసుకొని తెలుగు లో పుస్తకాలు రాసిన వాళ్ళు మరియు రమణ తత్వమును తమ  ప్రసంగాల ద్వారా  లోకానికి చాటిన  మహానుభావులు కొందరున్నారు.

అటువంటి మహానుభావులలో ఒకరు పశ్చిమ గోదావరి జిల్లా  జీన్నూరువాసులు భూపతి వెంకట లక్ష్మి నరసింహరాజు గారు. ఇలా చెపితే ఎవరికి తెలియకపోవచ్చు కానీ,   రమణ భక్తులు అయిన తెలుగు వారందరికి మాత్రం జీన్నూరు నాన్నగారు బాగా సుపరిచితం. భూపతి వెంకట లక్ష్మి నరసింహరాజు   కి నాన్నగారు అన్న పేరే  ఆయనకు సరయిన పేరు.జిన్నూరు నాన్నగారు రమణవాణి ని తన సత్సంగాల ద్వారా మనదేశంలోనే కాదు విదేశాలలో కూడా  వినిపించారు.భగవాన్ భోదనలు అందరికీ తెలియచేయటం నాన్నగారి  జీవితంలో భాగం కాదు దాన్నే జీవితం గా చేసుకున్నమహానుభావుడాయన. నాన్నగారు మహా వక్త  మాత్రమే కాదు ఆత్మజ్ణానం పొందిన తత్వవేత్థ్హ  కూడా.అందుకే ఆయన ప్రసంగాలు అంత్యంత సహజం గా  , మధురంగా కూడా వుంటాయి.


జీన్నూరు నాన్నగారి  ప్రసంగం నెమ్మదిగా ప్రారంభమై  అలా  ఒకో మెట్టు దాటుతూ  తారాస్తాయికి చేరుకుంటుంది. శ్రోతలని మంత్రముగ్దులని చేసి వారిని ఈ లోకం నుండి   భగవాన్ రమణుల లోకంలోకి తీసుకువెళ్తారు.నాన్నగారు  నాలుగైదు గంటలు ఏకధాటిన మాట్లాడినా శ్రోతలకు విసుగు రాదు.ఇంకోచెం సేపు ప్రసంగిస్తే బాగుండేనిపిస్తుంది.

జిన్నూరు నాన్నగారు ఒక సామాన్యమైన వ్యవసాయ కుటుంబం లో  ఇరవైమూడు తేది సెప్టెంబర్ నెల పందొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరం(23-09-1934) లో  పశ్చిమ గోదావరి జిల్లా కొమ్మర గ్రామం లో తమ మాతామహుల ఇంట జన్మించారు.వారి తండ్రి గారి స్వగ్రామం మాత్రం జిన్నూరు కావడం చేత నాన్నగారు అక్కడే పెరిగారు.నాన్నగారు స్వతహాగా చాలా నెమ్మది,దయ స్వభావం కలవారు. పాఠశాల రోజులలో తన  తో చదివే పేద విద్యార్థులకు  బోజన వసతి మరియు ఆర్దిక సహాయం చెయ్యటం లాంటివి చిన్నప్పటినుండి చేసేవారు. నాన్నగారు సేవ చెయ్యటం ద్వారా అహం  తగ్గించుకోవచ్చు అని భావించేవారు.జూన్నూరు నాన్నగారికి ఆద్యాత్మిక భీజం తన ఇరయై యేళ్ళ వయస్సులో వారి నాన్నమ్మ గారితో కలిసి  కాశీ  నుండి హిమాలయాల వరకు చేసిన పుణ్యక్షేత్ర యాత్రలో పడిందని చెప్పవచ్చు.ఆ యాత్రలో రిషికేశ్  లో వున్న స్వామి శివానంద గారిని మరియు స్వామి ఆత్మానంద దర్శనము చేసుకొని అశ్శీస్సులు పొందారు.అప్పుడే స్వామి ఆత్మానంద గారి ప్రోద్భలం తో శంకర భాష్య భగవద్గీత   మరియు ఇంకా కొన్ని ఆద్యాత్మిక  పుస్తకాలు చదివి ఆకళింపుచేసుకున్నారు. స్వామి ఆత్మానంద గారి మా మార్గదర్శకత్వం లో  నాన్నగారు తను తెలుసుకున్న జ్ణానాన్ని తన ప్రసంగాల ద్వారా అందరికి పంచటం  అనేది తన దినచర్య లో ఒక భాగమయిపోయింది.

నాన్నగారికి తన ఇరవైమూడేళ్ళ  వయస్సులో జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని ఒక కుదుపు కుదిపి నాన్నగారిని అధ్యాత్మిక ప్రంపంచం వైపు నడిపించింది.నాన్నగారు ఆ సంఘటన గుర్తు తెచ్చుకున్నపుడల్లా అలవి కానీ ఆనందం తో ఆయన మోము మెరిసిపోతువుంటుంది.ఆ ఘటన ని  నాన్నగారి మాటలలోనే చెప్పుకుందాం.“నాకు ఒకసారి కలలో ఒక వృద్ధుడు కనిపించి నన్ను మంచం మీద నుండి తీసి  మూడుసార్లు గట్టిగా  కుడి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నారు.నేను చాలా  కలవర పడి  వదిలి పెట్టమని ప్రాదేయపడ్డానుకానీ ఆయన నా మాట వినిపించుకోలేదు.నాకు ఆ వృద్ధుడు నా జీవితాన్ని ఆక్రమించుకోబోతున్నారని అని అనిపించిది.నేను భయం తో  ఆ వృద్ధుని పట్టునుండి బయటపడటానికి ప్రయత్నించాను.ఆ సమయం లో  నా తలగడ జారీ క్రింద పడిపోయింది.ఆయన క్రింద పడిన తలగదని తీసి మంచం మీద పెట్టి నన్ను జాగ్రత్త గా తిరిగి మంచం మీద పడుకోపెట్టారు.ఇప్పటికి ఇధి చాలు అని చెప్పి ఒక వైద్యుడు  తన పేషెంట్ ని వదిలి వెళ్ళినట్టు  నన్ను ఒకసారి  చూసి వెళ్ళిపోయారు.నాకు ఎంత ఆలోచించిన ఆ వృద్ధ వ్యక్తి ఎవరో అర్థం కాలేదు.సరిగ్గా ఆరు నెలల తరువాత నేను మా గ్రామం  గ్రంధాలయం లో హిందూ దినపత్రిక తిరగవేస్తుంటే  మద్రాస్ బుక్ పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించిన “గ్రేట్ మెన్ ఆఫ్ ఇండియా” అనే పుస్తకం యొక్క సమీక్ష   చదువుతుంటే  అందులో యేడవ వ్యక్తి  భగవాన్ రమణ మహర్షి వీరిని ఎక్కడో చూసినట్టు వుందే అని అనిపించింది.ఒక్కసారి ఒళ్ళు జలదరించింది.ఎందుకంటే వీరు ఎవరో కాదు  ఆరు నెలల క్రితం నా కలలో కనిపించిన వ్యక్తి.మద్రాస్ బుక్ పబ్లిషింగ్ హౌస్ వారి దగ్గరి నుండి పోస్టు లో  B V  నరసింహ స్వామి గారు  వ్రాసిన “ సెల్ఫ్  రియలిజేషన్”అనే పుస్తకం తెప్పించుకొని చదివాను.”

ఆ తరువాత 1959 లో నాన్నగారు దివ్యక్షేత్రమైన అరుణాచలం దర్శించారు. కానీ భగవాన్ అప్పటికే తమ బౌతిక దేహం చాలించారు. కానీ అనుగ్రహ కిరణాలను  మాత్రం ఎల్లవేళలా తమ భక్తులపై  ప్రసరిస్తువుంటారు.ఇక్కడ భగవాన్ తన మహా నిర్వాణనికి ముందు అన్న ఒక మాట ని గుర్తుచేసుకుందాం.నేను పోతున్నాని అంటున్నారు.కానీ ఇధివరకు కంటే అధికంగా సజీవుడనై వుంటాను అన్నారు. ఇప్పుడు భగవాన్  సర్వ వ్యాప్తులు. 



నాన్నగారు యొక్క ప్రసంగాల గురించి  మరియు జిన్నూరు ,తిరువణ్ణామలై  లో నాన్నగారు  స్థాపించిన ఆశ్రమాల గురించి  తరువాత  పోస్టు లో వివరిస్తాను  . 

ఓం  శ్రీ  భగవాన్ రమణాయ  నమః 

Sunday, September 16, 2018

అవధూత వెంకయ్య స్వామి గుడి -విజయనగరం -3


అవధూత వెంకయ్య స్వామి గుడి -విజయనగరం

స్వామి వారి విగ్రహం 

అవధూత  వెంకయ్య స్వామి వారి ఆలయం ధుని  విజయనగరం లో కూడా ఉంది .స్వామి గుడి ని 2000వ  సంవత్సరం  లో కట్టారు.ఈ గుడి ని స్వామి తన మహాసమాధి తరువాత స్శశరీరం తో  ఒక భక్తునికి దర్శనం ఇచ్చి  అడిగి  మరి కట్టించుకున్నారు.స్వామి  పిలిస్తే  పలికే దైవం. తనని నమ్మేవాళ్ళ కోసం స్వయం గా ఇక్కడ  కొలువై వున్నారు . 



ఈ గుడి విజయనగరం ఆర్‌టి‌సి  కాంప్లెక్ష్ నుండి సుమారుగా  6km దూరం లో జమ్ము నారాయణ పురం లో  కోమటి చెఱువు దాటిన  తరువాత  వుంది.ఈ గుడి పల్లె  వాతావరణము లో హడావిడి కి దూరంగా  కట్టారు.గుడి  యొక్క మెయిన్ గేట్ ని దాటి వెళ్ళగానే స్వామి యొక్క  చిత్రపటాలు  మరియు స్వామి వారి  దివ్య  సూక్తులు  చిత్రించి వుంటాయి.గుడి ఆవరణ  లో దత్తాత్రేయులు మరియు కృష్ణుని విగ్రహములు  చిన్నవి వుంటాయి.అవి దాటి వెళ్ళగానే స్వామి వారి పాలరాతి  విగ్రహము  వున్న ఒక పెద్ద హాల్ వుంటుంది.ఈ హాల్ ముఖద్వారం పై  ఓం నారాయణ  ఆదినారాయణ  అని వ్రాసి వుంటుంది.స్వామి వున్న హాల్ ద్వారం నకు ఎదురుగా ఎడమ పక్కన  ధుని వుంటుంది. గుఢి భవనము కి ఎడమ పక్కన బోజనాల హాల్ పెద్దది వుంటుంది.ఇక్కడ కూడా శనివారం ప్రత్యేకము.ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.ఇక్కడ కూడా గొలగమూడి  లో వలె ధుని చుట్టూ ప్రదక్షిణ  చేసి స్వామి ని దర్శిస్తారు.ఇక్కడ కూడా స్వామి రక్ష గా దారం ఇస్తారు .



గుడి  ఉదయం 5 గంటలకి తెరుస్తారు.పగటి పూట తెరిచే వుంటుంది.ఇక్కడ పూజ చేయటానికి ప్రత్యేకము గా పూజారి వుండరు.స్వామి భక్తుడు మరియి ఈ గుడి కట్టిన మహానుబావుడే  పూజ చేస్తారు.ఈ గుడి కట్టిన భక్తునికి ఈ గుడి కట్టడానికి ముంది స్వామి ఎవరో తెలియది.వారి ఊర్లో వున్న రాముడు గుడి తప్ప ఇంకాయెక్కడికి వెళ్లింది లేదు.ఈ గుడి కట్టిన వారు పూర్వం భవన నిర్మాణ పనులు చేసే మేస్త్రి గా పనిచేసేవారు.వారు  విజయనగరం లో షిర్డీ సాయిబాబా ఆలయం లో ధుని నిర్మాణం చేస్తుండగా  రైతు లా కనిపించే ముసలి పెద్దాయన మేస్త్రి గారికి కి కనిపించి నువ్వు ఈ పనులు ఆపేసి నాకు మరియ ఇంకొంత మందికి అన్నం పెట్టాల్సిన సమయం వచ్చింది అని చెప్పి వెళ్లిపోయారట.పాపం మేస్త్రి గారు స్వామి ని యెప్పుడు చూడలేదు ఆయే.అందుకని అర్థము కాలేదు, ఎవరో కూడా తెలియలేదు.ఎవరో పెద్దాయన  యేదో చెప్పారు అని ఊరకుండిపోయారు.సాయి బాబా గారి గుడి పూర్తి అయిన తరువాత  గుడి కట్టించిన గురువుగారు  సాయి సుందరం మహారాజ్,గుర్ల ,విజయనగరం తో  పాటు మేస్త్రి గారు కూడా  గొలగమూడి వెళ్ళటం తటస్టించింది.అక్కడ స్వామి వారి  చిత్రపటం చూసిన తరువాత తను చూసింది వెంకయ్య స్వామి గారిని అని తెలిసింది.అక్కడ గొలగమూడి  లో ధుని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వుండగా మరల స్వామి కనిపించి విజయనగరం లో ఇప్పుడు వున్న ప్రదేశం లో  గుడి కట్టమని ఆదేశించారట. గుడి గురించి స్వామి  గురించి ఎవరన్నా అడిగితే ఈ విషయాన్ని పూజారి గారు ఎంతో నమ్రతతో స్వామి పట్ల అలవికానీ ప్రేమతో చెపుతారు.ఇక్కడ జరిగే ప్రతి  పూజా  కార్యక్రమాలు స్వామి నే స్వయంగా   చేయించుకుంటున్నారు నేను నిమిత్తమాత్రుడను మాత్రమే అని సవినయం గా చెప్పుకుంటారు. నిజమైన  భక్తుడు అనుకునేది ఇదే  కదా చేసేది నేను కాదు చేయించేది ఆ భగవంతుడు” అని .
”నాహం కర్త హరిమ్ కర్త “ ఇదే  కదా భగవంతుని శరణాగతికి కావలిసింది.


ఇక్కడ కూడా గొలగమూడి లో జరిగినట్టు ఆగస్టు నెలలో  22,23,24 స్వామి వారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి.
ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఆలయం లో స్వామి ని దర్శించుకోవచ్చు.ప్రతి శనివారం మరియు గురు పూర్ణిమ రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి.ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది.వెంకయ్య స్వామి భక్తులు విజయనగరం కి దగ్గరిలో వున్నవారు తప్పక చూడవలిసిన ప్రదేశము.

స్వామి  వారి సూక్తులు   :
  • త్రెపేవారికి కాదయ్యా ఆకలై కొంగు  పట్టేవారికి  అన్నం  పెట్టాలయ్య. 
  • అన్ని  జీవులలో  వెంకయ్య వున్నాడని వ్రాసుకో . 
  • మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని  వదలను . 
  • సన్యాసులు ధర్మంగా వుండటంలో గొప్ప ఏముంది ? సంసారంలో ధర్మంగా వుండటమే గొప్ప. 
  • వడ్డీ విషయంలో కూడా ధర్మంగా వుండాలయ్యా 
  • పావలా దొంగిలిస్తే పది రూపాయిలు నష్టం. 
  • లాభంలో భాగమాశిస్తే  పాపంలో కూడా భాగం వస్తుంది. 
  • ఒకరిని పొమ్మనేదానికంటే మనం పోవడం మంచిదయ్య. 
  • కూతురిని కోడలిని సమానంగా చూసుకుంటే దేవుడు కనపడతాడు. 
  • పోయేవాళ్ళని పొనిచ్ఛేదేగదయ్యా 
  • దారం తెగిపోకుండా చూచుకుంటే నేను ఎప్పుడూ మీతోనే వుంటానయ్యా . 
ఓం నారాయణ ఆది నారాయణ.

ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః


Saturday, September 15, 2018

శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయం -నెల్లూరు - గొలగమూడి -2




శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి  ఆలయం -గొలగమూడి

స్వామి వారి గుడి 

గొలగమూడి నెల్లూరు జిల్లా లో నెల్లూరు నుండి  సుమారుగా 12km దూరంలో వుంది.స్వామి వారు   24-August-1982 లో  ఇక్కడే మహా సమాధి చెందారు.ఇప్పటికి స్వామి పిలిచినవారికి పలికే దైవం ,కొలిచిన వారికి కొంగు బంగారం.


వెంకయ్య స్వామి ఆలయం చుట్టూ విశాలమైన ప్రకారం వుంటుంది.ఆలయ ముఖద్వారం నుండి చూస్తే గర్భగుడి  లోని స్వామి విగ్రహం  స్పష్టం గా కనిపిస్తుంది.భక్తులు సమాధి వున్న ద్వారం దగ్గరి నుండి కూడా దర్శించుకోవచ్చు.ముఖద్వారం నకు ఎడమ  పక్కన ధుని వుంటుంది.భక్తులు ధుని లో ఎండు కొబ్బరికాయలు,నవధాన్యాలు  మూడు లేదా తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసి  వేస్తారు.స్వామి కూడా  ఎప్పుడు ఎక్కడ కి వెళ్ళిన పక్కన ధుని ని వెలిగించి ఎప్పుడు వెలుగుతూ వుండేటట్టు చూసేవారు.ఆ తరువాత క్యూ లో వెళ్ళి స్వామి ని దర్శించు కోవాలి.ఆలయం లో స్వామి వారి ఫోటో లు  వుంటాయి.గర్భగుడి  లో  గోడలకి స్వామి వారి ఫోటో లు రెండు వుంటాయి.గర్భగుడి లో జ్యోతి  వెలుగుతూ వుంటుంది.అక్కడ వెండి పాదుకలు వుంటాయి.భక్తులు స్వామి వారి పాదుకలను తాకి నమస్కరించుకొని  వెంకయ్య స్వామి వారి ని దర్శించుకుంటారు.ఇక్కడ ప్రసాదం గా తీర్ధం,ఇంకా దారం ,పటిక ,విభూది ఇస్తారు.గుడి ఆవరణ లో స్వామి వారి సూక్తులు వ్రాసి వుంటాయి.


స్వామి సమాధి -  గర్భగుడి 
కొందరు  భక్తులు స్వామి దర్శనం తరువాత  కోరికలు విన్నవించుకొని ఆ  రాత్రి ఆ ఆలయ సమీపము లో నిద్రిస్తారు.గుడి ప్రాగాణం లో ముఖ్య ద్వారం  ముందు ఒక పెద్ద హాల్ వంటిది కట్టించారు.అక్కడ స్వామి వారి ఫోటో వుంటుంది.అక్కడ సాయంత్రం  భక్తులు భజనలు  చేస్తారు.ఈ మంటపము లో రాత్రి నిదురించవచ్చు.మరిసటి రోజు స్వామి ని దర్శించుకొని తిరుగు ముఖం పడతారు.కోరికలు తీరిన  వారు కూడా  రాత్రి నిదురిస్తారు.ఇక్కడ శనివారం విశేష పూజలు జరుగుతాయి.భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.స్వామి వారి ఆలయం పక్కనే ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా వుంటుంది.స్వామి వారి ఆలయమో కి దగ్గరలో స్వామి వారి కుటీరం కూడా వుంటుంది.

ప్రతి సంవత్సరం ఆగస్టు మాసం లో 18-24 తేదీలలో ఆరాధనోత్సవాలు జరుగుతాయి.స్వామి వారి ఆలయము లో నిత్య ఆన్నదానం కూడా వుంటుంది,స్వామి వారు ఉన్నప్పుడు లానే .దేవస్తానం వారు ఈ పరంపర ని ఇప్పటికీ స్వామి దయతో కొనసాగిస్తున్నారు.




నిత్యాన్నదానం తో పాటు దేవస్తానం వారు హాస్టల్,గోశాల మరియు వృద్దాశ్రం నడుపుచున్నారు.

ఆలయ దర్శన వేళలు : 6:30AM-11:00AM, 12:00PM-2:00PM, 4:00PM-6:30PM, 7:30PM-8:30PM వరకు స్వామి వారిని దర్శించవచ్చు.

నా తరువాయి పోస్టులో విజయనగరం  గుడి గురించి  తెలియచేస్తాను 

ఓం నారాయణ ఆదినారాయణ.
ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః

అవదూత శ్రీ గొలగమూడి భగవాన్ వెంకయ్య స్వామి - 1



అవదూత గొలగమూడి వెంకయ్య స్వామి

వెంకయ్య స్వామి
అవదూత అనగా నాశరహితుడు ,శ్రేష్టుడు,సంసారబంధాలు విడిలీంచి వేసినవాడు,తన శరీరం పై యెటువంటి అనురాగము లేనివాడు,నేను అనే అహన్నీ త్వజించిన వాడు అని మన ఉపనిషత్తులు చెపుతున్నాయి.ఆచార వ్యవహారాలు,శుచి అశుచి ,విధి నిషేదాలు లాంటివి యేవి పట్టించుకోకుండా సదా బ్రహ్మానందం  లో మునిగి  సచ్చితానందం  అనుభవిస్తూ  అత్నర్ముఖులై వుంటారు.వీరి సమక్షము లో  జీవులు అనంతమైన ప్రశాంతత ని అనుభవిస్తారు.వారి దర్శన భాగ్యమే జీవుల పాపాలని హరించివేస్తుంది. దత్తాత్రేయ స్వామి ని అవదూత ల పరంపర లో మొదటివానిగా చెప్పవచ్చు. ఈ కోవకి చెందిన అవదూతలే షిర్డీ సాయిబాబా,అక్కల కోట మహారాజ్,చీరాల స్వామి, మన వెంకయ్య స్వామి మొదలైనవారు.
భగవంతుడు అవదూతల రూపంలో భూమి పై సంచరిస్తూ వుంటారని గురు చరిత్ర చెపుతుంది.వారు మనలని రక్షించి  వుద్దరించటానికి భూమి  పైకి వస్తారని భాగవతం చెపుతోంది.ఈ అవదూతలనీ గుర్తించే సామార్ద్యము మనలాంటి వారికి వుండదు.వారు మన మధ్యనే వున్న గుర్తించలేని ఆజ్ణానం మనది.అటువంటి మహోన్నతమైన పరిపూర్ణమైన అవదూత  శ్రీ గొలగమూడి  వెంకయ్య స్వామి.
ఒక సామాన్య రైతు కుటుంబం లో  జన్మించి  యేమి తెలియని ఆ పల్లె  జనాల మద్యనే వుండి  వారి యొక్క కష్టా నష్టాలను  తీర్చి వారి లో ఒకరుగా బతికిన మహానుబావుడు మహా అవదూత  శ్రీ వెంకయ్యస్వామి.స్వామి గురుంచి వ్రాయటానికి ,స్వామి ని గురుంచి చెప్పటానికి మనకి వున్న శక్తి ,అర్హత సరిపోదు.
నేను అనుకోకుండా గొలగమూడి లో స్వామి ఆలయం కి  మూడు సార్లు వెళ్ళటం జరిగింది.అక్కడ స్వామి ఆలయం లో స్వామి సమక్షం లో కలిగిన  ప్రశాంతత , అనుభూతి మాటల లో చెప్పలేనిది.స్వామి యెప్పుడు అంటువుండేవారట “మన గొర్రె మందలో ఎక్కడ వున్న కాళ్ళు పట్టి లాక్కొస్తాను అని”. బహుశా నేను అలాంటి గొర్రెనే  ఎందుకటే గురువు అనుగ్రహం లేనిదే మనం ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేము.ఇప్పటికీ  కూడా స్వామి తనని నమ్మిన వారికి ,భక్తులకు స్వామి స్సశరీరులుగా కూడా దర్శనం ఇస్తువుంటారు మరియు సదా రక్షిస్తూ వుంటారు.
వెంకయ్య స్వామి  చరిత్రను గురించి వ్రాయలంటే చాలా పెద్ద పుస్తకము అవుతుంది.ఇక్కడ స్వామి వారి గురించి కొంత ,స్వామి సమాధి వున్న నెల్లూరు ఆలయం మరియు విజయనగరం లో వున్న స్వామి వారి గుడి గురించి చెపుతాను.
స్వామి వారు నెల్లూరు జిల్లా  నాగవెల్లటూరు అనే పల్లెలో  సోంపల్లి  పెంచలయ్య ,పిచ్చమ్మ అనే పుణ్యదంపతులకు మొదటి సంతానం. స్వామి కి  ఇద్దరు తమ్ములు ఒక చెల్లి వుండేవారు.స్వామి సోదరి పట్ల చాలా ప్రేమని కనపరచేవారు.స్వామి కి రావలిసిన   తన వాటాఆస్తి  మొత్తం తన సోదరికి  ఇచ్చేశారు.స్వామి వారి పుట్టిన తేదీ సరిగ్గా తెలియదు.ఒక భక్తుడు చెప్పిన ప్రకారం ధాత నామ సంవత్సరం లో వచ్చిన కరువు నాటికి స్వామి కి పదమూడు సంవత్సరముల  వయస్సు అని.స్వామి కి 1982 కి వంద సంవత్సరముల పైనే వుంటుంది.
స్వామి వారికి ఇరవైఏళ్ళ వయస్సులో బాగా జ్వరం వచ్చినప్పుడు స్వామి వారి తల్లి తండ్రులు” ఇల్లు వేలం వెయ్యబోతున్నారు  నువ్వు ఎక్కడ వుంటావు అని అడిగితె “ మనకి అప్పులు లేవు కదా ఎందుకు వేలం వేస్తారు “అన్నారట.జ్వరం తీవ్రత వలన మతిబ్రమించటం వలన అలా మాట్లాడుతున్నారనుకోనినాటు వైద్యం ,భూత వైద్యం లాంటివి చేయించారట.కొన్ని రోజుల తరువాత  స్వామి ఇంటి నుండి వెళ్ళిపోయి చాకలి యోగం -మంగలి యోగం అని అరుస్తూ ఊరంతా తిరిగేవారట. స్వామి తన ఊరిలో ఎవరితో కలవక ఎప్పుడు యేదో లోకం లో వుండటం వలన స్వామి యొక్క  అవదూత గుణం ని గుర్తించక పిచ్చి వెంకయ్య అనేవారు.చాకలి యోగం -మంగలి యోగం అంటే మన మనస్సు కి పట్టిన చెడు తలంపులని యెప్పటికప్పుడు పరిశుబ్రం చేసుకోవాలని ఇంకా తలకి పట్టిన చెడు తలపులని కత్తిరించుకోవాలని ఆ విదముగా బోధించేవారు.కానీ స్వామి యొక్క అవదూత తత్వాన్ని అర్థం చేసుకోలేక  పిచ్చి వెంకయ్య అనేవారు.అవదూత ల లక్షణం అంతే   మరి.వారు మనుషులకి దూరం గా వుండటానికి అలా మనలిన్ని మాయ చేస్తూ వుంటారు.
ఆ తరువాత స్వామి పెంచల కోన అడవుల లోకి వెళ్ళిపోయారు.అక్కడే స్వామి కి ఒక మహాత్ముని దర్శనం అయింది అని  అప్పటి నుండి వెంకయ్య స్వామి గా మారారని అంటారు.అప్పుడప్పుడు స్వామి ఊరికి వచ్చేవారు కానీ ఇంటికి వెళ్ళక చెళ్లలోనూ,ఊరిశివార్లలోనూ తిరిగేవారు.ఎవరన్నా ఏమన్నా పెడితే తినేవారు లేదంటే మౌనంగా వుండిపోయేవారు.స్వామి భగవాన్ వెంకయ్య స్వామి గా  కొంతకాలానికి అనేక గ్రామాలు తిరిగి కోటితీర్ధం కి వచ్చి కొన్నాళ్లు వుండి తరువాత పెన్నా బద్వేలు  తిప్ప పై వుండేవారు.కొంత కాలానికి గొలగమూడి గ్రామానికి చేరుకొని అక్కడే  చిన్న పూరిపాకలో  అతి నిరాడంబరముగా  తన జీవితాన్ని గడిపారు.
స్వామి పిలిస్తే పలికే దైవం. స్వామి కి చిన్నప్పటి నుండి అన్నీ జీవుల పట్ల చాలా దయ తో వుండేవారు. తన జీవితం అంతా  ఆ అమాయక పల్లె  ప్రజల కష్టాలు తీర్చటం  కోసమే బ్రతికారు.యెన్నో అద్భుతాలు మహిమలతో మనుషుల బాధలే కాదు మూగజీవాల బాధలు  తీర్చారు.వైద్యం సరిగ్గా లేని ఆ రోజులలో తన మహిమ తో మనుషులకి మరియు మూగజీవాలకి కూడా నయం చేసేవారు.వానలు లేక ఎండలతో అల్లాడుతుంటే వానలు కురిపించారు.స్వామి భక్తులు కష్టాలు చెప్పుకుంటే వేలిముద్రలు వేసి ఇచ్చేవారు.స్వామి ఒక దారాన్ని చూపించారు .ఇవన్నీ స్వామి చరిత్ర లో విపులం గా వుంటాయి.
స్వామి కి చిన్నతనం నుండి ఏకాంతముగా వుండటానికి ఇష్టపడేవారు.స్వామి ఎల్లప్పుడూ “ఓం నారాయణ ,ఆదినారాయణ” అని ఒక కర్ర తంభూరతో పాటలు పాడేవారు. స్వామి వారు షిర్డీ సాయిబాబా ని పెద్దఅన్నయ్య గా భావించేవారు.స్వామి వారి మాటలు వారి భోదలు చాలా సరళముగా అందరికీ అర్ధం అయ్యేతట్టు వుంటాయి.ఎలా అంటే  “నమ్మితే సొమ్ము నమ్మకపోతే  దుమ్ము”,ఎవరన్న స్వామి చెప్పింది వినకపోతే “పోతుంటే పోనిచ్చేదే గదయ్యా  అనేవారు”,”మైసూర్ మహారాజు ని చూస్తే యేమి వస్తుంది అయ్యా మనకున్నదే మనది”,దేవుని సేద్యం చేస్తే  ఆయనే అన్నం పెడతాడు”,ఇలాంటివి యెన్నో స్వామి  చాలా తక్కువగా మాట్లాడేవారు.స్వామి  కూడా  తన పెద్దన్న సాయిబాబా లనే భక్తుల నుండి దక్షిణ కొరటం,తద్వారా తత్వము వుపదేశించేవారు.పలికిన ప్రతి వాక్కు గురు వాక్కే.
స్వామి వారు   24-August-1982 లో  గొలగమూడి లో   మహా సమాధి చెందారు.స్వామే స్వయము గా ఈ ఊరుని యెంచుకొని  ఇక్కడే వుండిపోయారు. ఇక్కడినుండి స్వామి  చుట్టు పక్కల పల్లెలకి వెళ్ళేవారు. స్వామి భక్తులకు ఎక్కువగా  తిరువల్లూరు  వీర రాఘవ స్వామి ని కానీ, కంచి కామాక్షమ్మ ని దర్శించమని చెప్పేవారు.ఒకోసారి  స్వామి నే స్వయముగా భక్తులతో కలిసి  వెళ్ళేవారు.ఇప్పటికి స్వామి పిలిచినవారికి పలికే దైవం ,కొలిచిన వారికి కొంగు బంగారం.
భగవాన్ వెంకయ్య స్వామి  వారి లీలలు,వారి సూక్తులు,వారి చరిత్ర  అపూర్వం.ఇంకా విపులం  గా తెలుసుకోవాలంటే స్వామి వారి నిత్య పారాయణ గ్రంధం ,మాస్టర్ భరద్వాజ గారు రాసిన  “ నేను దర్శించిన  మహాత్ములు -శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర “ చదవొచ్చు.




స్వామి వారి సూక్తులు  కొన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఒక్కక్క  మాట  మనం జీవితంలో  తప్పకుండ  పాటించవలసినవి. 




తరువాత పోస్టు లో నెల్లూరు గొలగమూడి ఆలయం గురించి వ్రాస్తాను.
ఓం నారాయణ ఆది నారాయణ.
ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః.

అరుణాచల రమణయ్యా


అరుణాచలవాస  రమణయ్యా  


నిను  వదిలి వెళ్లలేనయ్య  అరుణాచల నిలయ
నిను  కానక  నిలువలేనయ్యా    అరుణాచల రమణ
అమ్మ వైన చేత నిన్ను వదిలి వెళ్లలేనయ్యా
నిను విడిచి వుండలేనయ్యా నా రమణయ్యా 
తెరవమాకు  నా తప్పుల పుస్తకమయ్యా  రమణయ్యా 
తెలివి లేని నీ చిట్టి తల్లినయ్యా రమణయ్యా
నిను వదిలి వుండలేనయ్య రమణయ్య
నిన్ను విడిచివుండలేనయ్య అరుణాచలవాస
నాన్న వై నన్ను నడిపించవయ్య రమణయ్య
నేస్తమై నాతో మాట్లాడవయ్య ఓ  రమణయ్య 
నిను వదిలి వెళ్లలేనయ్య రమణయ్య
యెరుగక ఎదురు తిగితే ఎడబాటు చేయకయ్యా
మందబుద్ధి అయిన నీ బిడ్డనయ్య ఓ రమణయ్య
నిను వదిలి వుండలేనయ్య రమణయ్యా
అమ్మ వు  నీవు అందరినీ మరపించినావయ్య
నిన్ను వదిలి వుండలేనయ్య అరుణాచలవాస రమణయ్యా
నిను విడిచి వుండలేనయ్యా




Tuesday, September 4, 2018

వేల్పూరు మౌన స్వామి

వేల్పూరు  మౌన రమణ స్వామి 


భగవాన్ రమణుల భాష  మౌనం. ఒకసారి  ఆల్ ఇండియా రేడియో  వారు  భగవాన్ మాటలు రికార్డు చెయ్యటానికి  వస్తాము అన్నారని ఒక గాలి  వార్త   ఆశ్రమం లో  వచ్చింది  .అప్పుడు భగవాన్  నవ్వుతూ " ఓహో  ! అట్లాగా  నా మాట మౌనమే కదా . యెట్లా రికార్డు  చేస్తారు ,వున్నది మౌనమాయె దాని రికార్డు చెయ్యటం ఎవరి  తరం  " అన్నారు  . ఈ విషయాన్ని సూరి నాగమ్మ గారు శ్రీ రమణాశ్రమ లేఖలు (శ్రీ రమణాశ్రమ లేఖలు-మౌనముద్ర)  లో  చాల అద్భుతము  గా  వర్ణించారు .
భగవాన్ ఉపదేశం  కూడా మౌనవాక్యమే ఎందుకంటే అయన అపర దక్షిణ మూర్తి కదా .
మరి భగవాన్ ఉపదేశము అయిన మౌనం  మరియు నిరాడంబరత్వాన్ని ఆచరిస్తున్న మహా మౌనయోగి   ఇక్కడే మన మధ్యనే ఆంధ్రప్రదేశ్ లోనే వున్నారు . రమణతత్వము  లో పూర్తిగా మునిగి భగవాన్  చూపిన మార్గాన్ని అనుసరిస్తూ  మనలాంటి వారికీ  మార్గం చూపే మహానుభావుడు  వేల్పూరు  రమణ స్వామి.
రమణ మార్గమే తన మార్గంగా  చేసుకొని  భగవాన్ కి సంబదించిన  ఎన్నో  పుస్తకాలను తెలుగు లో ప్రింట్ చేయించి  రమణ భక్తులకు ప్రసాదము  గా  ఇచ్ఛే  మౌన స్వామి గురించి   ఆయన  ఆశ్రమం గురించి కొన్ని విషయాలు  ఇక్కడ మీతో పంచుకుంటాను .
వేల్పూరు  మౌన స్వామి ఆంధ్రప్రదేశ్ ,పశ్చిమ  గోదావరి  జిల్లా ,తణుకు కి  సుమారుగా  8Km  దూరంగా  వేల్పూరు  లో వుంటారు .స్వామి  బాల రమణ స్వామి   గా  మరియు  ఆశ్రమము  శ్రీ  రమణ నిలయ ఆశ్రమము గా   అక్కడ అందరికి  బాగా సుపరిచితం.

 స్వామి  మౌన స్వామి కదా భక్తుల   సందేహాలకి  సమాధానం పలక  మీద  వ్రాసి  ఇస్తారు. స్వామి ని దర్శించిన  వారికీ  ప్రసాదం  గా  భగవాన్ పుస్తకము  మరియు  చాకోలెట్స్  ఇస్తారు. కానీ  ప్రశ్నలు  మాత్రమూ ఆధ్యాత్మిక సంబధమైనవి  మాత్రమే అడగాలి .
స్వామి దిన చర్య ఉదయం  రెండు  గంటలకి  ప్రారంభమవుతుంది .స్వామి ఉదయం  రెండుగంటలకే లేచి ధ్యాన మందిరం కి వచ్చి  ధ్యానం లో మునిగిపోతారు .స్వామి తో పాటు వుండే ఆశ్రమ  వాసులు  కూడా లేచి ధ్యానం చేస్తుంటారు .ఉదయం  నాలుగు  ఐదు  గంటల మధ్య  ఆశ్రమవాసులు  ధ్యానం నుండి లేచి  గోశాల  కి  సంబదించిన పనులు  మరియు ఆశ్రమ  వాసులకి  , అతిదులకి    టీ మరియు  అల్పాహారం  తయారు  చెయ్యటానికి  ఉపక్రమిస్తారు . స్వామి మాత్రం   ఈ ప్రపంచము  తో సంబంధం  లేకుండ ధ్యానంలో  మునిగివుంటారు . అ  సమయం లో  అక్కడ  ఎలాంటి  వారికైనా  ధ్యానం అద్భుతం  కుదురుతుంది .స్వామి సమక్షం లో మనస్సు శూన్యము  అయి మనం కూడా ఆ ధ్యానం లో మునిగిపోవటం  తథ్యం.
 ఉదయం పదిన్నర  పదకొండు  గంటల  మధ్యన  సీతమ్మ అనే  అవ్వ   హారతి ఇచ్చి  ఇంకా స్వామి ని కొబ్బరి నూని మరియు  కర్పూరము తో   రుద్ది ధ్యానం నుండి  భౌతిక  స్థితి కి  తీసుకు వస్తారు .సీతమ్మఅవ్వ  గత ముప్పై  సంవత్సరాల గా స్వామి ని  సేవించుకుంటున్నారు.
స్వామి  పదకొండు  గంటల  నుండి భక్తులను  మరియు  సందర్శకులు    అడిగే  ప్రశ్నలకు సమాదానాలు పలక  మీద వ్రాసి   ఇస్తారు .వచ్చిన  వారికి  ప్రసాదంగా  స్వామి స్వయం  గా  ప్రింట్ చేయించిన పుస్తకాలూ ఇస్తారు .స్వామి మోము ఎల్లవేళలా  ప్రశాంతముగా   చేరునవ్వుతో ప్రకాశిస్తూ  ఉంటుంది  .వచ్చిన వాళ్ళు పిల్లలు అయితే స్వామి  మోము మహా సంతోషం తో వెలిగిపోతూ  వాళ్ళని నవ్వుతోనే పలకిరించి  వారికి ఇష్టమైన  చాకోలెట్స్  చేతి నిండుగా తీసి ప్రసాదం గా  ఇస్తారు .
మధ్యాహ్నం పన్నెండున్నర  ఒంటిగంట మధ్యలో స్వామి సుఖాసనమ్  నుండి లేచి భోజనము  చేస్తారు .భగవాన్  ఏ విధముగా అయితే  భోజనం లో   అన్ని కలిపి ఒక ముద్దగా చేసుకుని తినేవారో అదేవిధముగా  స్వామి కూడా అన్నము,రసం,చపాతీ మజ్జిగ అన్ని కలిపి ముద్దలా చేసి మధ్యాహన భోజనం  ముగిస్తారు . కొంచెం విరామము  తరువాత స్వామి అక్కడ వుండే పొలం లో పని చేస్తారు లేదా అక్కడ జరిగే నిర్మాణ  పనుల లో కానీ గోశాల  లో వుండే ఆవులకు  గడ్డి కోయటం లాంటి పనులు చేస్తారు.

సాయంత్రము  ఆరు  ఏడూ గంటల మధ్య కాలంలో    ఆశ్రమ వాసులు  మరియు అతిధులు  అందరు  రాత్రి భోజనం ముగించి పుస్తక ప్రింటింగ్ మరియు బైండింగు మొదలైన   పనులు   రాత్రి  తొమ్మిది వరకు చేస్తారు. ఆ తరువాత కొంత సేపు ధ్యానం చేసి  ఆ రోజు ముగిస్తారు .మరల  ఉదయం రెండుగంటలికి  లేచి సన్నపానాదులు  ముగుంచి స్వామి మరియు ఆశ్రమవాసులు  ధ్యానం లో కూర్చుంటారు .


ఆశ్రమ  దర్శనానికి ఎటువంటి బేధాలు లేవు  ఎవరన్నా ఎప్పుడన్నా ఆశ్రమము ని దర్శించవచ్చు .ఆశ్రమం  పచ్చటి పొలాల మధ్యన ప్రశాంతం వాతావరణం లో పట్టణ  హడావిడి  కి దూరంగా ఉంటుంది. ఆశ్రమము  ప్రవేశ  ద్వారం  భగవాన్  ఫోటో తో రమణ నిలయ  ఆశ్రమం  బోర్డు తో ఉంటుంది .మనం ఆశ్రమం  లోకి వెళ్ళగానే ఒక  ప్రక్కన  కొన్ని   గదులతో కూడిన  ఒక  భవనము   ఉంటుంది .ఈ బిల్డింగ్  స్వామి ని చూడటానికి దూరం నుండి వచ్ఛే భక్తుల  కోసం కొందరు  భక్తులు కట్టించారు .ఆ భవనం  నుండి పక్కగా ఒక అందమైన మట్టి రోడ్డు  దానికి ఇరుపక్కల అందమైన వరి  పొలాలు ఉంటాయి. ఆ త్రోవ వెంబటి వెళ్తూ వుంటే  మట్టి రోడ్ పక్కన   ఒక ఆసుపత్రి ఉంటుంది. ఆ మట్టి  త్రోవ వెంబటి ముందు కి వెళితే స్వామి వుండే ఆశ్రమం .ఇక్కడ పెద్ద ధ్యానం మందిరం ,వెనుకగా గోశాల, స్వామి గది మొదలైనివి   ఉంటాయి. ధ్యాన మందిరం కి కొంచెం ముందు న  వంట గది  ఉంటుంది. ధ్యాన మందిరం కి  ముందు అరుణాచలం కొండ నమూనా  ని ఏర్పాటు చేసారు  .కొందరు  భక్తులు ఈ  నమూనా  చుట్టూ ప్రదక్షిణలు చేస్తువుంటారు .  ఆశ్రమ భవనం చుట్టూ  పూల చెట్లు ఇంకా రక రకాల  మొక్కలతో  చాల ఆహ్లదం గా  ఉంటుంది . కొందరు భక్తులు ధ్యానమందిరం చుట్టూ కూడా ప్రదక్షిణలు  చేస్తూ కనిపిస్తారు . ఆశ్రమం  లో  మంచి మాటలతో కూడిన సూక్తులు రాసిన బోర్డు లు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి .
రమణ  భగవాన్  భక్తులు  ఒక్కసారైనా  చూడలిసిన స్థలం వేల్పూరు రమణాశ్రమము.    ఎందుకంటే  ఈ వేల్పూరు  ఆశ్రమం  మరియు  మౌనస్వామి  మనకి రమణుల వున్నప్పుడు వున్న  రమణాఆశ్రమము  ను  గుర్తు చేస్తుంది . ఒకవిధంగా చెప్పాలంటే మనము  సూరి నాగమ్మ గారు,కృష్ణ భిక్షు  గారు  వాళ్ళ  రచనలలో  చెప్పిన రమణా ఆశ్రమము కి వెళ్లినట్టు ఉంటుంది .
ఆశ్రమము  కి వెళ్ళటానికి తణుకు లో దిగి   షేర్ ఆటో లో   గాని   APRTC  బస్సు  లో గాని  వెళ్ళవచ్చు.తణుకు కి వెళ్ళటానికి ట్రైన్  మరియు  బస్సు సౌకర్యము  కలదు .ఆశ్రమం  లో  ఉండాలి అనుకుంటే అక్కడ   వసతి సౌకర్యం కూడా కలదు .
ఈ  కర్మ యోగి  కి   తన జీవిత చరిత్ర  గురుంచి రాయటం ఇష్టంలేదు   అందుకని వారి జీవితచరిత్ర వ్రాయటానికి  ఎవరికీ  అనుమతికూడా ఇవ్వలేదు.
ఇవన్నీ  నేను ఆశ్రమం దర్శించినప్పటి  నా అనుభవాలు.






ఓం  శ్రీ భగవాన్ రమణాయ  నమః