Saturday, October 20, 2018

యాత్ర 06-శ్రీకాకుళం- శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం -మందస



శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం -మందస


శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం పేరుని బట్టి ఈ ఆలయం ఎక్కడో తమిళనాడు లో ఉండే వైష్ణవ దేవాలయంలా అనిపిస్తుంది.కానీ ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలో ఉన్న ప్రాచీన దేవాలయం. శ్రీకాకుళంనికి వంద కిలోమీటర్ల దూరం లో ఎనిమిది వందల నాటి  అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం తో కట్టిన అతి పురాతన ఆలయం.
ప్రాచీన కళింగ నిర్మాణ శైలి,పచ్చని పల్లె వాతావరణం, ఎత్తైన కొందలమద్యన ఉన్న శ్రీ వాసుదేవ పెరుమాళ్ల ఆలయాన్నిసందర్శిస్తే అన్నీ వైష్ణవ ఆలయాలని దర్శించినంత ఫలమని చెపుతారు.ఈ
ఆలయం లోకి ప్రవేశించినంతనే ఏదో తెలియని ఒక అద్యాత్మిక ఆనందానికి లోను అవుతాము. సుమారు 266 సంవత్సరాలక్రితం ఇది పునర్నిర్మితమయినట్టు ఇక్కడ లభించిన ఆధారాలబట్టి తెలుస్తున్నది. ఎర్రని ఇసుక రాయితో కళింగ శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్పసంపద వర్ణనాతీతం. ఆలయంలో నెలకొని ఉన్న నిలువెత్తు సాలగ్రామ మూలమూర్తి కంచి లో కొలువైన వరదరాజ స్వామి విగ్రహాన్ని పోలి ఉంటుంది.ఇక్కడ ఉండే స్వామి విగ్రహాన్ని కంచి నుండి తయారీ చేయించి తెచ్చారని అంటారు.గత శతాబ్దము చివర వరకు ఇది మంచి వేదాధ్యయన కేంద్రముగా కూడా విలసిల్లినట్లు కూడా తగిన ఆధారాలు ఉన్నాయి.
పెరుమాళ్  స్వామి వారి సన్నిధి 
ఈ ఆలయాన్ని ఎవరు యెప్పుడు నిర్మించారో సరైన సమాచారం లభించటం లేదు.కానీ మూడువందల సంవత్సరాల క్రితం మందసను పాలించిన రాజు మణిదేవమహారాజు ఈ ఆలయాన్ని పునరుద్దరించారు.ఆ తరువాత ఎవరు పట్టించుకోకపోవటం వలన శిధీలస్థితికి వచ్చింది.చిన్న జీయరు స్వామి వారి చొరవతో మరలా గత వైభవాన్నిసంతరించుకుంది.
శ్రీ వాసుదేవ పెరుమాళ్ల ఆలయానికి ఒక అద్భుతమైన చరిత్ర వుంది.పెద్ద జీయరు స్వామి వారు ఇక్కడే శ్రీభాష్యం అద్యనయం చేశారు.పెద్ద జీయరు స్వామి అంటే ఇప్పటి చిన్న జీయరు స్వామి వారి గురువు గారు. ఆ కాలంలో ఇక్కడి  ఆచార్యులు మందసా రామానుజులు వేదాంత విద్యలో నిష్ణాతులు .వారు కాశి వరకు వెళ్ళి విద్యత్ గోష్టులలో పాల్గొని పలువురు వేద విధ్వాంసులను వేదాంత చర్చలలో ఓడించి చాలా  ప్రశంశలు అందుకున్నారు.వీరి కీర్తిని గురించి విన్న పెద్ద జీయరు స్వామి వారికి వారి వద్దశ్రీ భాష్యం నేర్చుకోవాలని వారికిని మరియు వారి మిత్రులైన గోపాలాచార్య స్వామి వారి కోరిక.అందుకని పెద్ద జీయరు స్వామి వారు, వారి మిత్రులు గోపాలాచార్యస్వామివారితో కలసి నేటి రాజమండ్రి నుంచి శ్రీభాష్యం అధ్యయనం చేయడానికి కాలినడకన మందసకు చేరుకున్నారు. గురువులకు ప్రణమిల్లి శ్రీభాష్యం నేర్పించమని అడిగారు .ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు .కానీ ఆ రోజు  రాత్రి ఆలయప్రాంగణంలో నిద్రించిన శిష్యులిద్దరికీ వారు రాజమండ్రి వద్ద దాటి వచ్చిన గోదావరి వంతెన విరిగి వరదలో కొట్టుకుపోయినట్లు కల వచ్చింది. అది అపశకునంగా భావించిన శిష్యులిద్దరు తమ విద్యాభ్యాసానికి ఆటంకము కలుగుతుందేమోనని భయపడుతూ గురువు గారివద్దకు వెళ్ళి తమ కల సంగతి చెప్పారు. గురువుగారు వారిని ఊరడించి ఆలయంలో ఉన్నశ్రీ వాసుదేవ పెరుమాళ్ వద్దకు వారిని తీసుకుని వెళ్ళి స్వామికి సాష్టాంగ నమస్కారము చేయించి, వారు కూడా చేసారు. ఆ సమయంలో వాసుదేవుని విగ్రహం నుండి ఓ దివ్యమయిన కాంతి ప్రసరించినదట. వాసుదేవుని అనుగ్రహం వల్ల శిష్యులిద్దరు సుమారు 2 సంవత్సరాలలో పూర్తికావలసిన శ్రీభాష్యం అధ్యయనాన్ని కేవలం 6 నెలలలోనే పూర్తి చేసుకున్నారు . అందుకని ఇక్కడి దేవుని జ్ఞానప్రదాతగా, అభయప్రదాతగా భక్తులు కొలుస్తారు.
తమ గురువు గారు ఇక్కడ తమ ఆద్యాత్మిక విద్యను అభ్యసించిన క్షేత్రం కావటం తో చిన్నజీయరు స్వామి పెద్దజీయరు స్వామి వారి శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్నిపునర్నిర్మించారు.వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి ఒక్కప్పడు సుమారుగా పదిహేడు వందల ఎకరాల మాన్యం ఉండేది.కానీ మనుషుల అత్యాశకి ప్రతీకగా మూడు ఎకరాలు మాత్రము మిగిలింది.ఆలయం కూడా శిధిలమయిపోయింది.కానీ 1988 లో చిన్నజీయరు స్వామి వారు ఈ ఆలయ చరిత్రను తెలుసుకొని ఖర్చుకు వెనుకడకుండా,అన్ని ప్రభుత్వ లాంచనాలు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారినుండి ఆలయాన్ని స్వాధీనం చేసుకుని, ఒడిషా నుంచి శిల్పులను రప్పించి యదాతధంగా ఆలయాన్నిపునర్నిర్మింపచేసారు. 

గురువులు  పెద్దజీయరు స్వామివారి విద్యాభ్యాసానికి గుర్తుగా వారి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా చిన్నజీయరు స్వామివారు 2009 ఫిబ్రవరి నెలలో పూర్తిగా శిథిలమయిన ఈ ఆలయాన్నిపునఃప్రతిష్ట చేసారు.
శ్రీ వాసుదేవ పెరుమాళ్ల ఆలయం లో స్వామి వారు శ్రీదేవి,భూదేవి అమ్మవార్లతో కొలువు తీరి ఉన్నారు.ఇంకా స్వామి వారితో పాటు చిన్ని కృష్ణుడు,గోదాదేవి అమ్మవారు కొలువై పూజలు అందుకుంటున్నారు.

శ్రీ వాసుదేవ పెరుమాళ్ల ఆలయ దర్శన వేళలు ఉదయం 5.30 AM నుండి 11.30 AM వరకు మరియు 4.30PM నుండి 7PM వరకు.ప్రతి సంవత్సరం మాఘమాసం లో బ్రహ్మొత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి.
ఈ ఆలయం చుట్టుపక్కల అనేక దర్శనీయ స్థలాలు వున్నాయి.అందులో ఒకటి వరాహ స్వామి ఆలయం మరియు పాండవుల ఆలయాలు.ఇవి మహేంద్రగిరి పర్వతం వద్దవున్నాయి.ఇంకా అలనాటి రాజవైభవం కి గుర్తుగా మందస కోట ను కూడా దర్శించవచ్చు.స్వామి వారి ఆలయం పకక్నే వున్న శివాలయం చూడవలసిన క్షేత్రం.
మందస జిల్లా కేంద్రం అయిన శ్రీకాకుళం నుండి 100 KM దూరం లో వుంది.ఇంకా చెన్నై-కొలకత్తా జాతీయ రహదారి లో వున్న పలాస నుండి 5 KM మాత్రమే.

ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః 

1 comment:

  1. ఈ దేవాలయం గురించి అస్సలు వినలేదు.. మంచి సంగతి తేలిపావు.. Thank you somuch...

    ReplyDelete