Sunday, October 21, 2018

యాత్ర 08-శ్రీకాకుళం-బారువ


బారువ సముద్ర తీరం బారువ


మన ఆంద్రప్రదేశ్ కి ఉన్నఅధ్బుతమైన వరం పొడవైన  అందమైన బంగాళాఖాత సుమద్రతీరం.అలాంటి అందమైన సముద్రతీరాలలో శ్రీకాకుళం జిల్లా లో సోంపేట కి దగ్గరగా ఉన్న బారువ బీచ్ ఒకటి. ఇక్కడ తీరము కంచూపు మేర ఇసుక తిన్నెలతో మరియు కొబ్బరి తోటలతో చాలా అందముగా, ఆహ్లాదకరముగాను ఉంటుంది. ఉదయిస్తున్న సూర్యుడ్ని ఇక్కడి సుముద్రతీరముంలో నిలుచుని చూడటం ఒక అద్భుతమైన అనుభవం.  మహేంద్రతనయ నది తూరుపుకనుమలలో పుట్టి ఒడిస్సా ,ఆంద్ర రాష్ట్రాల గుండా ప్రవహించి బారువ గ్రామం వద్ద సాగరం లో కలిసే సాగరసంగమం.

బారువ గ్రామాన్ని ఆలయాల గ్రామం గా చెపుతారు.ఇక్కడ ఎటు చూసిన పురాతన ఆలయాలలే కనిపిస్తాయి.ఇక్కడ  సముద్రపు ఒడ్డున ఉన్న శ్రీ కొటేలింగేశ్వర స్వామి,కాళికలయం,దుర్గ గుడి మరియు జనార్ధనస్వామి ఆలయాలు చూడదగినవి.బారువ చూడటానికి గోవాని తలపిస్తుంది.దీన్ని ఆంధ్ర గోవా అని అనుకోవచ్చు.ప్రబుత్వం దృష్టి పెడితే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా బారువా ని అభివృద్ధి చెయ్యవచ్చు. కానీ ఏమి చేస్తాం మన ప్రబుత్వాలకి,ప్రజా ప్రతినిధులకి ఇలాంటి వి పట్టవు కదా.

పురాణాల ప్రకారం బారువ ని బరాహారపురం అని పీల్చే వారని అంటారు.దీనికి ఒక కధ ప్రచారం లో వుంది. స్కంధపురాణం ఆధారముగా తూర్పు కనుమలలో సంచరించిన పాండవులు ఒక అడవి జంతువుని వేటాడే ప్రయత్నములో విడిచిన బాణము సుదూరములో వున్న ఒక గోవును తాకగా గోవు చనిపోయింది. గొహత్యా మహా పాపమని తలచి పాపవిమోచనకోసము ఆలోచించారు. ఈ నేపథ్యములో మునీశ్వరుడు ప్రత్యక్షమై మరణించిన చెందిన ఆవుని సముద్రతీరానికి తీసుకివెళ్ళి  కర్మకాండలు నిర్వహించాలని సలహా ఇవ్వడంతో ఆ గోవును సముద్ర తీరానికి తీసుకు వెళ్ళి అంత్యక్రియలు చేపట్టారు. అనంతరము అక్కడే వున్న మహేంద్రతనయ నదీ-సాగర సంగమ స్థలములో పాండవులు స్నానాలు ఆచరించి, మోక్షము పొందేరని చారిత్రక కథనము. పాండవులు సంగమ స్నానము చేసిన అనంతరము సమీపాన వున్న గ్రామానికి వెళ్లి అక్కడ 12 మంది బ్రాహ్మణుల సమక్షములో యజ్ఞోపవీతము చేసి భారీ ఎత్తున యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆ గ్రామాన్ని 'బారాహరాపురం' గా పిలిచేవారు, కాలక్రమేణా అది బారువగా మారినది. బారువ గ్రామము పుణ్యక్షేత్రాల నిలయముగా గుర్తింపు పొందినది. పాండవులు వేటాడిన గోవును కర్మకాండ కోసం సముద్ర తీరానికి తీసుకువస్తుండగా గ్రామానికి పశ్చిమభాగములో ఆ గోవు నుండి ఒకటి తక్కువ కోటి రక్తపుచుక్కలు ఒకేచోట నేలపై పడినట్లు చారిత్రిక కదనము. అందువలన ఈ స్థలాన్ని గుప్తకాశీగా పిలుస్తున్నారు. ఈ ప్రదేశములోనే పాండవులు కోటిలింగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతారు. దీనికి దక్షిణం వైపున బ్రహ్మజనార్ధన స్వామి ఆలయము, ఊరిమధ్యలో జగన్నాధస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయమ్, మహంకాళీకనకదుర్గ ఆలయాలు ఇక్కడ వెలసి ఉన్నాయి. నాటి నుంచి ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే పుణ్యఘడియల్లో ఇలా అధిక సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు చేపట్టడము సంప్రదాయముగా వస్తూ ఉంది.
 జనార్దనస్వామి ఆలయం 
జనార్ధన స్వామి గుడి 

కోటిలింగేశ్వర స్వామి గుడి 

కోటిలింగేశ్వర స్వామి గుడి లోపల 
బ్రిటిష్ వారి కాలం లో బారువ ఓడరేవు గా కూడ ఉండేది.కాలక్రమేణ అధి మూతబడిపోయింది.ఇప్పటికీ బారువ సముద్రం లో  మనకి మునిగి ఉన్న ఓడ యొక్క గొట్టం కనిపిస్తుంది.
బారువ  శ్రీకాకుళం నుండి 107KM దూరంలో,సోంపేటనుండి 8కే‌ఎం దూరంలో,ఇచ్చాపురం నుండి
14 KM దూరం లో వుంది.ఇక్కడ ఆంద్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు (AP టూరిజం)నిర్మించిన రిసార్ట్స్ మరియు కాటెజేలు ఉన్నాయి.సెలవులలో  సముద్ర తీరంకి వెళ్ళి ఆనందం గా గడపటానికి బారువ బీచ్ కి వెళ్లవచ్చు.
హరిత రిసార్ట్స్ 

ఇంకా శ్రీకాకుళం లో చూడవలిసిన ప్రదేశాలు ఇచ్చాపురం లో ఉన్న ఆ ఊరి ఇలవేల్పుగా చెప్పే స్వేచ్చావతి అమ్మవారి  ఆలయం.ఈ ఆలయాన్ని పద్నాలగవ శతాబ్ధం లో నిర్మించారు.
స్వేచ్ఛవతి అమ్మవారి గుడి 
మాలియపుట్టి లో వుండే రాధాగోవిందస్వామి ఆలయం.ఈ ఆలయం కూడా శిల్పకళతో  చూపరులను కట్టిపడేస్తుంది.ఈ ఆలయాని 1810 సంవత్సరం లో పర్లాకిమిడి రాజైన శ్రీ వీరేంద్ర ప్రతాప్ రుద్ర గజపతి  గారి సతీమణి శ్రీమతి విష్ణుప్రియ మహారాణి నిర్మించారు.మహరాణి తన పుట్టింటి స్త్రీధనంతో ఈ మందిరాన్ని నిర్మించుకుంది అని చెబుతారు ఆ ప్రాంతం వారు. ఈ ఆలయ నిర్మాణం పూరీ మరియు కొనార్క అలయ నిర్మాణ శైలి లో కట్టబడింది.ఈ ఆలయ గోడలపై నాలుగు వేదాల సారం తెలిపేటట్టుగా శిల్పాలు చెక్కబడి వున్నాయి.
ఈ ఆలయం కూడా మహేంద్రతనయ నది ఒడ్డున కట్టబడిన ఆలయం.ఈ ఆలయం పర్లాకిమిడి నుండి 10కే‌ఎం దూరంలో,టెక్కలి నుండి 20 KM దూరంలో మరియు పలాస నుండి 30 KM దూరం లో వుంది.
రాధాగోవింద స్వామీ ఆలయం  ,మలియాపుట్టి 
కళింగపట్నం బీచ్ కూడా చూడవలిసిన అందమైన  ప్రదేశం. కళింగపట్నం శ్రీకాకుళానికి 25 కి. మీ. దూరంలో ఉన్నది. వంశధార నది ఇక్కడే బంగాళా ఖాతము లో కలుస్తుంది. సువిశాలమయిన బీచ్ తోటలు, బౌద్ద కట్టడాలు, దీప స్తంభం లతో అందంగా కనిపిస్తుంటుంది.
ఇక్కడ AP టూరిజం వారి హరిత రిసార్ట్స్, కళింగ రిసార్ట్స్ పర్యటకులకోసం ఉన్నాయి.

శ్రీకాకుళం యాత్ర సిరీస్ ని ఇక్కడితో ముగిస్తున్నాను.ఏమన్నా తప్పులు దొర్లివుంటే చెప్పగలరు.సరిదిద్దుకుంటాను.
తరువాత  సిరీస్ లో  విజయనగర జిల్లా  లో ఉన్న సందర్శన స్థలాల గురించి  తెలుసుకుందాం .
ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః 

Saturday, October 20, 2018

యాత్ర 07-శ్రీకాకుళం- శాలిహుండం


శాలిహుండం

శ్రీకాకుళం లో హిందూ దర్మం తో పాటు బౌద్దంమతం కూడా బాగా  వర్ధిలింది అని  శాలిహుండం ద్వారా మనకు తెలుస్తుంది.శాలిహుండం ఒక  చరిత్రాత్మక విశిష్టిత కలిగిన బౌద్ధ క్షేత్రం.శాలిహుండం  శ్రీకాకుళం జిల్లా లో గార మండలం లో ఉంది.
ఈ బౌద్ధ క్షేత్రం వంశధార నది ఒడ్డున వున్న బౌద్ద ఆరామాలు మరియు శిథిలమైన  పురాతన దేవాలయాలతో ఉన్న పర్యటక ప్రాంతం.శాలిహుండం కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందటానికి మంచి అవకాశం ఉన్న అందమైన చరిత్రాత్మ బౌద్ధ క్షేత్రం.ఈ క్షేత్రాన్ని మొదట 1919 లో గిడుగు రామ్మూర్తి పంతులు గారు కనుగొన్నారు.

శాలిహుండంకి పూర్వం శాలివాటిక(బియ్యపు ధాన్యాగారము) అని శల్యపేటిక అని అనేవారు.శాలిహుండం లో కనిపించే బౌద్ధ శిధిలాలు బౌద్ధ మతపు చివరి కాలానికి చెందినవి గా చెప్పవచ్చు.ఆన్ని బౌద్ధక్షేత్రాలన్నే ఇధి కూడా కొండపైనే ఉంటుంది.ఇక్కడి తవ్వకాలలో శల్యపేటికలు, నాలుగు స్థూపాలు, ఒక చైత్య గృహము మరియు అనేక శిల్పాలు బయల్పడినవి. క్రీ.పూ.2వ శతాబ్దము నుండి 12వ శతాబ్దము వరకు విస్తరించి ఉన్న ఈ శిల్పాలు థేరవాద, మహాయాన మరియు హీనయాన మొదలైన మూడు బౌద్ధాల యొక్క ప్రభావాల్ని ప్రతిబింబిస్తున్నాయి.

ఇక్కడ తార మరియు మారిచి విగ్రహాలు తవ్వకాలలో దొరికాయి.ఇక్కడి నుండి సుమత్ర దీవులకు మరియు తూర్పు దేశాలకు బౌద్దం విస్తరించినట్టు  తెలుస్తుంది.ఈ స్మారక కట్టడాలన్నీ నాలుగు స్తూపాలపై నిర్మించారు.కొండకి కుడువైపున వృత్తాకార స్తూపం ఉంటుంది.మెట్లవంటి నిర్మాణం తో కూడిన వృత్తాకార మరియు దీర్ఘచతురస్రాకార స్తూపాలు, మండప స్తంభాలు బౌద్ద శైలి లో నిర్మించారు.అన్నిటికంటే పెద్ద స్తూపం వృత్తాకారంలో కొండ చివరి బాగాన నిర్మించారు.
2011 లోబుద్దుని ఏకశిలా విగ్రహం తవ్వకాలలో బయటపడింది. పరిచారికలు వింజామరలు విసురుతుండగా బుద్ధుడు వృక్షం కింద కూర్చొని తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న ఈ ఏక శిలావిగ్రహం వెలుగు చూసింది. ప్రస్తుతం బుద్ధుని కొండ గుట్ట పైన నుయ్యి వంటి ప్రదేశం మాదిరే వేణుగోపాలుని కొండ పై కూడా పడమటి భాగ శిఖరాగ్రాన ఉండి అక్కడ ఈ విగ్రహం వెలుగుచూసింది.
శాలిహుండం శ్రీకాకుళం కి 20KM దూరంలో ఉంది. శ్రీకాకుళం నుండి గార కి ప్రతి 30 నిమిషాలికి  బస్సులు ఉన్నాయి .అక్కడి నుండి 3KM దూరంలో ఉంది.
ఓం శ్రీభగవాన్ రమణాయ నమః

యాత్ర 06-శ్రీకాకుళం- శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం -మందస



శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం -మందస


శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం పేరుని బట్టి ఈ ఆలయం ఎక్కడో తమిళనాడు లో ఉండే వైష్ణవ దేవాలయంలా అనిపిస్తుంది.కానీ ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలో ఉన్న ప్రాచీన దేవాలయం. శ్రీకాకుళంనికి వంద కిలోమీటర్ల దూరం లో ఎనిమిది వందల నాటి  అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం తో కట్టిన అతి పురాతన ఆలయం.
ప్రాచీన కళింగ నిర్మాణ శైలి,పచ్చని పల్లె వాతావరణం, ఎత్తైన కొందలమద్యన ఉన్న శ్రీ వాసుదేవ పెరుమాళ్ల ఆలయాన్నిసందర్శిస్తే అన్నీ వైష్ణవ ఆలయాలని దర్శించినంత ఫలమని చెపుతారు.ఈ
ఆలయం లోకి ప్రవేశించినంతనే ఏదో తెలియని ఒక అద్యాత్మిక ఆనందానికి లోను అవుతాము. సుమారు 266 సంవత్సరాలక్రితం ఇది పునర్నిర్మితమయినట్టు ఇక్కడ లభించిన ఆధారాలబట్టి తెలుస్తున్నది. ఎర్రని ఇసుక రాయితో కళింగ శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్పసంపద వర్ణనాతీతం. ఆలయంలో నెలకొని ఉన్న నిలువెత్తు సాలగ్రామ మూలమూర్తి కంచి లో కొలువైన వరదరాజ స్వామి విగ్రహాన్ని పోలి ఉంటుంది.ఇక్కడ ఉండే స్వామి విగ్రహాన్ని కంచి నుండి తయారీ చేయించి తెచ్చారని అంటారు.గత శతాబ్దము చివర వరకు ఇది మంచి వేదాధ్యయన కేంద్రముగా కూడా విలసిల్లినట్లు కూడా తగిన ఆధారాలు ఉన్నాయి.
పెరుమాళ్  స్వామి వారి సన్నిధి 
ఈ ఆలయాన్ని ఎవరు యెప్పుడు నిర్మించారో సరైన సమాచారం లభించటం లేదు.కానీ మూడువందల సంవత్సరాల క్రితం మందసను పాలించిన రాజు మణిదేవమహారాజు ఈ ఆలయాన్ని పునరుద్దరించారు.ఆ తరువాత ఎవరు పట్టించుకోకపోవటం వలన శిధీలస్థితికి వచ్చింది.చిన్న జీయరు స్వామి వారి చొరవతో మరలా గత వైభవాన్నిసంతరించుకుంది.
శ్రీ వాసుదేవ పెరుమాళ్ల ఆలయానికి ఒక అద్భుతమైన చరిత్ర వుంది.పెద్ద జీయరు స్వామి వారు ఇక్కడే శ్రీభాష్యం అద్యనయం చేశారు.పెద్ద జీయరు స్వామి అంటే ఇప్పటి చిన్న జీయరు స్వామి వారి గురువు గారు. ఆ కాలంలో ఇక్కడి  ఆచార్యులు మందసా రామానుజులు వేదాంత విద్యలో నిష్ణాతులు .వారు కాశి వరకు వెళ్ళి విద్యత్ గోష్టులలో పాల్గొని పలువురు వేద విధ్వాంసులను వేదాంత చర్చలలో ఓడించి చాలా  ప్రశంశలు అందుకున్నారు.వీరి కీర్తిని గురించి విన్న పెద్ద జీయరు స్వామి వారికి వారి వద్దశ్రీ భాష్యం నేర్చుకోవాలని వారికిని మరియు వారి మిత్రులైన గోపాలాచార్య స్వామి వారి కోరిక.అందుకని పెద్ద జీయరు స్వామి వారు, వారి మిత్రులు గోపాలాచార్యస్వామివారితో కలసి నేటి రాజమండ్రి నుంచి శ్రీభాష్యం అధ్యయనం చేయడానికి కాలినడకన మందసకు చేరుకున్నారు. గురువులకు ప్రణమిల్లి శ్రీభాష్యం నేర్పించమని అడిగారు .ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు .కానీ ఆ రోజు  రాత్రి ఆలయప్రాంగణంలో నిద్రించిన శిష్యులిద్దరికీ వారు రాజమండ్రి వద్ద దాటి వచ్చిన గోదావరి వంతెన విరిగి వరదలో కొట్టుకుపోయినట్లు కల వచ్చింది. అది అపశకునంగా భావించిన శిష్యులిద్దరు తమ విద్యాభ్యాసానికి ఆటంకము కలుగుతుందేమోనని భయపడుతూ గురువు గారివద్దకు వెళ్ళి తమ కల సంగతి చెప్పారు. గురువుగారు వారిని ఊరడించి ఆలయంలో ఉన్నశ్రీ వాసుదేవ పెరుమాళ్ వద్దకు వారిని తీసుకుని వెళ్ళి స్వామికి సాష్టాంగ నమస్కారము చేయించి, వారు కూడా చేసారు. ఆ సమయంలో వాసుదేవుని విగ్రహం నుండి ఓ దివ్యమయిన కాంతి ప్రసరించినదట. వాసుదేవుని అనుగ్రహం వల్ల శిష్యులిద్దరు సుమారు 2 సంవత్సరాలలో పూర్తికావలసిన శ్రీభాష్యం అధ్యయనాన్ని కేవలం 6 నెలలలోనే పూర్తి చేసుకున్నారు . అందుకని ఇక్కడి దేవుని జ్ఞానప్రదాతగా, అభయప్రదాతగా భక్తులు కొలుస్తారు.
తమ గురువు గారు ఇక్కడ తమ ఆద్యాత్మిక విద్యను అభ్యసించిన క్షేత్రం కావటం తో చిన్నజీయరు స్వామి పెద్దజీయరు స్వామి వారి శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్నిపునర్నిర్మించారు.వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి ఒక్కప్పడు సుమారుగా పదిహేడు వందల ఎకరాల మాన్యం ఉండేది.కానీ మనుషుల అత్యాశకి ప్రతీకగా మూడు ఎకరాలు మాత్రము మిగిలింది.ఆలయం కూడా శిధిలమయిపోయింది.కానీ 1988 లో చిన్నజీయరు స్వామి వారు ఈ ఆలయ చరిత్రను తెలుసుకొని ఖర్చుకు వెనుకడకుండా,అన్ని ప్రభుత్వ లాంచనాలు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారినుండి ఆలయాన్ని స్వాధీనం చేసుకుని, ఒడిషా నుంచి శిల్పులను రప్పించి యదాతధంగా ఆలయాన్నిపునర్నిర్మింపచేసారు. 

గురువులు  పెద్దజీయరు స్వామివారి విద్యాభ్యాసానికి గుర్తుగా వారి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా చిన్నజీయరు స్వామివారు 2009 ఫిబ్రవరి నెలలో పూర్తిగా శిథిలమయిన ఈ ఆలయాన్నిపునఃప్రతిష్ట చేసారు.
శ్రీ వాసుదేవ పెరుమాళ్ల ఆలయం లో స్వామి వారు శ్రీదేవి,భూదేవి అమ్మవార్లతో కొలువు తీరి ఉన్నారు.ఇంకా స్వామి వారితో పాటు చిన్ని కృష్ణుడు,గోదాదేవి అమ్మవారు కొలువై పూజలు అందుకుంటున్నారు.

శ్రీ వాసుదేవ పెరుమాళ్ల ఆలయ దర్శన వేళలు ఉదయం 5.30 AM నుండి 11.30 AM వరకు మరియు 4.30PM నుండి 7PM వరకు.ప్రతి సంవత్సరం మాఘమాసం లో బ్రహ్మొత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి.
ఈ ఆలయం చుట్టుపక్కల అనేక దర్శనీయ స్థలాలు వున్నాయి.అందులో ఒకటి వరాహ స్వామి ఆలయం మరియు పాండవుల ఆలయాలు.ఇవి మహేంద్రగిరి పర్వతం వద్దవున్నాయి.ఇంకా అలనాటి రాజవైభవం కి గుర్తుగా మందస కోట ను కూడా దర్శించవచ్చు.స్వామి వారి ఆలయం పకక్నే వున్న శివాలయం చూడవలసిన క్షేత్రం.
మందస జిల్లా కేంద్రం అయిన శ్రీకాకుళం నుండి 100 KM దూరం లో వుంది.ఇంకా చెన్నై-కొలకత్తా జాతీయ రహదారి లో వున్న పలాస నుండి 5 KM మాత్రమే.

ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః 

Friday, October 19, 2018

యాత్ర 05-శ్రీకాకుళం-శివాలయం – రావివలస



శివాలయం రావివలస

మల్లికార్జునస్వామి వారి లింగం 
శ్రీకాకుళం జిల్లాలో మరొక చూడవల్సిన ప్రదేశం రావివలస లోని శివాలయం.ఇక్కడ స్వామి మల్లికార్జునుడిగా కొలవబడుతున్నాడు.ఈ స్వామిని ఎండల మల్లికార్జునుడు అని కూడా అంటారు.ఈ ఆలయ ప్రత్యేకత యేమిటంటే అన్నీ చోట్ల శివుని కి ఆలయాలు వున్నాయి.కానీ ఈ మల్లికార్జునుడు కి  ప్రత్యేకించి ఎటువంటి ఆలయం లేదు.అంటే ఇక్కడ ఆలయానికి తలుపులు ,పైకప్పు లాంటివి ఏమి ఉండవు .స్వామి వారు ఎండ కి ఎండుతూ వాన కి తడుస్తూ ఆరు బయటే  కొండ మీద కొలువై ఉన్నారు.స్వామి పల్లె ప్రజల కొంగు బంగారమై,పిలిస్తే పలికే దైవం గా ఇక్కడ ఉంది పూజలు అందుకుంటున్నారు.
కొండ పై కొలువున్న ఈ శివలింగం చాలా పెద్దది అంటే సుమారుగా ఇరయై అడుగుల పైనే ఉంటుంది.ఇంత పెద్ద శివలింగం దేశంలో ఎక్కడ లేదు.ఈ ఈ ఆలయనికి వందల సంవత్సరాల చరిత్ర వుంది.ఈ ఆలయాన్ని  కార్తీక కైలాసం అని కూడా అంటారు.
స్థల పురాణం ప్రకారం  త్రేతా యుగంలో శ్రీరాముల వారు రావణ సంహార అనంతరం తిరిగి అయోధ్యకు వెళుతూ మార్గమధ్యంలో సుమంచ పర్వతగిరి శిఖరంపై తన అనుచరగణంతో విడిది చేసారు. అనుచరగణంలో ఉన్న సుశేణుడు అనే దేవవైద్యుడు ఆ పర్వత ప్రాంతములో కల ఔషద, మూలికా వృక్షజాతులను చూసి ఆనంద పరవశుడయ్యాడు. కాని చుట్టూ ఔషదాలున్నా అక్కడి జనులంతా రోగగ్రస్తులై ఉండటం అతనిని  చాలా ఆశ్చర్యపరచింది. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య ఈతిబాధల నివారణార్ధం తను ఏదైనా చేయలని తలంచి,బొందితో కైలాసం చేరుకోవాలనే తన కోరికను నెరవేర్చుకోవడానికి కూడా ఇదేమంచి ప్రదేశంగా అతనికి అనిపించింది. శ్రీరామునికి తన నిర్ణయాన్ని తెలియపరచి తను ఈ సుమంచ పర్వత ప్రాంతంలోనే తపమాచరించాలనుకొంటున్నట్లుగా చెప్పాడు. శ్రీరాముడు అతని వాంఛితం నెరవేరాలని ఆశీర్వదించి తన పరివార, అనుచరులతో తరలి వెళ్ళిపోయారు.తరువాత సుశేణుడు సుమంచ పర్వతంపై శివుని గురించి ఘోర తపస్సు చేయనారంబించాడు. కొంతకాలం తరువాత రాముల వారు సుశేణుడు ఎలా ఉన్నాడో క్షేమసమాచారాలు చూసిరమ్మని హనుమంతుల వారిని పంపించారు. హనుమంతులవారు సుమంచ పర్వతప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ సుశేణుడు కనిపించలేదు కాని అతని కళేబరం కనిపించింది. సుశేణుడు తపమాచరిస్తూ శివసాయుజ్యం పొందినట్టు భావించి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పరచి సుశేణుని కళేబరాన్ని అందులో ఉంచి గొయ్యి పూడ్చి అక్కడ దొరకిన మల్లెపూలను ఆ ప్రదేశంలో ఉంచి దానిపై జింక చర్మాన్ని కప్పి శ్రీరామునికి విషయాన్ని చెప్పేందుకు వెళతాడు.
అప్పుడు సీతారాములు లక్ష్మణ సమేతంగా హనుమంతుని తో పాటు సుశేణుడు తపస్సు చేసిన సుమంచ పర్వతానికి వచ్చారు.రాముల వారికి సుశేణుడు శరీరం చూపించటానికి జింక చర్మ ఎత్తి చూడగా  సుశేణుడు శరీరం బదులు శివలింగం దర్శనం ఇచ్చింది.అప్పుడు సీతారాముల వారు అక్కడ కోనేటి లో స్నానమాచరించి ఆ శివలింగానికి పూజించుట ప్రారంబించగానే శివలింగం పెరుగుతూ వచ్చింది.అదే సమయంలో ఔషద, మూలికల సువాసనలతో కూడిన గాలి శివలింగాన్ని తాకి ప్రచండ గాలి గా మారి,ఆ గాలి వీచినంత మేర అందరికీ ఉన్నఅనారోగ్యాలు మొత్తంగా తుడిచిపెట్టుకుపోవటం,ఇంకా ఒకరకమైన శక్తి తేజస్సు రావడం గమనించారు.శ్రీ రాముడు గుడి కడదామని అనుకున్నా లింగం అలా పెరుగుతూ పోవటం తో గుడి కట్టే ఆలోచనని విరమించుకున్నారట.అప్పటి నుండి లింగం అలా పెరుగుతూనే ఉంది. మల్లెపూలతో పూజింపబడి జినంతో కప్పబడి ఉన్నందున స్వామి మల్లికాజీన స్వామి గా పిలవబడ్డారు.కాలక్రమేణ మల్లికార్జున స్వామి గా మార్పుచెందిదని క్షేత్రపురాణం చెపుతోంది.ఈ శివలింగానికి ద్వాపర యుగం లో పాండవులు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి సీత కుండంగా పిలవబడే కోనేరులో స్నానమాచరించి  స్వామి వారిని సేవించి ఇక్కడ ఉన్న గుహలో కొంత కాలం వున్నట్టు క్షేత్రపురాణం చెపుతోంది.

సీతాకుండం 
ఈ క్షేత్రం పురాణ కాలం నుండే మహా  శివక్షేత్రంగా ప్రసిద్దికెక్కింది. కార్తీక మాసంలో ఇక్కడ అశ్వర్ధ వృక్షం క్రింద గడిపేందుకు మరియు శివరాత్రి పర్వదినాన ఆలయానికి భక్తులు వేలసంఖ్యలో తరలివస్తారు. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని లింగోద్భావాన్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి, కార్తీక సోమవారం నాడు ఈక్షేత్రంలో అభిషేక, ఉపవాస, జాగరణలు ఎవరు చేస్తారో వారి మనోవాంఛలు సిద్ధిస్తాయని,ఈ స్వామిని దర్శించినవారికి దీర్ఘరోగాలు ముఖ్యంగా చర్మరోగాలు పోయి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారని భక్తుల ప్రగాడనమ్మకం. 

1870 లో స్వామి కి టెక్కలి జమీందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ ఆలయాన్ని నిర్మించగా అది తొందరలోనే శిధిలమై పోయింది,భక్తులు తిరిగి ఆలయ నిర్మాణానికి పూనుకొనగ స్వామి వారు కలలో కనిపించి తనకు గుడి వద్దు అని ఆరుబయట ఉండటమే తనకి ఇష్టమని ఎండకు,వానకు తడిచి ఎండల మల్లికార్జునుడి గా ప్రాచుర్యం పొందుతానని చెప్పారు.
ఎండల మల్లికార్జున స్వామి వారి ఆలయం శ్రీకాకుళం నుండి సుమారుగా 56 KM దూరంలో  టెక్కలి కి 5 km దూరంలోఉంది. శ్రీకాకుళం నుండి టెక్కలి కి ప్రతి 15 నిమిషాలకు బస్సులు ఉన్నాయి.అక్కడి నుండి అనగా టెక్కలి నుండి రావివలస కు ఆటొలు ఉంటాయి.ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి వుంచుతారు.

ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః 


యాత్ర 04-శ్రీకాకుళం-సంగమేశ్వర దేవాలయం -సంగం



సంగమేశ్వర దేవాలయం -సంగం



శ్రీకాకుళం  జిల్లా లో  వంగర మండలం లో సంగం అనే గ్రామం లో నాగావళి నది ఒడ్డున ఉన్న మరియొక ప్రాచీన ఆలయం సంగమేశ్వర ఆలయం.ఈ ఆలయం  శ్రీకాకుళం  నుండి 56 km దూరంలో రాజాం నుండి 20 km దూరం లో వుంది.ఇక్కడ నాగావళి,సువర్ణముఖి మరియు వేగవతి నదులు కలిసే ప్రదేశం.అలహాబాద్ వలె ఇకడ  త్రివేణి సంగమం జరిగే ప్రదేశం.అందుకనే ఈ ఊరికి సంగం అని పేరు మరియు ఇక్కడ స్వామి వారిని సంగమేశ్వరుడు అని పిలుస్తారు.ఈ శివాలయం  లో వున్న లింగాన్ని శ్రీ కృష్ణుని అన్నయ్య అయిన బలరాముల వారు ప్రతిష్టించారని చెపుతారు.ఈ లింగం ఇక్కడ వున్న పంచలింగాలలో ఒకటి గా చెపుతారు.పంచలింగాలు గురుంచి  పురాణాలలో ఒక కధ ప్రాచుర్యం లో వుంది.
పాండవులకు,కౌరవులకు జరిగిన కురుక్షేత్ర యుద్దం లో శ్రీ కృష్ణుడు పాండవుల వైపు,బలరాముడు కౌరవల పక్షాన నిలబడి యుద్ధం చేశారు.శ్రీకృష్ణుడు పాండవుల వైపు వుండటం వలన బలరాముడు నిరాశ చెంది దేశాటన కి బయలుదేరారు.ఆ ప్రయాణం లో బలరాముడు కలహంది అని రాయగడ దగారకు చేరుకున్నారు.కానీ అక్కడ ప్రజలందరూ నీళ్ళు,ఆహారం లేక కరువు తో భాదపడటం గమనించారు.ఆక్కడి ప్రజల కోసం శివుని కోసం తపస్సు చేయగా శివుడు గంగ ని వరంగా ప్రసాదించారు.బలరాముడు అక్కడ తన నాగలి తో తవ్వగ ఒక జలధార భూమి నుండి ఉద్భవించి నది గా ప్రవహించింది.నాగలి తో  తవ్వినది కావున ఈ నదికి నాగావళి అని పేరు.నాగావళి  ఇప్పటి ఒడిస్సా లోని కలహంది దగగ్ర పుట్టి  శ్రీకాకుళం జిల్లాలో కల్లేపల్లి దగ్గర బంగాళాఖాతం లో కలుస్తోంది.ఈ నాగావళి ఒడ్డున బలరాముడు ఐదు లింగాలను ప్రతిష్టించారని  ప్రతీతి.ఈ లింగాలు వరుసగా
1.కెకెవేశ్వరస్వామి లేదా హటకేశ్వర స్వామి వారి ఆలయం ,పాయకపాడు రాయగడ  ఒడిస్సా.
2.చెన్నకేశ్వర స్వామి /సోమేశ్వర స్వామి వారి ఆలయం గుంప,పార్వతిపురం,ఆంధ్రప్రదేశ్
3.సంగమేశ్వర స్వామి వారి ఆలయం ,సంగం,రేగిడి ఆముదవలస దగ్గర, శ్రీకాకుళం ,ఆంధ్ర ప్రదేశ్.
4.ఉమా రుద్ర కోటేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీకాకుళం ,ఆంధ్రప్రదేశ్
5. మణి నాగేశ్వర స్వామి వారి ఆలయం,కల్లేపల్లి , శ్రీకాకుళం ,ఆంధ్రప్రదేశ్.

ఈ పంచలింగాలలో ఒకటి అయిన  సంగమేశ్వర ఆలయం నిర్మాణ శైలి కళింగ నిర్మాణ శైలి లో వుంటుంది.త్రివేణి సంగమం కావటం వలన పర్వదినాలలో,కార్తీక మాసం లో మరియు మహా శివరాత్రి రోజు భక్తులు చాలా ఎక్కువగా వస్తుంటారు.ఈ ఆలయం లోపల ఒక గుహ ఆముదలవలస వరకు వుంది.పట్టణ హడావిడి కి దూరంగాపల్లె వాతావరణం లో చాలా ప్రశాంతంగా ఉంటుంది.పరవదినాలలో కాకుండా మములరోజులలో వెళితే బావుంటుంది.
నాగావళి 

సంగం కి చేరుకోవటానికి ముందు గా పాలకొండ,రాజాం లేదా సీతాం పేట గాని వచ్చి అక్కడ నుండి సంగం కి ఆటొ కానీ APRTC బుస్సులో కానీ వెళ్లవచ్చు.

 ఓం  శ్రీ భగవాన్ రమణాయ నమః