Sunday, October 21, 2018

యాత్ర 08-శ్రీకాకుళం-బారువ


బారువ సముద్ర తీరం బారువ


మన ఆంద్రప్రదేశ్ కి ఉన్నఅధ్బుతమైన వరం పొడవైన  అందమైన బంగాళాఖాత సుమద్రతీరం.అలాంటి అందమైన సముద్రతీరాలలో శ్రీకాకుళం జిల్లా లో సోంపేట కి దగ్గరగా ఉన్న బారువ బీచ్ ఒకటి. ఇక్కడ తీరము కంచూపు మేర ఇసుక తిన్నెలతో మరియు కొబ్బరి తోటలతో చాలా అందముగా, ఆహ్లాదకరముగాను ఉంటుంది. ఉదయిస్తున్న సూర్యుడ్ని ఇక్కడి సుముద్రతీరముంలో నిలుచుని చూడటం ఒక అద్భుతమైన అనుభవం.  మహేంద్రతనయ నది తూరుపుకనుమలలో పుట్టి ఒడిస్సా ,ఆంద్ర రాష్ట్రాల గుండా ప్రవహించి బారువ గ్రామం వద్ద సాగరం లో కలిసే సాగరసంగమం.

బారువ గ్రామాన్ని ఆలయాల గ్రామం గా చెపుతారు.ఇక్కడ ఎటు చూసిన పురాతన ఆలయాలలే కనిపిస్తాయి.ఇక్కడ  సముద్రపు ఒడ్డున ఉన్న శ్రీ కొటేలింగేశ్వర స్వామి,కాళికలయం,దుర్గ గుడి మరియు జనార్ధనస్వామి ఆలయాలు చూడదగినవి.బారువ చూడటానికి గోవాని తలపిస్తుంది.దీన్ని ఆంధ్ర గోవా అని అనుకోవచ్చు.ప్రబుత్వం దృష్టి పెడితే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా బారువా ని అభివృద్ధి చెయ్యవచ్చు. కానీ ఏమి చేస్తాం మన ప్రబుత్వాలకి,ప్రజా ప్రతినిధులకి ఇలాంటి వి పట్టవు కదా.

పురాణాల ప్రకారం బారువ ని బరాహారపురం అని పీల్చే వారని అంటారు.దీనికి ఒక కధ ప్రచారం లో వుంది. స్కంధపురాణం ఆధారముగా తూర్పు కనుమలలో సంచరించిన పాండవులు ఒక అడవి జంతువుని వేటాడే ప్రయత్నములో విడిచిన బాణము సుదూరములో వున్న ఒక గోవును తాకగా గోవు చనిపోయింది. గొహత్యా మహా పాపమని తలచి పాపవిమోచనకోసము ఆలోచించారు. ఈ నేపథ్యములో మునీశ్వరుడు ప్రత్యక్షమై మరణించిన చెందిన ఆవుని సముద్రతీరానికి తీసుకివెళ్ళి  కర్మకాండలు నిర్వహించాలని సలహా ఇవ్వడంతో ఆ గోవును సముద్ర తీరానికి తీసుకు వెళ్ళి అంత్యక్రియలు చేపట్టారు. అనంతరము అక్కడే వున్న మహేంద్రతనయ నదీ-సాగర సంగమ స్థలములో పాండవులు స్నానాలు ఆచరించి, మోక్షము పొందేరని చారిత్రక కథనము. పాండవులు సంగమ స్నానము చేసిన అనంతరము సమీపాన వున్న గ్రామానికి వెళ్లి అక్కడ 12 మంది బ్రాహ్మణుల సమక్షములో యజ్ఞోపవీతము చేసి భారీ ఎత్తున యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆ గ్రామాన్ని 'బారాహరాపురం' గా పిలిచేవారు, కాలక్రమేణా అది బారువగా మారినది. బారువ గ్రామము పుణ్యక్షేత్రాల నిలయముగా గుర్తింపు పొందినది. పాండవులు వేటాడిన గోవును కర్మకాండ కోసం సముద్ర తీరానికి తీసుకువస్తుండగా గ్రామానికి పశ్చిమభాగములో ఆ గోవు నుండి ఒకటి తక్కువ కోటి రక్తపుచుక్కలు ఒకేచోట నేలపై పడినట్లు చారిత్రిక కదనము. అందువలన ఈ స్థలాన్ని గుప్తకాశీగా పిలుస్తున్నారు. ఈ ప్రదేశములోనే పాండవులు కోటిలింగేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతారు. దీనికి దక్షిణం వైపున బ్రహ్మజనార్ధన స్వామి ఆలయము, ఊరిమధ్యలో జగన్నాధస్వామి ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయమ్, మహంకాళీకనకదుర్గ ఆలయాలు ఇక్కడ వెలసి ఉన్నాయి. నాటి నుంచి ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే పుణ్యఘడియల్లో ఇలా అధిక సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు చేపట్టడము సంప్రదాయముగా వస్తూ ఉంది.
 జనార్దనస్వామి ఆలయం 
జనార్ధన స్వామి గుడి 

కోటిలింగేశ్వర స్వామి గుడి 

కోటిలింగేశ్వర స్వామి గుడి లోపల 
బ్రిటిష్ వారి కాలం లో బారువ ఓడరేవు గా కూడ ఉండేది.కాలక్రమేణ అధి మూతబడిపోయింది.ఇప్పటికీ బారువ సముద్రం లో  మనకి మునిగి ఉన్న ఓడ యొక్క గొట్టం కనిపిస్తుంది.
బారువ  శ్రీకాకుళం నుండి 107KM దూరంలో,సోంపేటనుండి 8కే‌ఎం దూరంలో,ఇచ్చాపురం నుండి
14 KM దూరం లో వుంది.ఇక్కడ ఆంద్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు (AP టూరిజం)నిర్మించిన రిసార్ట్స్ మరియు కాటెజేలు ఉన్నాయి.సెలవులలో  సముద్ర తీరంకి వెళ్ళి ఆనందం గా గడపటానికి బారువ బీచ్ కి వెళ్లవచ్చు.
హరిత రిసార్ట్స్ 

ఇంకా శ్రీకాకుళం లో చూడవలిసిన ప్రదేశాలు ఇచ్చాపురం లో ఉన్న ఆ ఊరి ఇలవేల్పుగా చెప్పే స్వేచ్చావతి అమ్మవారి  ఆలయం.ఈ ఆలయాన్ని పద్నాలగవ శతాబ్ధం లో నిర్మించారు.
స్వేచ్ఛవతి అమ్మవారి గుడి 
మాలియపుట్టి లో వుండే రాధాగోవిందస్వామి ఆలయం.ఈ ఆలయం కూడా శిల్పకళతో  చూపరులను కట్టిపడేస్తుంది.ఈ ఆలయాని 1810 సంవత్సరం లో పర్లాకిమిడి రాజైన శ్రీ వీరేంద్ర ప్రతాప్ రుద్ర గజపతి  గారి సతీమణి శ్రీమతి విష్ణుప్రియ మహారాణి నిర్మించారు.మహరాణి తన పుట్టింటి స్త్రీధనంతో ఈ మందిరాన్ని నిర్మించుకుంది అని చెబుతారు ఆ ప్రాంతం వారు. ఈ ఆలయ నిర్మాణం పూరీ మరియు కొనార్క అలయ నిర్మాణ శైలి లో కట్టబడింది.ఈ ఆలయ గోడలపై నాలుగు వేదాల సారం తెలిపేటట్టుగా శిల్పాలు చెక్కబడి వున్నాయి.
ఈ ఆలయం కూడా మహేంద్రతనయ నది ఒడ్డున కట్టబడిన ఆలయం.ఈ ఆలయం పర్లాకిమిడి నుండి 10కే‌ఎం దూరంలో,టెక్కలి నుండి 20 KM దూరంలో మరియు పలాస నుండి 30 KM దూరం లో వుంది.
రాధాగోవింద స్వామీ ఆలయం  ,మలియాపుట్టి 
కళింగపట్నం బీచ్ కూడా చూడవలిసిన అందమైన  ప్రదేశం. కళింగపట్నం శ్రీకాకుళానికి 25 కి. మీ. దూరంలో ఉన్నది. వంశధార నది ఇక్కడే బంగాళా ఖాతము లో కలుస్తుంది. సువిశాలమయిన బీచ్ తోటలు, బౌద్ద కట్టడాలు, దీప స్తంభం లతో అందంగా కనిపిస్తుంటుంది.
ఇక్కడ AP టూరిజం వారి హరిత రిసార్ట్స్, కళింగ రిసార్ట్స్ పర్యటకులకోసం ఉన్నాయి.

శ్రీకాకుళం యాత్ర సిరీస్ ని ఇక్కడితో ముగిస్తున్నాను.ఏమన్నా తప్పులు దొర్లివుంటే చెప్పగలరు.సరిదిద్దుకుంటాను.
తరువాత  సిరీస్ లో  విజయనగర జిల్లా  లో ఉన్న సందర్శన స్థలాల గురించి  తెలుసుకుందాం .
ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః 

1 comment:

  1. నదీ సాగర సంగమం ఏప్పుడూ చూడలేదు .. మనకి దగ్గర లోనే ఇంత చక్కటి సుందర ప్రదేశాలు వున్నాయని తేలీయజేసినందుకు చాలా దన్యవాదాలు లక్ష్మీ ...

    ReplyDelete